వెసులుబాట్లపైనే ఆశ | PM Narendra Modi About Lockdown | Sakshi
Sakshi News home page

వెసులుబాట్లపైనే ఆశ

Apr 15 2020 12:43 AM | Updated on Apr 15 2020 12:43 AM

PM Narendra Modi About Lockdown - Sakshi

గత నెలాఖరున అమల్లోకి తెచ్చిన లాక్‌డౌన్‌ గడువు ముగిసే తరుణంలో ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం జాతినుద్దేశించి ప్రసంగించి దాన్ని వచ్చే నెల 3 వరకూ పొడిగిస్తున్నట్టు ప్రకటించారు. ఈ క్లిష్ట సమయంలో దేశ ప్రజానీకమంతా పాటించాల్సిన ఏడు అంశాలను కూడా ఆయన ప్రస్తా వించారు.  కరోనా మహమ్మారి తీవ్రత ఆశించిన స్థాయిలో తగ్గిన దాఖలా లేకపోవడంతో లాక్‌డౌన్‌ పొడిగింపే ఉత్తమమని దాదాపు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులూ మూడు రోజులక్రితం జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో ప్రధానికి చెప్పారు. అదే సమయంలో వ్యవసాయం, ఆక్వా, ఉద్యానlపంటల దిగుబడుల రవాణా, వాటి మార్కెటింగ్, పారిశ్రామికరంగం తదితరాలను కూడా దృష్టిలో పెట్టు కోవాలని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి సూచించారు. ఈ అంశాలపైనే సోమ వారం ప్రధానికి సవివరమైన లేఖ రాశారు. నరేంద్ర మోదీ తాజా ప్రసంగంలో ఇటువంటి అంశా లన్నీ ప్రస్తావనకొస్తాయని దేశంలో అనేకమంది ఆశించారు. అయితే బుధవారం కొన్ని మార్గదర్శకా లను విడుదల చేయబోతున్నామని మోదీ చెప్పడం... రైతులు, నిరుపేద వర్గాలకు వెసులుబాటు కల్పించే ప్రయత్నం చేస్తామనడం ఉపశమనమిస్తుంది. ఆ మార్గదర్శకాల్లో ఏం వుంటాయో, అమ లయ్యే వెసులుబాట్లేమిటో చూడాలి.  
 

చాలా దేశాలతో పోలిస్తే మన దేశంలో లాక్‌డౌన్‌ అమలు తీరు ఎంతో మెరుగ్గా వున్నదని మోదీ చెప్పిన మాటల్లో వాస్తవముంది. అయితే ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా కరోనా ఆశించినంతగా తగ్గటం లేదు. ఈ వ్యాధి తీవ్రత అటువంటిది. దీన్ని కట్టడి చేయడం సామాన్యమైన విషయం కాదు. మంగళవారం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించిన గణాంకాలు చూస్తే ఈ సంగతి అర్థ మవుతుంది. దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 10,541కి చేరుకుంటే, మరణాలు 358. కోలు కున్నవారు 1,205మంది. ఈ కేసుల సంఖ్య అంతకంతకు పెరుగుతోందని, ఆందోళనకర స్థాయికి చేరుతోందని గత పదిరోజుల గణాంకాలు గమనిస్తే తెలుస్తుంది. వైద్యులు, ఇతర సిబ్బంది అలుపెరగని రీతిలో శ్రమిస్తున్నారు. ఆ మహమ్మారిని అదుపు చేయడానికి ప్రయత్నిస్తున్నారు. వనరుల కొరత ఎంతగా వేధిస్తున్నా రాష్ట్ర ప్రభుత్వాలన్నీ కరోనా వ్యాధి పైనే తమ సర్వశక్తులూ కేంద్రీకరించి, దాని కట్టడికి అధిక ప్రాధాన్యమిచ్చి పనిచేస్తున్నాయి. దీన్ని మరింతకాలం ఇదే స్థాయిలో కొనసాగిస్తే తప్ప నిరోధించడం అసాధ్యమని మోదీ తన తాజా ప్రసంగంలో చెబుతూ
 

ఈ నెల 20 వరకూ పరిస్థితి ఎలా వుందో సమీక్షిస్తామని, ఆ తర్వాత కొన్ని వెసులుబాట్లు కల్పిస్తామని అన్నారు. మన దేశంలో చట్టాలు, నిబంధనలు ఎన్నివున్నా, వాటి అమలును పర్యవేక్షించే యంత్రాంగాలు ప్రభావవంతంగా వుండటం లేదు. కరోనా కట్టడి వ్యూహంలో అదే పెద్ద సమస్యగా మారింది. నిర్మాణ రంగ కార్మికుల పరిస్థితి చూస్తే ఈ సంగతి అర్థమవుతుంది. మన జీడీపీలో ఆ రంగం వాటా 9 శాతం. అయిదున్నర కోట్లమంది కార్మికులు అందులో పనిచేస్తున్నారు. సాగు రంగం సంక్షోభంలో పడటం, పల్లెసీమల్లో ఉపాధి లేకపోవడం పర్యవసానంగా అనేకులు పనిచేసేందుకు నగరాలను, పట్టణాలను ఆశ్రయి స్తారు. కానీ వీరిలో చాలామంది అధికారిక రిజిస్టర్‌లలో నమోదై వుండరు. అలా లేకపోయినా పట్టిం చుకునేవారుండరు. పర్యవసానంగా నిర్మాణరంగ కార్మికుల చట్టం వీరిలో అత్యధికులకు వర్తించదు. కనుక దానిద్వారా సమకూరాల్సిన సంక్షేమం దక్కడం లేదు. భవనాలు, ఇతర నిర్మాణ రంగ ప్రాజెక్టుల ద్వారా సమకూరే సెస్‌ ద్వారా ఈ రంగంలో పనిచేసే కార్మికులను ఆదుకోవాలని కేంద్రం రాష్ట్రా లకు సూచించినా రిజిస్టరయిన కార్మికుల సంఖ్య అన్ని రాష్ట్రాల్లోనూ తక్కువే వుంది. ఇతర అసంఘటిత రంగాల్లోనూ ఇదే స్థితి. కనుకనే నగరాల్లోనే వుండిపోతే తమకు ఆకలి చావులు తప్పవన్న భయాందోళనలతో లక్షలమంది స్వస్థలాలకు నడుచు కుంటూ వెళ్లారు.

ఈ కారణంతోనే మంగళవారం ముంబైలోని బాంద్రాలో వేలాదిమంది వలస కార్మికులు ఆందోళనకు దిగారు. మనిషికి ఆరోగ్యం కాపాడుకోవడం ఎంత ముఖ్యమో జీవిక కూడా అంతే ముఖ్యం. ఇప్పుడు ప్రభుత్వాలన్నీ ప్రధానంగా ప్రజల ఆరోగ్య పరిరక్షణపైనే దృష్టి కేంద్రీకరించివున్నాయి. లాక్‌డౌన్‌తో ఉపాధి కోల్పోయినవారి కోసం చర్యలు తీసుకుంటున్నా అవి ఎక్కడా సరిపోవడం లేదు. దశాబ్దా లుగా అసంఘటిత రంగ కార్మికుల స్థితిగతులెలావున్నాయో, వారిలో అందరూ నమోదవుతున్నారో లేదో ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం వల్ల హఠాత్తుగా వచ్చిపడిన ఈ సంక్షోభంలో అందరికీ సాయం అందించడం సమస్యగా మారింది. ప్రధాని ప్రసంగాన్నిబట్టి దేశంలోని చాలా జిల్లాల్లో లాక్‌ డౌన్‌ మున్ముందు మరింత కఠినం కావచ్చునని తెలుస్తూనేవుంది. కరోనా కట్టడికి ఇది అవసరమే. అయితే నిత్యావసరాలు ప్రతి ఒక్కరికీ చేరేలా చూడటం, లాక్‌డౌన్‌ పర్యవసానాల ప్రభావం ప్రజలపై కనిష్టంగా వుండేవిధంగా చర్యలు తీసుకోవడం చాలా అవసరం. ఆహార పదార్థాల సరఫరాకు ఆటంకం లేకుండా చూడటం, ఇతరత్రా అవసరాల కోసం నిరుపేద వర్గాలకు నగదు బదిలీ చేయడం వంటివి కీలకం.

అలాగే వ్యవసాయ రంగం కుంటుపడకుండా చూసుకోవాలి. గ్రామీణ ప్రాంతాల్లో 60 శాతంమంది దానిపైనే ఆధారపడి జీవనం సాగిస్తుంటారు. వ్యవసాయ అనుబంధ మార్కెట్లు కూడా సమర్థవంతంగా పనిచేసేలా చూడాలి. చైనాలో వుహాన్, ఆ చుట్టుపక్కల నగరాలు లాక్‌డౌన్‌లో వున్నా సమస్యాత్మకంకాని ప్రాంతాలు సాఫీగా తమ కార్యకలాపాలు కొనసాగించగలిగాయి. ప్రధాని ఇచ్చిన గడువు తేదీ 20లోగా అటువంటి ప్రాంతాలను గుర్తించి అక్కడ పరిమిత స్థాయిలోనైనా పనులు మొదలయ్యేలా చర్యలు తీసుకుంటే లాక్‌డౌన్‌ దుష్ఫలితాలను కనిష్ట స్థాయిలో వుంచడం సాధ్యమవుతుంది. ఆ సమయానికల్లా ప్రపంచవ్యాప్త స్థితిగతులపై స్పష్టత లభిస్తుంది కనుక మన దేశం ఏఏ రంగాలకు ప్రాధాన్యతనిచ్చి జవసత్వాలు కల్పించాలో అర్థమవుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement