ప్రపంచశ్రేణి విద్యాసంస్థలు

HRD Releases A Report Of World Class Universities In India - Sakshi

మన విద్యకూ, విద్యాసంస్థలకూ ప్రపంచశ్రేణి గుర్తింపు తీసుకురావాలన్న కేంద్ర ప్రభుత్వ కృత నిశ్చయం మెచ్చదగిందే. అందుకోసం విద్యా సంస్థలను ఎంపిక చేసి వాటికి సకల వనరులూ కల్పించి తీర్చిదిద్దాలన్న సంకల్పమూ మంచిదే. కానీ తాము ప్రపంచశ్రేణి విద్యా సంస్థలుగా రూపొం దుతామని ఇచ్చిన వాగ్దానాన్ని ఓ కమిటీ పరిశీలించి, వాటికి ఆ సామర్థ్యం ఉన్నదని అంచనా వేసుకుని, ఆ వెనువెంటనే వాటికి ఘనతర విద్యాసంస్థలన్న భుజకీర్తులు కట్టబెట్టడం భావ్యమేనా అన్న సందేహం సహజంగానే తలెత్తుతుంది. సోమవారం కేంద్ర మానవ వనరుల అభివృద్ధి (హెచ్‌ఆర్‌డీ) మంత్రిత్వ శాఖ వెలువరించిన జాబితాలో చోటు దక్కిన సంస్థలు సరే... దక్కని సంస్థలేమిటో గమనిస్తే ఎంపికకు కమిటీ అనుసరించిన ప్రాతిపదికలేమిటన్న గందరగోళం ఏర్ప డుతుంది.

మొన్న ఏప్రిల్‌లో ఇదే హెచ్‌ఆర్‌డీ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన పది అత్యుత్తమ యూనివర్సిటీల జాబితాలో బెంగళూరుకు చెందిన ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌(ఐఐఎస్‌సీ)కి ప్రథమ స్థానం వస్తే, ఢిల్లీ జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్సిటీ, బనారస్‌ హిందూ యూనివర్సిటీ రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. మన హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ అయిదో స్థానంలో ఉంది. ఇంకా జాదవ్‌పూర్‌ యూనివర్సిటీ, సావిత్రిబాయి ఫూలే యూనివర్సిటీ, అలీగఢ్‌ ముస్లిం యూనివర్సిటీ వగైరాలున్నాయి. ఈ సంస్థలన్నీ అత్యుత్తమ సంస్థల జాబితాలో ఎప్పుడూ అగ్ర భాగానే ఉంటాయి. కానీ ఇందులో ఇప్పుడు ఒక్క ఐఐఎస్‌సీకి తప్ప మరే విద్యా సంస్థకూ చోటు దొరకలేదు. ఏప్రిల్‌నాటి జాబితాలో ఎక్కడో ఉన్న ఢిల్లీ ఐఐటీ, బాంబే ఐఐటీలు మాత్రం తాజా జాబితాలో చేరాయి.
 
హెచ్‌ఆర్‌డీ మంత్రిత్వ శాఖ ఈ ఘనతర విద్యాసంస్థల ఎంపిక బాధ్యతను త్వరలో రద్దు కాబోతున్న యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌(యూజీసీ)కి అప్పజెప్పింది. యూజీసీ ఇందుకోసం మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్‌ ఎన్‌. గోపాలస్వామి నేతృత్వంలో 13మందితో సాధికార నిపుణుల కమిటీ ని నియమించింది. మొదట్లో పబ్లిక్‌ రంగంలో పది, ప్రైవేటు రంగంలో పది విద్యా సంస్థల్ని ఎంపిక చేస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించినా చెరో మూడింటితో సరిపెట్టారు. ఎంపికైన పబ్లిక్‌ రంగ విద్యాసంస్థకు ఒక్కోదానికి ఏడాదికి రూ. 1,000 కోట్లు సమకూర్చాలని నిర్ణయించినందువల్ల కావొచ్చు...జాబితా చిక్కిపోయింది.

పది సంస్థల్ని గనుక ఎంపిక చేస్తే వీటికోసం ఏడాదికి రూ. 10,000 కోట్లు ప్రత్యేకించి కేటాయించాల్సివస్తుంది. అది పెనుభారం కావొచ్చునన్న ఉద్దేశంతో ఇప్పుడు మూడింటికే పరిమితమైనట్టు కనబడుతోంది. ఇక ప్రైవేటు రంగ సంస్థలు సొంతంగా నిధులూ, ఇతర వనరులూ సమకూర్చుకోవాల్సి వస్తుంది. ఈ సంస్థలన్నీ నియంత్రణ వ్యవస్థ నుంచి విముక్తమవుతాయి. ఎలాంటి ప్రమాణాలు నిర్దేశించాలో, ప్రవేశాలకు ఏ ప్రాతిపదికలు నిర్ణయిం చాలో, ఎవరిని అధ్యాపకులుగా తీసుకోవాలో, ఏ కోర్సులు ప్రవేశపెట్టాలో, ఏ ప్రపంచ విశ్వ విద్యాలయాలతో ఒప్పందాలు కుదుర్చుకోవాలో,  ఏ ఏ రంగాల్లో పరిశోధనలకు స్థానమీయాలో ఇవి సొంతంగా నిర్ణయించుకుంటాయి.

ఎంపికైన ప్రభుత్వ రంగ సంస్థలు ప్రస్తుత చట్టాలకూ, నియం త్రణలకూ లోబడే పనిచేస్తాయని చెప్పినా... వాటికి కొన్ని వెసులుబాట్లు కల్పిస్తామని నిరుడు విడుదల చేసిన పత్రం తెలిపింది.  ఆ వెసులుబాట్లలోనే ఒక ప్రమాదం పొంచి ఉంది. విద్యార్థుల నుంచి ఎంత ఫీజు వసూలు చేయాలో నిర్ణయించుకునే స్వేచ్ఛ వీటికిచ్చారు. అయితే ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఏ విద్యార్థికైనా ప్రవేశం నిరాకరించకుండా స్కాలర్‌షిప్‌లు, రుణ సదుపాయం అందు బాటులో ఉంచాలని సూచించినా ఆచరణలో అది ఎందరికి దక్కుతుందో చూడాలి.
 
ఈ జాబితాలోని ప్రైవేటు సంస్థల గురించి చెప్పుకోవాలి. వీటిలో మణిపాల్‌ అకాడమీ ఆఫ్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్, బిట్స్‌ పిలానీ, రిలయన్స్‌కు చెందిన జియో ఇనిస్టిట్యూట్‌ ఉన్నాయి. ఇందులో మణిపాల్‌ అకాడమీ, బిట్స్‌ పిలానీలకున్న పేరు ప్రఖ్యాతుల గురించి వేరే చెప్పుకోనవసరం లేదు. కానీ ఇంకా కళ్లు తెరవని జియో ఇనిస్టిట్యూట్‌కు ఘనతర శ్రేణి విద్యా సంస్థల జాబితాలో చోటెలా దక్కిందో అనూహ్యం. దీనికి గ్రీన్‌ఫీల్డ్‌ కేటగిరీలో ఇచ్చామని, అది కూడా ‘అంగీకారపత్రమే’ తప్ప పూర్తి స్థాయి హోదా కాదని హెచ్‌ఆర్‌డీ చెబుతోంది. వచ్చే మూడేళ్లలో నిరూపించుకుంటే ఆ హోదా దక్కుతుందని వివరిస్తోంది.

అలాంటపుడు ముందే దాన్ని ఇతర అగ్రశ్రేణి సంస్థల జాబితాలో చేర్చడం ఎందుకు? అగ్రశ్రేణిలో ఉంటామని చెబుతున్న సంస్థ ప్రస్తుత పనితీరు, మరింత ఉన్నతంగా ఎదగడానికి అది అనుసరించదల్చుకున్న విధానాలు బేరీజు వేసుకుని, అందుకు దానికున్న అవకాశాలేమిటో, సామర్థ్యమెంతో పరిగణనలోకి తీసుకుని నిర్ణయిస్తే ఎవరికీ అభ్యంతరం ఉండదు. జియో ఇనిస్టిట్యూట్‌కు రిలయన్స్‌ వంటి అగ్రగామి సంస్థ దన్ను ఉంది. ఆర్థిక వనరులూ పుష్కలంగా ఉన్నాయి.

వాటినెవరూ కాదనరు. కేవలం సంస్థ వెనకుండే నిధులు, దాని స్థిరాస్తులు చూసి ఇప్పటికిప్పుడు జాబితాలో చోటు ఇవ్వడానికి బదులు మూడేళ్ల తర్వాత నిరూపించుకున్నాకే ఆ స్థాయి కల్పించవచ్చుకదా అనే సందేహం ఎవరికైనా వస్తుంది. నిజానికి అశోకా యూనివర్సిటీ, జిందాల్‌ యూనివర్సిటీ వంటి ప్రైవేటు రంగ సంస్థలు ఇప్పటికే ఖ్యాతి గడించాయి. వాటినెందుకు విస్మ రించారో ఎవరికీ తెలియదు. 1995లో చైనా ‘ప్రాజెక్టు–211’ పేరిట వంద విశ్వవిద్యాలయాలు నెల కొల్పాలని నిశ్చయించుకుని వాటికి పుష్కలంగా నిధులు మంజూరు చేసింది.

దాదాపు పాతికేళ్లు గడిచేసరికి అవన్నీ విద్యలో, పరిశోధనల్లో ప్రపంచంలోనే మేటిగా తయారయ్యాయి. మన ఉన్నత స్థాయి విద్యాలయాలు నిధుల కొరతతో, సౌకర్యాల లేమితో ఇబ్బందులు పడుతున్నాయి. కాంట్రాక్టు అధ్యాపకులతో నెట్టుకొస్తున్నాయి. విద్యార్థులకు ఇక్కడ నాసిరకం విద్యే దిక్కవుతున్నది. వీటన్నిటికీ జవసత్వాలు చేకూర్చే విస్తృత ప్రణాళికలు రూపొందించడానికి బదులు కేవలం కొన్నిటికే నిధుల వరద పారించి, ఇతర సంస్థల కడుపు మాడ్చడం వల్ల దేశానికి ఒరిగేదేమిటో పాలకులే చెప్పాలి.

Read latest Editorial News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top