నైరోబీలో ‘అగ్ర’ పెత్తనం | Sakshi
Sakshi News home page

నైరోబీలో ‘అగ్ర’ పెత్తనం

Published Wed, Dec 23 2015 12:19 AM

WTO Talks Upset inda

ప్రపంచ వాణిజ్య సంస్థ(డబ్ల్యూటీఓ) వేదికగా సంపన్న దేశాలు దాదాపు పదిహేనేళ్లుగా వర్ధమాన దేశాలపై తెస్తున్న ఒత్తిళ్లు ఫలించాయి. కెన్యా రాజధాని నైరోబీలో అయిదురోజులపాటు కొనసాగి శనివారం ముగిసిన సంస్థ మంత్రుల స్థాయి సమావేశంలో తమ వాదననే నెగ్గించుకోగలిగాయి. ప్రస్తుతం 162 దేశాలకు సభ్యత్వం ఉన్న డబ్ల్యూటీఓలో వ్యవసాయ సంబంధ అంశాల్లో తొలిసారి కీలకమైన ఒప్పందం కుదిరిందని, ఇది అసాధారణమైనదని సంస్థ చీఫ్ రాబర్టో అజ్వేడో ఘనంగా ప్రకటించారు. ఇలాంటి కబుర్లకేమిగానీ సదస్సు తీసుకున్న నిర్ణయాలనూ, వాటి పర్యవసానాలనూ గమనించినవారికి వర్ధమాన, నిరుపేద దేశాలు దగాపడ్డ వైనం స్పష్టంగా గోచరిస్తుంది. వాటిని దోవకు తెచ్చుకోవడంలో సంపన్న దేశాలు విజయం సాధించడం కనిపిస్తుంది. అంతర్జాతీయ వాణిజ్యానికుండే అవరోదాలను తొలగించడం... ధనిక, బీద తేడా లేకుండా అన్ని దేశాల్లోనూ జీవన ప్రమాణాలను పెంచడం, సంపూర్ణ ఉపాధి, ఆహార భద్రత, సాంకేతిక పురోగతి, సుస్థిర అభివృద్ధి సాధన ధ్యేయమని చెబుతూ సంపన్న దేశాల చొరవతో 1995లో ఈ సంస్థ ఆవిర్భవించింది.

ధనిక దేశాలు తమ మార్కెట్లను విస్తృతం చేసుకోవడంలో భాగంగానే ఇది ఉనికిలోకొచ్చిందని అప్పట్లో విమర్శలు వెల్లువెత్తాయి. సామాజిక సంస్థలు, ప్రజా సంఘాలు, పార్టీలు సాగించిన ఉద్యమాల ఫలితంగా డబ్ల్యూటీ ఓలో వర్ధమాన, నిరుపేద దేశాలు ఎంతో కొంత వ్యక్తిత్వాన్ని ప్రదర్శించాయి. సంపన్న దేశాల ఒత్తిళ్లను ఏదో మేరకు అధిగమించాయి. కానీ అది ఏ మాత్రం సరిపోదని తాజాగా నైరోబీ సదస్సు రుజువు చేసింది.

 మన దేశంతోసహా వర్ధమాన దేశాల్లో అమలవుతున్న ఆహార భద్రత కార్యక్ర మాలనూ...రైతులకూ, ఇతర వర్గాలకూ ఇస్తున్న సబ్సిడీలనూ సంపన్న దేశాలు ఆదినుంచీ గట్టిగా వ్యతిరేకిస్తున్నాయి. ఈ సబ్సిడీలు మొత్తం ఉత్పాదకతలో పది శాతం మించడానికి వీల్లేదంటూ ప్రతిపాదిస్తున్నాయి. 2001లో మొదలై ఇంకా కొనసాగుతున్న దోహా రౌండ్ చర్చల్లో ఇవి కీలకమైనవి. ఇందులో విజయం సాధించడం సాధ్యపడకపోవడంతో సంపన్న దేశాలు తమ పలుకుబడితో ‘డబ్ల్యూటీఓ ప్లస్’ పేరిట ట్రాన్స్ పసిఫిక్ పార్టనర్‌షిప్(టీపీపీ)వంటి పలు ప్రాంతీయ ఒప్పందాలకు తెరలేపాయి. ఆ పని చేస్తూనే డబ్ల్యూటీఓ సరైన ఫలితాలివ్వలేకపోయింది గనుక ఇతరేతర ఒప్పందాల అవసరం ఏర్పడిందన్న ప్రచారానికీ పూనుకున్నాయి. నైరోబీ మంత్రుల స్థాయి సదస్సులో తాము అనుకున్నది సాధించలేకపోతే అది ‘ముగిసిన అధ్యాయం’గా ప్రకటించడానికి కూడా సంపన్న దేశాలు సిద్ధపడ్డాయి.

  నైరోబీ సదస్సు ఇప్పుడు సాధించిందంటున్న అసాధారణమైన, చరిత్రాత్మ కమైన ఒప్పందం నిజానికి వర్ధమాన, నిరుపేద దేశాలకు శరాఘాతం వంటివి. డబ్ల్యూటీఓ సభ్య దేశాలన్నీ తమ తమ దేశాల్లో రైతులకిస్తున్న ఎగుమతి సబ్సిడీలను గణనీయంగా తగ్గించాలని ఆ ఒప్పందం నిర్దేశిస్తున్నది. సంపన్న దేశాలు ఈ సబ్సిడీల కోతను తక్షణం ప్రారంభించాల్సి ఉండగా వర్ధమాన దేశాలు 2018నుంచి ఆ పని మొదలుపెట్టాల్సి ఉంటుంది. దిగుమతులు వచ్చిపడుతున్నప్పుడుగానీ, ధరలు పడిపోయినప్పుడుగానీ ప్రత్యేక రక్షణ చర్యలకింద దిగుమతులపై ఉండే టారిఫ్‌లను తాత్కాలికంగా పెంచుకోవడానికి వర్ధమాన దేశాలకు వెసులుబాటు నిచ్చారు. అలాగే ప్రజా పంపిణీ వ్యవస్థ కోసం ఆహార ధాన్యాల సేకరణ విషయమై కూడా అనంతర కాలంలో చర్చించడానికి అంగీకారం కుదిరింది. నిజానికి ఇవన్నీ కొత్తగా నైరోబీ సదస్సులో సాధించినవేమీ కాదు. రెండేళ్లక్రితంలో బాలిలో జరిగిన డబ్ల్యూటీఓ సదస్సులోనే ఇందుకు సంబంధించిన అవగాహన కుదిరింది. ఇప్పుడు మంత్రుల స్థాయి సమావేశం దాన్ని పునరుద్ఘాటించడం మినహా కొత్తగా చేసిందేమీ లేదు. వీటితోపాటు పత్తి పండించే దేశాలకిచ్చిన కొన్ని వెసులుబాట్లు, అత్యంత వెనకబడిన దేశాలకు ఐటీ సేవలు అందించడానికి అంగీకరించడంలాంటి చిన్న చిన్న రాయితీలు చేకూరాయి.

 సంపన్న దేశాల ఒత్తిళ్లకు ఇంతగా లొంగిన వర్ధమాన దేశాలు దోహా రౌండ్‌కింద సాధించుకున్న ప్రయోజనాలు భవిష్యత్తులో కొనసాగుతాయన్న హామీని మాత్రం వాటినుంచి పొందలేకపోయాయి. కేంద్ర వాణిజ్య మంత్రి నిర్మలా సీతారామన్ ఈ విషయంలో మన దేశం ఎంతో అసంతృప్తిగా ఉన్నదని ప్రకటించడం బాగానే ఉన్నా అందుకోసం నైరోబీలో ఎందుకు పట్టుబట్టలేదో అనూహ్యం. డబ్ల్యూటీఓలో అంగీకరించిన విధానం ప్రకారం ఏ సమస్యపైన అయినా మెజారిటీ, మైనారిటీ ఓటింగ్ ద్వారా కాక... ఏకాభిప్రాయంతో మాత్రమే అమలు చేసే సంప్రదాయం ఉంది. దాన్ననుసరించి రైతులకిస్తున్న సబ్సిడీలపైనా, ఆహార ధాన్యాలు నిల్వ చేసుకునే హక్కుపైనా గట్టిగా నిలబడవలసింది. ఆ పని చేయకపోవడంవల్ల మరో మూడేళ్లలో సబ్సిడీలను కత్తిరించే పనిని ప్రారంభించాల్సి ఉంటుంది.  దోహా రౌండ్‌లో వర్ధమాన దేశాలు సాధించుకున్న ప్రయోజనాలతో ముడిపెట్టి సబ్సిడీల విషయంలో పట్టుదలతో పోరాడి ఉంటే సంపన్న దేశాలు దారికొచ్చేవేమో! అసలు ఆ దేశాలు తామూ సబ్సిడీలు తగ్గించుకోబోతున్నామని చేస్తున్న వాదనలు పెద్దగా నిలబడేవి కాదు.

మన రైతుకూ, అమెరికాలోని రైతుకూ పోలికే లేదు. వేల ఎకరాల కమతాలుండే అక్కడి రైతుల వార్షికాదాయంతో పోలిస్తే మన రైతు చేతికొచ్చేది ఏ మూలకూ ఉండదు. సబ్సిడీలు తొలగిస్తే అమెరికా రైతు ఆదాయం స్వల్పంగా తగ్గుతుంది. వారు నష్టపోయేదేమీ ఉండదు. మన దేశంలో పరిస్థితి అందుకు విరుద్ధం. ఇప్పుడున్న అరకొర సబ్సిడీలు సరిపోక రోజురోజుకూ రుణాల ఊబిలో కూరుకుపోతూ ఆత్మహత్యలు తప్ప గత్యంతరం లేదనుకుంటున్న రైతులు...వాటిని సైతం తొలగిస్తే ఏ స్థితికి చేరుకుంటారో ఊహించాల్సిందే. మొత్తానికి వర్ధమాన దేశాల్లో చీలిక తీసుకురావడం ద్వారా నైరోబీలో ధనిక దేశాలు తాము అనుకున్నది సాధించుకోగలిగాయి.
 

Advertisement
Advertisement