ఈ ధోరణి ప్రమాదకరం! | Sakshi Editorial On Delhi Violence | Sakshi
Sakshi News home page

ఈ ధోరణి ప్రమాదకరం!

Feb 27 2020 12:25 AM | Updated on Feb 27 2020 12:25 AM

Sakshi Editorial On Delhi Violence

దేశ రాజధాని ఢిల్లీ అల్లర్లు కేవలం దురదృష్టకర ఘటనలా? నియంత్రించగలిగీ అదుపుతప్పిన అరాచ కాలా? రాజకీయ వ్యవస్థ తీవ్రంగా ఆలోచించవలసిన విషయం. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం, తాజా ఘటనల్ని అత్యంత ప్రమాదకరమైన పరిణామాలుగా పరిగణించి తక్షణ చర్యలు తీసుకోక పోతే దేశ ప్రజానీకంలోనే కాదు కనీసం ఢిల్లీ వాసుల్లోనూ విశ్వాసం కలిగించలేదు. క్రమంగా సగటు పౌరుల గుండెల్లో గూడుకట్టుకుంటున్న భయాందోళనల్ని తొలగించలేదు. భద్రతకు భరోసా ఇవ్వ లేదు. ఇప్పటికే తీవ్ర జాప్యం జరిగిపోయింది. రెండు డజన్లకుపైగా విలువైన ప్రాణాలు గాల్లో కలి శాయి. వందలమంది క్షతగాత్రులై, కోట్ల రూపాయల ఆస్తులు బుగ్గిపాలైన దుర్ఘటనలు ఏ ప్రమా ణాలతో చూసినా తీవ్రంగా గర్హించదగినవే! అనుచిత ఉపేక్ష, తీవ్ర నిర్లక్ష్యం, ఘోర వైఫల్యం... వెరసి ఈ దురవస్థ! ఒక ప్రభుత్వ విధానానికి అనుకూల, ప్రతికూల కలహాలు క్రమంగా మతఘర్షణల రూపుదిద్దుకున్న తీరు ఆందోళన కలిగిస్తోంది. పౌరసత్వ సవరణ చట్టం చుట్టూ రగులుకుంటున్న ఘర్షణల అగ్నికి ద్వేషపు మాటలు ఆజ్యం పోశాయి. నియంత్రణ లేని అసాంఘీక శక్తుల విచ్చలవిడి తనం హింసాకాండను రగిల్చింది. ఇది ఇంకే దారుణాలకు దారి తీస్తుందోనన్న భయం సర్వత్రా అలు ముకుంటోంది. ఇటువంటి విపరిణామాల పట్ల నిశిత పరిశీలన, సరైన అవగాహన, లోతైన అధ్య యనం అవసరం.

అంతకు మించి రాజకీయ నిబద్ధత ముఖ్యం. తక్షణ నివారణ చర్యలు అత్యవ సరం. మీరే కారణమంటే, కాదు మీరే... అంటూ పరస్పరం విమర్శించుకునే సమయం కాదిది. నిఘా, నియంత్రణ వ్యవస్థలు సమర్థంగా పనిచేయడమే కాక రాజకీయ పక్షాలన్నీ సంయమనంతో వ్యవహరించి, వెంటనే శాంతి నెలకొల్పాల్సిన అవసరమెంతో ఉంది. ఇవి రాత్రికి రాత్రి చెలరేగిన అల్లర్లు కావు. ఉద్రేకం కట్టలు తెగి అక్కడికక్కడ జరిగిన అనూహ్య పరిణామాలూ కావు! చిన్న చిన్నగా మొదలై దేశ రాజధాని, ఈశాన్య ఢిల్లీలో దాదాపు రెండు రోజుల పాటు దమనకాండ కొన సాగుతూనే ఉంది. మత విద్వేషం కట్టలు తెంచుకోవడంతో నడిరోడ్లలో నెత్తురు చిందింది. ఇంటి దిక్కు కన్ను మూసిన ఎన్నో కుటుంబాల్లో విషాదం మిగిలింది. ఇటీవల కొంత కాలంగా ఢిల్లీలోనే జరుగుతున్న వరుస పరిణామాల్లో తాజా అల్లర్లకు సంబంధించిన మూలాలు సుస్పష్టంగానే ఉన్నాయి. జవహర్‌లాల్‌ నెహ్రూ విశ్వవిద్యాలయం ప్రాంగణంలో ముసుగు దుండగుల అరాచకాల నుంచి జామియా మిలియా విశ్వవిద్యాలయంలో మారణాయుధాలతో జరిగిన దాడుల వరకు అన్నీ భవిష్యత్‌ ప్రమాదాలకు సంకేతాలే! ‘తోటకూర నాడే...’ అన్న సామెత చందంగా, నాటి దాడుల్ని తీవ్రంగా పరిగణించి, ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకొని ఉంటే స్పష్టమైన సంకేతాలు వెళ్లి ఉండేవి. తెగించి ఉన్మాదులు ఇంతలా చెలరేగడానికి ఆస్కారం ఉండేది కాదు.

నాటి దాడులకు బాధ్యులైన వారిపై కేసులు నమోదు చేసి, చర్యలు తీసుకునుంటే అంతో ఇంతో ఫలితాలిచ్చేవి. తగిన చర్యలు తీసుకోలేని దుస్థితి తాజా దాష్టీకాలకు దారులు పరిచింది. వాటిని అంచనా వేయడంలో, రాగల ప్రమాదాల్ని శంకించడంలో, నివారణ చర్యలు తీసుకోవడంలో వివిధ వ్యవస్థలు విఫలం చెందిన పర్యవసానమిది. ముఖ్యంగా పోలీసు, నిఘా వ్యవస్థల వైఫల్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. అందుకే సుప్రీంకోర్టు పోలీసుల పనితీరును తప్పుబట్టింది. ఇది పోలీసుల వృత్తిపరమైన నైపుణ్యాల లోపమా? విధి నిర్వహణలో పోలీసులు స్వేచ్ఛా–స్వంతంత్య్రాల్ని కోల్పోయిన తీరు ఫలితమా? ఆలో చించాలి. మొదటిదైనా, రెండోదైనా... రెండూ కారణమైనా ఇందులో పాలనావ్యవస్థల పాపమూ ఉన్నట్టే! పరిస్థితిని సరిగా అంచనా వేసి, పరిణామాల్ని విశ్లేషించి వృత్తి నైపుణ్యంతో పోలీసులు వెంటనే చర్యలు తీసుకోవాలి. అలా కాకుండా ప్రతి విపత్కర పరిస్థితిలోనూ... పాలకుల సైగల కోసమో, సంకే తాల కోసమో చూసే దుస్థితి ఉండకూడదన్న న్యాయస్థానం వ్యక్తీకరణ పరిస్థితికి అద్దం పట్టింది.

పరస్పర విరుద్ధ భావాలు, భిన్నాభిప్రాయాలతో ఏ విషయంలోనైనా ప్రతిష్టంభన ఏర్పడ్డపుడు తొలగించుకునేందుకు ప్రజాస్వామ్యంలో అనేక ప్రక్రియలున్నాయి. సంప్రదింపు మార్గాలున్నాయి, న్యాయస్థానాలున్నాయి. రాజకీయ ప్రతిష్టంభనలు తొలగించుకునేందుకు చర్చల ప్రక్రియ ప్రపంచ వ్యాప్తంగా ఆమోదం పొందిన పరిష్కార మార్గం. పౌరసత్వ సవరణ చట్టం వ్యతిరేక, అనుకూల వర్గాలు తమ అతివాద ధోరణి వీడి సంయమనం పాటించాలి. ఉద్రిక్తతల్ని తగ్గించేందుకు తమ వంతు కృషి చేయాలి. ప్రభుత్వం చొరవ తీసుకొని చర్చల ప్రక్రియ ద్వారా సమస్యను పరిష్కరించే సామరస్య సాధనకు చిత్తశుద్ధితో యత్నించాలి. ఇది ప్రభుత్వాల బాధ్యత! భావోద్వేగాల్ని ప్రేరేపించే, ఉద్రిక్తతలు సృష్టించే ఏ పరిస్థితికీ ఆస్కారం ఇవ్వకూడదు. అలా జరుగవచ్చని అనుమానించినపుడు ప్రభుత్వం వాటిని నియంత్రించే నిర్దిష్ట చర్యలు చేపట్టాలి.

మత ఘర్షణల వంటి సున్నిత, ఉద్రిక్త వాతావరణం నెలకొన్నపుడు వదంతుల వ్యాప్తి  నిరోధానికి యత్నించినట్టే విద్వేష ప్రసంగాలనూ ప్రభుత్వం కట్టడి చేయాలి. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి శాసనసభ వేదికగా ‘అల్లరి మూకలు అల్లరి మూకల చేతిలో హతమయ్యాయి...’ అని ఇటీవల చేసిన ఒక వ్యాఖ్య పాలకుల బాధ్యతారాహిత్యాన్నే వెల్లడి చేస్తోంది. కొంతమంది పాలకపక్ష నాయకుల ద్వేష ప్రసంగాలు ఢిల్లీలో పరిస్థితిని దిగజార్చాయనడానికి, సదరు ప్రసంగాలపై పాలక బీజేపీలో వ్యక్తమైన భిన్నాభిప్రాయాలే నిదర్శనం. సదరు వక్తలపై కేసు నమోదు చేయకపోవడాన్ని న్యాయస్థానమూ తప్పుబట్టింది. తాజా ఘర్షణలపై ఇటీవలి ఢిల్లీ శాసన సభ ఎన్నికల ఫలితాల సరళి ప్రభావం కూడా ఉందనే అభిప్రాయం వ్యక్తమౌతోంది. ఢిల్లీ అల్లర్లు మరో ప్రమాద సంకేతాన్నీ వెల్లడించాయి! మారణాయుధాలతో పెట్రేగిన అల్లరి మూకలు తమకు చేజిక్కిన వారి మతం నిర్ధారించుకొని మరీ దాడులకు పాల్పడ్డాయని వచ్చిన వార్తలు నిజమైతే.. అది అత్యంత ప్రమాదకర పరిణామం! ఏం చేసైనా ఈ ప్రమాదకర పోకడల్ని మొగ్గలోనే తుంచాల్సిన అవసరం ఉంది. శాంతి పునరుద్దరణ సమిష్టి బాధ్యత! 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement