అమెరికాలో అసహనం | Intolerance in America | Sakshi
Sakshi News home page

అమెరికాలో అసహనం

Feb 13 2015 2:05 AM | Updated on Apr 4 2019 3:25 PM

జాగ్రత్తగా వ్యవహరించకపోతే ఎలాంటి విపరిణామాలు సంభవించే అవకాశం ఉన్నదో తాజాగా అమెరికాలో జరిగిన రెండు ఘటనలు నిరూపిస్తున్నాయి.

బాధ్యతాయుత స్థానాల్లో ఉన్నవారు...ముఖ్యంగా పాలకులుగా ఉన్నవారు జాగ్రత్తగా వ్యవహరించకపోతే ఎలాంటి విపరిణామాలు సంభవించే అవకాశం ఉన్నదో తాజాగా అమెరికాలో జరిగిన రెండు ఘటనలు నిరూపిస్తున్నాయి. ఒక ఉదంతంలో ముగ్గురు ముస్లిం యువతీయువకులను దుండగుడు కాల్చిచం పగా...మరో ఘటనలో పోలీసులు ఒక భారతీయుణ్ణి నడిరోడ్డుపై చితకబాది తీవ్రంగా గాయపరిచారు.

నార్త్ కరొలినా యూనివర్సిటీ ఆవరణలో బుధవారం ముస్లిం యువజంటనూ, ఆ జంటలోని యువతి సోదరినీ ఉన్మాది పొట్టనబెట్టు కున్న తీరు అమెరికాలోనే కాదు...ప్రపంచవ్యాప్తంగా పలువురిని దిగ్భ్రమపరు స్తున్నది. యువ జంట ఈమధ్యే యూనివర్సిటీలో చదువు పూర్తయి వివాహం చేసుకోగా మరో యువతి ఇంకా చదువుకుంటున్నది. కాల్చిచంపిన వ్యక్తి విశ్వాసాల రీత్యా హేతువాదని, ఈ ముగ్గురితో అతనికి పార్కింగ్ విషయంలో వచ్చిన తగాదా దీనికి కారణం కావొచ్చని మొదట పోలీసులు చెప్పినా తదుపరి లభిస్తున్న ఆధారాల నుబట్టి చూస్తే మత విద్వేషమే హత్యలకు మూలకారణమని వెల్లడవుతున్నది.

అలబామాలో గతవారం తన కుమారుడిని చూడటానికి వెళ్లిన ఒక భారతీయ పౌరుణ్ణి కేవలం అనుమానంతో అక్కడి పోలీసులు దారుణంగా కొట్టారు. పర్యవ సానంగా ఆయన కదలలేని స్థితికి చేరుకున్నారు. అమెరికాలో నల్లజాతి ప్రజలపై దశాబ్దాలుగా అమలవుతున్న వివక్ష, వారికది ప్రాణాంతకమవుతున్న తీరు...దాన్ని రూపుమాపడంలో అక్కడి ప్రభుత్వాల వైఫల్యం అందరూ ఎరిగినదే. దీనికితోడు 2001లో అక్కడి ట్విన్ టవర్స్‌పై జరిగిన దాడి తర్వాత ఆ తరహా వివక్ష ముస్లింలకు కూడా విస్తరించింది. కేవలం పేరునుబట్టి పౌరుల్ని అనుమాన దృక్కులతో చూడటం ఎక్కువైంది.

సుప్రసిద్ధ బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్‌కు ఒకసారి కాదు... రెండుసార్లు అక్కడి విమానాశ్రయంలో అవమానాలు ఎదురయ్యాయి. విమానాశ్రయంలోని కంప్యూటర్ ‘ఖాన్’ అనే పేరు తగలగానే హెచ్చరిక చేసిందట. దాంతో ఆయనను రెండుగంటలపాటు నిర్బంధించి పలు ప్రశ్నలతో వేధించారు. ఇలాంటి కారణాలతోనే కమల్ హసన్, అమీర్‌ఖాన్ వంటివారు కూడా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇప్పుడు సురేష్‌భాయ్ పటేల్ అనే 57 ఏళ్ల వ్యక్తి రోడ్డుపై నడవడాన్ని చూసి ఒక శ్వేత జాతీయుడు అనుమానంతో ఫిర్యాదు చేయగానే వచ్చి పోలీసులు అత్యంత క్రూరంగా వ్యవహరించారు. పటేల్‌ను అనుమానించడానికి శరీర ఛాయ తప్ప వేరే కారణం లేదు.
 
నరనరానా జీర్ణించుకుపోయిన జాత్యహంకారంనుంచి బయటపడని అమెరికా సమాజంలో కొన్ని మతాలవారిపై అసహనం, విద్వేషం వంటివి కూడా పెరుగుతు న్నాయని నోమ్ చోమ్‌స్కీ వంటి మేథావులు ఎప్పటినుంచో హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వ యంత్రాంగం...ముఖ్యంగా పోలీసులు అత్యంత బాధ్యతారహితంగా వ్యవహరించడంవల్ల పౌరుల్లో తప్పుడు సంకేతాలు వెళ్లి అదొక రుగ్మతగా మారు తున్న వైనం కనబడుతున్నది. నాలుగు నెలలక్రితం క్లీవ్‌లాండ్‌లో బొమ్మ తుపాకితో ఆడుకుంటున్న బాలుడి గురించి ఫిర్యాదు అందడం, వెనువెంటనే ఒక కానిస్టేబుల్ వెళ్లి అతన్ని లొంగిపొమ్మని హెచ్చరించడం క్షణాల్లో జరిగిపోయాయి.

ఈ గొడవం తా ఏమిటో అర్ధంకాక ఆ బాలుడు జేబులో చేతులు పెట్టుకోవడానికి ప్రయత్నిం చేసరికే అతన్ని కానిస్టేబుల్ కాల్చిచంపాడు. ఆ బాలుడు నల్లజాతివాడు కాకపోయి ఉంటే ఆ కానిస్టేబుల్ ఇంత అమానుషంగా ప్రవర్తించేవాడు కాదు. కొన్ని జాతులను అనుమానించడం, వారిని ఏదో ఒక పేరుతో వేధింపులకు గురిచేయడం అమెరికా సమాజంలో ఆదినుంచీ కనబడుతున్న ధోరణి.

20వ శతాబ్దం తొలినాళ్లలో యూదు జాతీయులను సోషలిస్టులుగా... ఇటలీనుంచి వలసవచ్చినవారిని అనార్కిస్టులుగా భావించి వారిపై దాడులకు పాల్పడటం, వారి ఇళ్లు తగలబెట్టడం వంటివి చోటు చేసుకునేవి. కార్మిక సంఘాల్లో పనిచేసేవారిని కమ్యూనిస్టులుగా వేధించేవారు. వారిపై లెక్కకు మించి కేసులు పెట్టేవారు. ఇప్పుడు అమెరికన్ ముస్లింల విషయం లో అలాంటి ధోరణే వ్యక్తమవుతున్నది. తన నీడను చూసి తానే భయపడుతున్న అమెరికా సమాజం పేరునుబట్టి, రంగునుబట్టి ఎవరినైనా అంచనావేసే దుస్థితికి చేరువవుతున్నది.
 
మన రిపబ్లిక్ డే ఉత్సవాల్లో ముఖ్య అతిథిగా పాల్గొనడానికొచ్చి మూడురో జులు పర్యటించిన అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా చివరి రోజు సిరిఫోర్ట్ ఆడిటోరియంలో భిన్న వర్గాల ప్రజలతో జరిగిన ఇష్టాగోష్టిలో చాలా విషయాలు ‘అరమరికలు’ లేకుండా మాట్లాడారు. నచ్చిన మతాన్ని, కోరుకున్న విశ్వాసాన్ని ప్రచారం చేసుకునే హక్కు ప్రతి ఒక్కరికీ ఉండాలని చెప్పారు. ఆయనలా అనడం వెనకున్న ఉద్దేశాల గురించి పలు రకాల భాష్యాలు వెలువడటంవల్లనో, ఏమో... వారంక్రితం వైట్‌హౌస్‌లో మరో సందర్భాన్ని ఆసరా చేసుకుని ఆయన నేరుగానే మాట్లాడారు.

ఇతర మతాలపైనా, విశ్వాసాలపైనా భారత్‌లో అసహనం పెరుగు తున్నదని, దాడులు చేసే ధోరణి ఎక్కువవుతున్నదని ఒబామా ఆందోళనపడ్డారు. ఇలాంటి చర్యలను చూసి మహాత్మా గాంధీ సైతం విస్తుపోయేవారని వ్యాఖ్యా నించారు. ప్రపంచంలో ఏమూల ఎవరికి అన్యాయం జరిగినా వేలెత్తి చూపడం, సరిదిద్దడానికి ఆదుర్దాపడటం నేరమేమీ కాదు. అయితే  ‘తప్పులెన్నువారు తమ తప్పులెరుగరు’ అన్నట్టు వ్యవహరించడంతోనే ఎవరికైనా పేచీ.

తమ దేశంతో సహా చాలాచోట్ల అసహనం, విద్వేషం పెచ్చుమీరడాన్ని చూపి... అందరమూ సమష్టిగా వాటిని పారదోలవలసిన అవసరం ఉన్నదని చెప్పడం వేరు. దాన్ని అందరూ ఆహ్వానిస్తారు. అలా చెప్పడానికి ముందు అందులో అగ్రరాజ్యంగా తమ వంతు బాధ్యత ఎంతనో చెబితే...దాన్ని సరిదిద్దడానికి ఏం చేయదల్చుకున్నదీ వెల్లడిస్తే మరింతగా సంతోషిస్తారు. తాజా ఘటనలతోనైనా ఒబామాకు కనువిప్పు కలగాలి. సొంతిల్లు చక్కదిద్దుకోవాల్సిన అవసరాన్ని గుర్తించాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement