దేశ చిత్రపటంలో 29వ రాష్ట్రంగా ఆవిర్భవించిన తెలంగాణలో టీఆర్‌ఎస్ అధినేత కె. చంద్రశేఖరరావు నేతృత్వాన సోమవారం నూతన మంత్రివర్గం కొలువుదీరింది.
సంపాదకీయం: దేశ చిత్రపటంలో 29వ రాష్ట్రంగా ఆవిర్భవించిన తెలంగాణలో టీఆర్‌ఎస్ అధినేత కె. చంద్రశేఖరరావు నేతృత్వాన సోమవారం నూతన మంత్రివర్గం కొలువుదీరింది. తాము అధికారంలోకొస్తే అమలు చేయతలపెట్టిన ఎజెండాను పార్టీ మేనిఫెస్టో ద్వారా అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ప్రకటించివున్న కేసీఆర్ అందుకనుగుణమైన కార్యాచరణ కోసం సమర్ధులని భావించినవారిని సహచరులుగా ఎంపిక చేసుకున్నారు. అటు అనుభవానికీ, ఇటు కొత్తదనానికీ సమ ప్రాధాన్యమిచ్చి ఈ కేబినెట్‌ను రూపొందించినట్టు కనబడుతున్నది. కేవల అనుభవాన్నే పరిగణనలోకి తీసుకుంటే సమర్ధతగల కొత్తవారికి అన్యాయం జరుగుతుంది. అది రాబోయే కాలంలో నాయకత్వ కొరతకు దారి తీస్తుంది.
అందువల్ల పాతవారికి అవకాశం కల్పిస్తూనే కొత్త నెత్తురును ఎక్కించడం తప్పనిసరి. అప్పుడే కొత్త ఆలోచనలకూ, కొత్త పనివిధానానికి దారులు పరిచి నట్టవుతుంది. ఇవన్నీ చూసుకుంటూనే విధేయతకూ తగినంత చోటి వ్వక తప్పదు. అందువల్లే కేబినెట్ కూర్పులో కేసీఆర్ దాన్ని కూడా గమనంలోకి తీసుకున్నారు. అయితే, టీఆర్‌ఎస్‌నుంచి ఆరుగురు మహిళలు గెలిచినా ఒక్కరికి కూడా తొలి కేబినెట్‌లో అవకాశం కల్పించ కపోవడం వెలితిగానే కనబడుతోంది. కేబినెట్ విస్తరణలో ఆ లోటును భర్తీచేస్తే చేయవచ్చుగానీ తొలి మంత్రివర్గానికుండే ప్రాధాన్యాన్ని దృష్టిలో ఉంచుకుని మహిళలనుంచి ఒక్కరినైనా తీసుకుని ఉంటే బాగుండేది.
రాజకీయాల్లోనూ, కార్మికోద్యమాలలోనూ కాకలు తీరిన నాయిని నర్సింహారెడ్డికి అత్యంత కీలకమైన హోంశాఖను కేటాయించారు. సోష లిస్టు ఉద్యమకారుడిగా ఉన్నప్పటినుంచీ పౌరహక్కుల ఉల్లంఘనలపై కూడా ప్రశ్నించిన అనుభవం ఉన్న నాయినికి ఈ శాఖ నిర్వహణ నిజా నికి కత్తిమీది సాములాంటిదే. దానిని ఆయన ఎంత చాకచక్యంగా నిర్వహిస్తారో చూడాలి. దివంగత నేత వైఎస్ నేతృత్వంలో ఏర్పడిన ప్రభుత్వంలో టీఆర్‌ఎస్ తరఫున నాయిని కేబినెట్ మంత్రిగా పనిచేసి, సాంకేతిక విద్యాశాఖను చూశారు. అసెంబ్లీలో టీఆర్‌ఎస్ శాసనసభా పక్షం నేతగా విశేషానుభవం ఉన్న ఈటెల రాజేందర్‌కు ముఖ్యమైన ఆర్ధిక మంత్రిత్వ శాఖను అప్పగించారు.
తెలంగాణకు ఆదాయవనరుల్లో లోటేమీ లేదు గనుక ఆర్ధిక శాఖను సునాయాసంగా నిర్వహించవచ్చునని... బడ్జెట్ రూపకల్పనలో తలనొప్పులేమీ ఉండవని అందరూ అనుకుంటారు. అయితే, రైతు రుణమాఫీ మొదలుకొని ప్రభుత్వ సిబ్బంది జీతాల పెంపు వరకూ ఎన్నికల సందర్భంగా టీఆర్‌ఎస్ అనేక హామీలిచ్చింది. వాటన్నిటినీ అమలు చేయాలంటే అదనపు వనరుల సేకరణకు మార్గాలు వెదకడం తప్పనిసరి. సామాన్యులకు పన్నుపోటు కలిగించకుండా...ఇచ్చిన వాగ్దానాల అమలుకు లోటు రానీయకుండా ఈటెల ఎలా నెగ్గుకొస్తారన్నది చూడాల్సి ఉంది. గతంలో వివిధ శాఖలకు మంత్రిగా పనిచేసిన అనుభవం ఉన్న పోచారం శ్రీనివాసరెడ్డికి అత్యంత ప్రధానమైన వ్యవసాయ శాఖ లభించింది. వైఎస్ కేబినెట్‌లో యువజన సర్వీసుల మంత్రిగా పనిచేసిన హరీశ్‌రావుకు భారీ నీటిపారుదల శాఖను అప్పగించారు. ఉప ముఖ్య మంత్రులుగా అవకాశం లభించిన మహమూద్ అలీ, డాక్టర్ రాజయ్య లిద్దరూ తొలిసారి మంత్రులైనవారు. వారికి అప్పగించిన శాఖలు కూడా ముఖ్యమైనవే. మహేందర్ రెడ్డి, జోగు రామన్న, పద్మారావు, జగదీశ్‌రెడ్డి, కేటీఆర్‌లకు కూడా మంత్రి పదవులు కొత్త. ఇప్పుడున్న మంత్రివర్గ పరిమాణాన్ని చూసినా, కొందరికి ఒకటికన్నా ఎక్కువ శాఖలు అప్పగించిన తీరును గమనించినా త్వరలోనే విస్తరణ ఉంటుం దని సులభంగానే అర్ధమవుతుంది. ఆ విస్తరణలో మహిళలకూ, ఇప్పు డు అసలే చోటుదక్కని మహబూబ్‌నగర్ జిల్లావంటివాటికి జాగా లభిస్తుందని భావించవచ్చు.
ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశాక నూతన రాష్ట్రావతరణ వేడుకల్లో నవ తెలంగాణ నిర్మాణంపై తన ఆలోచనలను కేసీఆర్ వెల్లడించారు. ఈ ప్రసంగంలో ఆయన ప్రకటించిన పథకా లన్నీ ఎన్నికల మేనిఫెస్టోలో ఉంచినవే. పారదర్శకమైన పాలనకు పెద్ద పీట వేస్తానని, రాజకీయ అవినీతికి తావు లేకుండా చేస్తానని కేసీఆర్ హామీ ఇచ్చారు.
తెలంగాణను దేశంలో ఆదర్శనీయమైన రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి అవసరమైన ఎజెండాను ప్రజలముందుంచారు. కొత్త రాష్ట్రం గనుక పాలనాపరంగా ఎదుర్కొనే చిన్న చిన్న ఇబ్బందులతో పాటు పక్కనున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో కూడా పంపకాల విషయంలో సహజంగానే కొన్ని సమస్యలుంటాయి. విభజించే ముందు నదీజలాల కేటాయింపువంటి కీలకాంశాలపై నిర్ణయం తీసుకోనందు వల్ల ఈ సమస్యలు తప్పనిసరి. ఇలాంటి ఇబ్బందులను అధిగమించ డానికి ఇరు రాష్ట్రాల్లోని ప్రభుత్వాలూ ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో, విశాల హృదయంతో వ్యవహరించడం తప్పనిసరి.
ఈ విషయంలో ఏకొంచెం ఏమరుపాటుగా ఉన్నా, రాజకీయ ప్రయోజనాలను ఆశించి వ్యవహరించినా అనవసర భావోద్వేగాలు పెరుగుతాయి. పరస్పర అపనమ్మకం ఏర్పడే ప్రమాదమూ ఉంటుంది. ఇరు రాష్ట్రాల అభివృద్ధిపైనా దాని ప్రభావంపడే అవకాశం కూడా ఉంటుంది. భౌగోళికంగా రెండు రాష్ట్రాలుగా విడిపోయినా రెండు ప్రాంతాల్లోని ప్రజలూ ఒక జాతిగా, ఒకే తల్లి బిడ్డలుగా నిన్నటివరకూ కలిసిమెలిసి ఉన్నవారే గనుక తాత్కాలికంగా ఏర్పడే ఇబ్బందులు ఆ సంబంధాలపై ప్రభావం చూపకూడదు. అందుకోసం రెండు ప్రభుత్వాలూ ప్రత్యేక శ్రద్ధ పెట్టవలసిన అవసరం ఉంటుంది. తమ తమ ప్రాంతాల్లోని ప్రజలకు అవసరాన్నిబట్టి నచ్చజెప్పవలసిన బాధ్యతా ఉంటుంది. రెండు రాష్ట్రాల పాలకులూ దీన్ని గుర్తించి వ్యవహరిస్తారని ఆశిద్దాం.