ఎన్నికల పండగ

Sakshi Editorial On Elections

దేశంలో ఎన్నికల జాతరకు తెరలేచింది. ఈ నెల 18న ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదలవుతుందని వచ్చే నెల 11 నుంచి మే 19 వరకూ ఏడు దశల్లో లోక్‌సభ ఎన్నికలు జరుగుతాయని కేంద్ర ఎన్నికల సంఘం ఆదివారం ప్రకటించింది. వీటితోపాటే ఆంధ్రప్రదేశ్, అరుణాచల్‌ప్రదేశ్, ఒడిశా, సిక్కిం రాష్ట్రాల్లో అసెంబ్లీల ఎన్నికలు కూడా నిర్వహించబోతున్నారు. అలాగే వివిధ రాష్ట్రాల్లో 74 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు కూడా జరుగుతాయి. ఓట్ల లెక్కింపు మే 23న ప్రారంభమవుతుంది. 543 నియోజకవర్గాల్లో దాదాపు 90 కోట్లమంది ఓటర్లు ఈ ఎన్నికల్లో అభ్యర్థుల జాతకాలను నిర్ణయించబోతున్నారు. ఇందులో తొలిసారి ఓటు హక్కు వినియోగించుకోబోతున్న ఓటర్ల సంఖ్య కోటిన్నర. అమెరికా ఓటర్ల సంఖ్యతో పోలిస్తే మన ఓటర్లు నాలుగు రెట్లు ఎక్కువ. అంతేకాదు... మొత్తం యూరప్‌ దేశాల జనాభా కన్నా అధికం.

 22 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఒకే దశలో పోలింగ్‌ పూర్తి కాబోతుండగా... పశ్చిమ బెంగాల్, బిహార్, ఉత్తరప్రదేశ్‌లు అన్ని దశల్లోనూ పాల్గొ నవలసి ఉంటుంది. మహోద్రిక్తంగా ఉన్న కశ్మీర్‌లో అనంతనాగ్‌ లోక్‌సభ నియోజకవర్గం మూడు దశల పోలింగ్‌ను చూడబోతోంది. ఒక స్థానంలో ఇలా మూడు దశలుగా పోలింగ్‌ జరపడం దేశంలో ఇదే తొలిసారి. దీని పరిధిలో దక్షిణ కశ్మీర్‌లోని అనంత్‌నాగ్, షోపియాన్, కుల్గాం, పుల్వామా జిల్లా లున్నాయి. ఇవన్నీ మిలిటెంట్‌ ఉద్యమాలతో అట్టుడుకుతున్న ప్రాంతాలు. ఇందులో పుల్వామా ఈమధ్య జరిగిన ఉగ్రవాద దాడితో ప్రపంచవ్యాప్తంగా అందరికీ తెలిసింది. గత ఎన్నికల్లో ఇక్క డినుంచి ఎంపీగా నెగ్గిన జమ్మూ–కశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ సీఎం కావడం కోసం 2016లో రాజీనామా చేశాక కల్లోల పరిస్థితుల కారణంగా ఉప ఎన్నిక నిర్వహణే కుదరలేదు. ఆ రాష్ట్రంలో అసెంబ్లీ రద్దయి మూణ్ణెల్లవుతోంది. అయినా దానికి ఎన్నికలు నిర్వహించలేకపోవడం ప్రభుత్వ వైఫల్యాన్ని సూచిస్తుంది. 

ఎన్నికల షెడ్యూల్‌ రూపకల్పన శ్రమతో కూడుకున్నది. ఇంత విశాలమైన దేశంలో భిన్నమైన వాతావరణ పరిస్థితులు, పండుగలు, పరీక్షలు, పంటనూర్పిళ్లు, శాంతిభద్రతలు వంటి అనేకమైన అంశాలు పరిగణనలోకి తీసుకుని పోలింగ్‌ దశలను ఖరారు చేయవలసి ఉంటుంది. అన్ని పోలింగ్‌ కేంద్రాల్లోనూ ఈవీఎంలకు ఓటు రశీదు యంత్రాలను అనుసంధానించడం ఈసారి విశేషం. అలాగే ఒకే పేరున్న అభ్యర్థుల విషయంలో గందరగోళం తలెత్తకుండా ఉండటానికి ఈవీఎంలపై అభ్యర్థుల ఫొటోలు కూడా అమరుస్తున్నారు. నేరాభియోగాలు ఎదుర్కొంటున్న అభ్యర్థులు పత్రికలు, ప్రసా రమాధ్యమాల్లో మూడుసార్లు వాణిజ్య ప్రకటనల ద్వారా ఆ కేసుల సమాచారాన్ని ఓటర్లకు వెల్లడిం చవలసి ఉంటుంది. ఇన్నాళ్లూ మీడియాకు అమలవుతున్న ప్రవర్తనా నియమావళిని తొలిసారి సామాజిక మాధ్యమాలకు కూడా వర్తింపజేయబోతున్నారు.

రాజకీయ పార్టీల వాణిజ్య ప్రకటనలు పరిశీలించి అనుమతించడానికి ఎన్నికల సంఘం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసింది. అభ్యర్థులు పత్రికలు, ప్రసార మాధ్యమాల్లోనే కాదు... సామాజిక మాధ్యమాల్లో ఇచ్చే వాణిజ్య ప్రకటనలు సైతం ఎన్నికల ఖర్చు పరిధిలోకి వస్తాయి. అధికార దుర్వినియోగం, అక్రమాలు చోటుచేసుకున్న సందర్భాల్లో తక్షణం ఎన్నికల సంఘం దృష్టికి తీసుకొచ్చేందుకు వీలుగా మొట్టమొదటిసారి ‘సి విజిల్‌’ యాప్‌ను రూపొందించారు. ఏ పౌరుడైనా ఫొటోలు లేదా వీడియోలు తీసి ఈ యాప్‌ ద్వారా అప్‌లోడ్‌ చేస్తే ఎన్నికల సంఘం తక్షణం స్పందించి చర్యలు తీసుకుంటుంది. 1951నాటి తొలి సాధారణ ఎన్నికల్లో మారుమూల ప్రాంతాలకు సిబ్బందిని, ఎన్నికల సామగ్రిని చేర్చడానికి ఈసీ ఏనుగులను సైతం వినియోగించవలసి వచ్చిందని గుర్తుంచుకుంటే... ఎప్పటికప్పుడు అత్యాధునిక సాంకేతికతను సొంతం చేసుకుంటూ పురోగమిస్తున్నందుకు ఎన్నికల సంఘాన్ని ప్రశంసించకుండా ఉండలేం. దాదాపు ఏడు దశాబ్దాల ఈ ప్రస్థానం అనేక ప్రజాస్వామ్య దేశాలకు స్ఫూర్తినిచ్చింది. 

అయితే ఎంత చేస్తున్నా కుల, మత, వర్గ, ప్రాంతీయ ద్వేషాలను పురిగొల్పే నాయకులను, పార్టీలను కట్టడి చేయడంలో ఈసీ పదే పదే విఫలమవుతోంది. రోజురోజుకీ పెరుగుతున్న ధన ప్రభావాన్ని కట్టడి చేయలేకపోతోంది. అభ్యర్థుల వ్యయానికి అది విధించిన పరిమితులు నవ్వు పుట్టిస్తున్నాయి. ఆ సొమ్ముతో గ్రామ సర్పంచ్‌గా గెలవడం కూడా కష్టమని సాధారణ పౌరులు కూడా చెబుతారు. ఈసీ అమలు చేస్తున్న నిఘా, తరచు నిర్వహించే దాడులు నోట్ల కట్టల ప్రవా హాన్ని కాస్తయినా అరికట్టలేకపోతున్నాయి. ప్రజలను సమ్మోహన పరిచేలా మేనిఫెస్టోల్లో దొంగ వాగ్దానాలు గుప్పించి, అధికారంలోకొచ్చాక వాటిని బేఖాతరు చేస్తున్నవారిపై అది చర్యలు తీసు కోలేని నిస్సహాయ స్థితిలో ఉంది. సొంతంగా దానికంటూ సిబ్బంది లేకపోవడం అన్నిటికన్నా పెద్ద లోపం.

ఇది సాకుగా తీసుకునే Sఏపీలో పాలక తెలుగుదేశం అధికారుల ప్రాపకంతో లక్షలా దిమంది బోగస్‌ ఓటర్లను సృష్టించగలిగింది. ఇంతటితో ఆగలేదు. ప్రజల ఆధార్‌ డేటా, వారి ఓటర్‌ఐడీలు, వారి వ్యక్తిగత సమాచారం ప్రైవేటు సంస్థల చేతుల్లో పెట్టింది. వాటిని అనుసంధా  నించి యాప్‌ను రూపొందించి దాని ద్వారా క్షణాల్లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ సానుభూతిపరుల ఓట్లు తొలగించే దుర్మార్గానికి పూనుకుంది. ఇది బట్టబయలయ్యాక కూడా ప్రజల్ని అయోమయానికి గురిచేసేలా దబాయింపులకు దిగుతోంది. ఇలాంటి ప్రమాదకరమైన పోకడల విషయంలో ఈసీ వెనువెంటనే చర్యలకు దిగలేకపోతోంది. గత లోక్‌సభ ఎన్నికల్లో కేవలం 44 స్థానాలతో దయనీయమైన స్థితిలో పడిపోయిన కాంగ్రెస్‌ ఈ ఎన్నికల్లో ఏమేరకు కోలుకుంటుందో చూడాల్సి ఉంది. అలాగే సొంతంగా 282, ఎన్‌డీఏ మిత్రులతో కలిసి 334 స్థానాలు గెల్చుకున్న బీజేపీ ఈ అయిదేళ్ల పాలనలో కోల్పో యిందేమిటో, సాధించినదెంతో మే 23న వెల్లడవుతుంది. ఈ ఎన్నికల ప్రచారంలో హుందాగా వ్యవహరించి, ప్రజల్లో ప్రజాస్వామ్య స్ఫూర్తిని, సంస్కృతిని పెంపొందించడం తమ బాధ్యతని నేత లందరూ గుర్తించాలి. సజావుగా ఎన్నికలు జరిగేందుకు ఈసీకి సహకరించాలి.

Read latest Editorial News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top