టెన్త్ సంస్కరణలకు పచ్చజెండా | changes in Tenth class examinations | Sakshi
Sakshi News home page

టెన్త్ సంస్కరణలకు పచ్చజెండా

Aug 17 2014 2:22 AM | Updated on Sep 2 2017 11:58 AM

టెన్త్ సంస్కరణలకు పచ్చజెండా

టెన్త్ సంస్కరణలకు పచ్చజెండా

పదో తరగతి పరీక్షల్లో సంస్కరణలకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. సంబంధిత ఫైలుపై శనివారం విద్యాశాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి సంతకం చేశారు.

11 పేపర్ల పాత విధానానికే మొగ్గు  
 9వ తరగతిలోనూ సీసీఈ అమలు
 
 సాక్షి, హైదరాబాద్: పదో తరగతి పరీక్షల్లో సంస్కరణలకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. సంబంధిత ఫైలుపై శనివారం విద్యాశాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి సంతకం చేశారు. సోమవారం దీనికి సంబంధించిన ఉత్తర్వులు వెలువడనున్నాయి. వెంటనే ఈ సంస్కరణలు అమల్లోకి వస్తాయి. 9వ తరగతిలోనూ వీటిని అమలు చేస్తారు. కొత్తవిధానంలో ప్రతి సబ్జెక్టులో ఇంటర్నల్స్‌కు (సహ పాఠ్యకార్యక్రమాలు) 20 మార్కులు ఉంటా యి. అయితే వాటిల్లో తప్పనిసరిగా పాస్ కావాలన్న నిబంధన లేదు. ఇక 11 పేపర్ల పరీక్ష (పాత పద్ధతి) విధానమే అమలు కానుంది. రాత పరీక్ష 80 మార్కులకే ఉంటుంది. హిందీ మినహా ప్రతి సబ్జెక్టులో రెండు పేపర్లు ఉంటాయి. ఒక్క పేపరు 40 మార్కులకు ఉంటుంది. ఇలా రెండు పేపర్లలో 80 మార్కులకు నిర్వహించే పరీక్షల్లో రెండింటిలో కలిపి 28 మార్కులు (35 శాతం) వస్తే చాలు పాస్ అయినట్లే.
 
 గతంలో ద్వితీయ భాషలో 20 మార్కులు వచ్చినా పాస్ చేసే వారు. ఇపుడు అందులోనూ 35 శాతం మార్కులు సాధించాల్సిందే. ఇక రెగ్యులర్‌గా స్కూల్‌కు వెళ్లకుండా పదో తరగతి పరీక్షలు రాసే వారు ఇకపై ఓపెన్ స్కూల్‌లో పదో తరగతి పరీక్షలకు హాజరుకావాలి. ఈ సంస్కరణలకు అనుగుణంగా గ్రేడింగ్ విధానం మార్చింది. బట్టీ విధానానికి స్వస్తి పలుకుతూ, విద్యార్థి స్వయంగా నేర్చుకునే విధానాన్ని అమల్లోకి తెచ్చింది. అయితే మొదట్లో ఇంటర్నల్స్‌కు ఇచ్చే 20 మార్కులకు గాను కనీసంగా 7 మార్కులు (35 శాతం) సాధించాలని, అవి వస్తేనే విద్యార్థి సదరు సబ్జెక్టులో పాస్ అన్న నిబంధన విధించగా ప్రస్తుతం దానిని తొలగించారు. అలాగే రెండు పేపర్లలో (ఒక్కో పేపరుకు 40 మార్కులు) వేర్వేరుగా కనీస మార్కులు రావాలని నిబంధన పెట్టింది. ప్రస్తుతం దానిని కూడా తొలగించిం ది. రెండింటిలో కలిపి కనీసంగా 35 శాతం (28) మార్కులు వస్తే పాస్ అయినట్టే.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement