రెచ్చిపోయిన ఉన్మాదం | Sakshi
Sakshi News home page

రెచ్చిపోయిన ఉన్మాదం

Published Mon, Aug 31 2015 1:06 AM

రెచ్చిపోయిన ఉన్మాదం - Sakshi

 పేరేదైనా పెట్టుకోవచ్చుగానీ ఉన్మాదానికి ప్రాంతీయ, మత, జాతి భేదాలుండవు. పాలకులు చేతగానివాళ్లయినప్పుడో...సమాజం ఒక్కటిగా నిలిచి పోరాడలేనప్పుడో అది విజృంభిస్తుంది. వీరంగం వేస్తుంది. అలాంటపుడు వ్యక్తులుగా కొందరు బలైపోవడమే కాదు...అంతకన్నా ముఖ్యమైన విలువలు ప్రమాదంలో పడతాయి. సకాలంలో మేల్కొనకుంటే అవి కనుమరుగవుతాయి కూడా. మూఢ విశ్వాసాలను తీవ్రంగా వ్యతిరేకిస్తారని పేరున్న ప్రముఖ కన్నడ సాహితీవేత్త, హంపీ యూనివ ర్సిటీ మాజీ వైస్ చాన్సలర్ డాక్టర్ ఎంఎం కల్‌బుర్గిని ఉన్మాదులిద్దరు ఆదివారం ఉదయం ఆయన ఇంటికొచ్చి కాల్చిచంపిన తీరు ఈ కోణంలో దిగ్భ్రాంతికరమైనది. మూఢ విశ్వాసాలపై పోరాడి ఇటీవలికాలంలో నేలకొరిగిన వ్యక్తుల్లో కల్‌బుర్గి మూడోవారు. మహారాష్ట్రలో రెండేళ్లక్రితం డాక్టర్ నరేంద్ర దభోల్కర్‌నూ, ఈ ఏడాది మొదట్లో గోవింద్ పన్సారేనూ దుండగులు ఈ తరహాలోనే పొట్టనబెట్టుకున్నారు.

దభోల్కర్ హేతువాద ఉద్యమకారుడు. గోవింద్ పన్సారే సీపీఐ నాయకుడు. కల్‌బుర్గికి ఏ హేతువాద సంస్థలోనూ సభ్యత్వం లేకపోయినా మూఢ నమ్మకాలను వ్యతిరేకిస్తూ రచనలు చేశారు. అనేక సభల్లో పాల్గొన్నారు. ఈ ముగ్గురూ వయసు మీదపడినా సామాజిక న్యాయం కోసం, సెక్యులర్ విలువల కోసం తమ తమ పరిధుల్లో, పరిమితుల్లో పోరాడినవారు. డాక్టర్ దభోల్కర్‌ను కాల్చిచంపిన రోజున ఆనాటి కాంగ్రెస్-ఎన్సీపీ సర్కారు బాధ్యులను పట్టి బంధిస్తామని చెప్పింది. ఆయన ఆకాంక్షించిన మూఢ నమ్మకాల వ్యతిరేక చట్టాన్ని తీసుకొచ్చింది. కానీ దుండగుల జాడ కనిపెట్టలేకపోయింది. అదే ఉన్మాదులకు బలమిచ్చింది. వారు సీపీఐ నేత పన్సారేను కాల్చిచంపడానికి తెగించారు. ఆ కేసులోనూ ఇంతవరకూ ఎలాంటి పురోగతీ లేదు. ఇప్పుడు కర్ణాటకలో కల్‌బుర్గి నేలకొరిగారు.

కన్నడ నేల సామాన్యమైనది కాదు. సామాజిక దురన్యాయాలపైనా, మూఢ విశ్వాసాలు, సంప్రదాయాలపైనా 12వ శతాబ్దిలోనే పోరాడిన బసవన్నను కన్న గడ్డ అది. ఆ పరంపరను కొనసాగిస్తూ రచనలు చేసిన సాహితీ దిగ్గజాలకు అక్కడ కొదవలేదు. ఆ విలువలను పుణికిపుచ్చుకుని తన రచనల ద్వారా సమాజాన్ని మేల్కొల్పుతున్న కల్‌బుర్గి దుండగులకు లక్ష్యంగా మారారంటే ఆశ్చర్యం కలుగుతుంది. కన్నడ సాహిత్యంలో... ముఖ్యంగా బసవన్న సాహిత్యంపైనా, తాత్వి కతపైనా కల్‌బుర్గి లోతైన పరిశోధనలు చేశారు. కన్నడ జానపదం, మతం, సంస్కృతి తదితర అంశాల్లో ఆయన ప్రామాణికమైన రచనలు అందించారు. ఆయన రచనలకు కేంద్ర సాహిత్య అకాడమీ, కన్నడ సాహిత్య అకాడమీ అవార్డుల తో సహా ఎన్నో పురస్కారాలు లభించాయి. బసవన్న అనుచరులమంటున్నవారు ఆయన పాటించిన విలువలనూ, ఆచరణనూ సరిగా అర్థం చేసుకోకుండా మత సంప్రదాయాల్లో కూరుకుపోతున్నారని కల్‌బుర్గి రాయడం గతంలో ఉద్రిక్తతలకు దారితీసింది. విగ్రహారాధన విషయంలో ఆయన చేసిన వ్యాఖ్యలపై లోగడ విశ్వహిందూ పరిషత్, బజరంగ్‌దళ్ వంటి సంస్థలు ఆగ్రహావేశాలు వ్యక్తం చేశాయి. కేసులు పెట్టాయి.

 ఏదైనా రచనో, ఉపన్యాసమో తమకు నచ్చని భావాలతో ఉన్నప్పుడు ఆ భావాలను సవాల్ చేయడం...అవి తప్పని నిరూపించడం నాగరిక సమాజంలో ఎవరైనా చేయాల్సిన పని. అందువల్ల సమాజానికి మేలు జరుగుతుంది తప్ప కీడేమీ కలగదు. పురాతన కాలంనుంచీ మన దేశంలో ఆ సంప్రదాయం ఉంది. వేదాలను ప్రమాణంగా ఎంచే ఆస్తిక దర్శనంతోపాటే...అందులోని అనుమాన ప్రమాణం, ఆప్త ప్రమాణం, ఆగమ ప్రమాణం వంటివాటిని తిరస్కరించి ఉన్నదొక్కటే- అది ప్రత్యక్ష ప్రమాణం మాత్రమేనని కుండబద్దలుకొట్టిన చార్వా కుల తాత్వికతను కూడా ఆదరించిన నేల ఇది. ఇలాంటిచోట తమకు నచ్చని భావాలను వ్యక్తం చేశారని కక్షబూనడం, బెదిరింపులకు, భౌతిక దాడులకు దిగడం ఉన్మాదం అనిపించుకుంటుంది. ఆ బాపతు వ్యక్తులవల్ల వారు నమ్ముతు న్నామంటున్న విశ్వాసాలను కూడా అనుమానించే పరిస్థితులు ఏర్పడతాయి.

కర్ణాటకలోనే సంస్కృతీ పరిరక్ష కులమంటూ శ్రీరాంసేన పేరిట కొందరు ఆమధ్య పబ్‌ల వద్దా, పార్క్‌ల వద్దా యువ జంటలను చితకబాదడం వంటి చేష్టలకు పాల్పడినప్పుడు జనంలో ఎంత ఏవగింపు కలిగిందో అందరూ చూశారు. దుండగుల తుపాకి గుళ్లకు బలైన ముగ్గురూ సమాజంలో మూఢనమ్మకాలకు ఎవరూ బలికావొద్దని దృఢంగా కోరుకున్నారు. మూఢ విశ్వాసాలను ప్రేరేపించే వారినీ, చేతబడులవంటి ప్రక్రియలతో భయభ్రాంతులకు గురిచేస్తున్నవారిని శిక్షించే చట్టం తీసుకురావాలని ఉద్యమించారు. డాక్టర్ దభోల్కర్ మరణానంతరం మహారాష్ట్ర తీసుకొచ్చిన చట్టంవంటిది కర్ణాటకలో కూడా అమలు చేయాలని కల్‌బుర్గి గట్టిగా వాదించారు. అనేక సభల్లో ప్రసంగించారు. ఇవే ఆయనకు కొందరిని శత్రువులుగా మార్చాయి.

 మన పొరుగునున్న బంగ్లాదేశ్‌లో సెక్యులరిజాన్ని, హేతువాద భావాలనూ ప్రచారం చేస్తున్న నలుగురు యువకులను ఉన్మాదులు కొందరు ఈమధ్య కాలంలో కాల్చిచంపారు.  వీరిలో కొందరు హత్యకు ముందు తమకు బెదిరింపులు వస్తున్న సంగతిని పోలీసులకు చెబితే దేశం విడిచివెళ్లిపొమ్మని సలహా ఇచ్చి వారు చేతులు దులుపుకున్నారు. బంగ్లాదేశ్ మన దేశంతో పోలిస్తే చిన్నది. మన పోలీసు వ్యవస్థకుండే వనరులుగానీ, నైపుణ్యంగానీ, సమర్థతగానీ వారికి అందుబాటులో ఉండకపోవచ్చునని చాలామంది అనుకున్నారు. కానీ అలాంటి ఉన్మత్త ధోరణులే ఇక్కడా వ్యాపిస్తున్నాయి.

మన పోలీసులు కూడా నిస్సహాయులుగా మిగులుతు న్నారు. అక్కడిలా ‘మీ చావు మీరు చావండ’ని మన పోలీసులు చెప్పి ఉండక పోవచ్చుగానీ డాక్టర్ దభోల్కర్, పన్సారే హత్య కేసుల్లో చురుగ్గా దర్యాప్తు సాగుతున్న దాఖలాలైతే లేవు. తమిళనాట పెరియార్ రామస్వామి నాయకర్, మన తెలుగునాట త్రిపురనేని రామస్వామి చౌదరి వంటివారు దశాబ్దాలక్రితమే తమ రచనలతో, ఆచరణతో సామాజిక విప్లవానికి బాటలు వేశారు. కానీ అలాంటి అరుదైన వ్యక్తులకు ఇప్పుడు రక్షణ లేకుండా పోవడం ఆందోళన కలిగించే అంశం. ప్రభుత్వాలు ఇప్పటికైనా మేల్కొని కఠినంగా వ్యవహరించాలి. దుండగులను శిక్షించే దిశగా చర్యలు తీసుకోవాలి.

Advertisement
Advertisement