నిత్యనూతన విప్లవ స్ఫూర్తి

how october revolution inspired the world - Sakshi

‘ప్రపంచ విప్లవాల వేగుచుక్క’ అక్టోబర్‌ విప్లవానికి నేటితో శత వసంతాలు నిండాయి. మూడు శతాబ్దాలపాటు రష్యా సామ్రాజ్యాన్ని అవిచ్ఛిన్నంగా ఏలిన జార్‌ చక్రవర్తుల నిరంకుశ పాలనను అంతమొందించిన ఆ విప్లవం అన్నివిధాలా విశిష్ట మైనది. చరిత్రలో అంతక్రితం 1776లో జరిగిన అమెరికన్‌ విప్లవం బ్రిటన్‌ పెత్తనాన్ని తుత్తునియలు చేసి ఉండొచ్చు. స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వాలను ‘పారిస్‌ కమ్యూన్‌’గా ఆవిష్కరించి చూపిన 1789నాటి ఫ్రెంచ్‌ విప్లవం రాజరికానికి చర మగీతం పలికి ఉండొచ్చు. కానీ అవి స్వల్పకాలానికే కడతేరిపోయాయి. తమ తమ పరిధుల్లోనే, పరిమితుల్లోనే ఉండిపోయాయి. ఒక సంపన్న వర్గం స్థానంలో మరో సంపన్న వర్గ ఆధిపత్యాన్ని మాత్రమే నెలకొల్పాయి.

కానీ రష్యాలో బోల్షివిక్‌ పార్టీ ఆధ్వర్యంలో ప్రారంభమై 1917 అక్టోబర్‌లో విజయం సాధించిన మహా విప్లవానికి అంతకు 70 ఏళ్లక్రితం మార్క్స్, ఏంగెల్స్‌లు రూపొందించిన కమ్యూనిస్టు మేనిఫెస్టో స్ఫూర్తి ఉంది. చరిత్రలో జరిగిన అనేక పోరాటాల నుంచి తీసుకున్న గుణపాఠాలు న్నాయి. అన్నిటికీ మించి వేర్వేరు సామ్రాజ్యాలు పరస్పరం సంఘర్షించుకుంటూ జన జీవితాలను సంక్షోభంలోకి నెట్టిన వర్తమానం ఉంది. సిద్ధాంతబలం పుష్కలంగా ఉన్న రష్యన్‌ సోషల్‌ డెమొక్రటిక్‌ వర్కర్స్‌ పార్టీ(ఆర్‌ఎస్‌డీ డబ్ల్యూపీ) ఉంది. దాని వెనక పిలుపు ఇచ్చినంతనే ముందుకురికే మెరికల్లాంటి బోల్షివిక్‌ విప్లవ శ్రేణులు న్నాయి. పటిష్టమైన వ్యూహం, ఎత్తుగడలూ రూపొందించగల లెనిన్‌ నాయకత్వ ముంది. అందుకే 1917 ఫిబ్రవరిలో జార్‌ చక్రవర్తి స్థానంలో మరో సంపన్న వర్గానికి అధికారం కట్టబెట్టిన ప్రజాతంత్ర విప్లవం అచిరకాలంలోనే మహా విప్లవంగా రూపు దిద్దుకుంది. అక్టోబర్‌ నెలాఖరు నాటికల్లా(కొత్త క్యాలెండర్‌ ప్రకారం అది నవంబర్‌ 7) ఆ పాలకులను గద్దె దింపి కార్మిక వర్గ ఆధిపత్యాన్ని నెలకొల్పింది. అది ఈనాటికీ పెట్టుబడిదారీ, సామ్రాజ్యవాద పాలకులను ప్రపంచంలో ఏదో ఒక మూల చికాకు పరుస్తూనే ఉంది.  

ఇదంతా లెనిన్‌కు సునాయాసంగా చిక్కలేదు. ఆర్‌ఎస్‌డీ డబ్ల్యూపీలో తమతో పాటు పనిచేస్తున్న మెన్షివిక్కులతో సైద్ధాంతిక పోరాటం జరిపాడు. జార్‌ పాలనలో విధించిన ప్రవాస శిక్ష నుంచి ఏప్రిల్‌లో స్వదేశానికొచ్చేసరికి లెనిన్‌ అనుచరులైన బోల్షివిక్‌లలోనే ఫిబ్రవరి విప్లవంపై సానుకూలత ఉంది. జార్‌ చక్రవర్తి ఆరంభించిన యుద్ధానికి ముగింపు పలకని ఈ కొత్త పాలకుల వల్ల దేశంలో నిజమైన ప్రజాతంత్ర పాలన ఏర్పడదని, కార్మికవర్గ నియంతృత్వమే అందుకు జవాబని లెనిన్‌ వాదిం చాడు. దేశంలోఅందరికీ తిండి, శాంతి, సుస్థిరత ఏర్పడాలంటే అల్ప సంఖ్యాకుల పాలనను అంతమొందించక తప్పదని ప్రకటించాడు. ఏళ్ల తరబడి ప్రవాసంలో ఉన్న లెనిన్‌కు స్థానిక పరిస్థితులు అవగాహన కాలేదని బోల్షివిక్‌లే మొదట్లో భావించారు. ఒకానొక సమయంలో లెనిన్‌ దాదాపు ఒంటరయ్యాడు. కానీ అందరి అంచనాలనూ రష్యా ప్రజలు తారుమారు చేశారు. కార్మికులు, సైనికులు, రైతులు లెనిన్‌ నాయ కత్వంలోని బోల్షివిక్‌ పార్టీ వెనక సమీకృతులై ప్రపంచంలోనే తొలి సోషలిస్టు వ్యవస్థను స్థాపించుకున్నారు. భూస్వాముల చేతుల్లో ఉండే లక్షల ఎకరాల భూమి ప్రజల పరమైంది. కార్మికులు రోజుకు ఎనిమిది గంటలు మించి పనిచేయనక్కర లేదన్న ఉత్తర్వు వెలువడింది. వివిధ జాతులకు విడిపోయే స్వేచ్ఛనిచ్చారు. అలా విడి పోతామన్న ఫిన్లాండ్‌కు స్వాతంత్య్రం ప్రకటించారు. నిరంకుశ రష్యా రాజ్యం అంత రించి వివిధ రిపబ్లిక్‌ల సమాఖ్యగా ఉన్న యునైటెడ్‌ సోవియెట్‌ సోషలిస్టు రిపబ్లిక్స్‌ (యూఎస్‌ఎస్‌ఆర్‌) ఆవిర్భవించింది.

అక్టోబర్‌ విప్లవ ప్రభావం ఎల్లలు దాటి ప్రవహించింది. ప్రపంచాన్ని వాటాలేసి పంచుకోవడానికి సంఘర్షిస్తున్న సామ్రాజ్యవాద దేశాలను ఈ విప్లవం విస్మయ పరిచింది. మరోపక్క ప్రపంచవ్యాప్తంగా వలస పాలకులకు వ్యతిరేకంగా పోరాడు తున్న దేశాల్లోని ప్రజలందరికీ ఆ విప్లవం వేగుచుక్కగా కనబడింది. మన దేశంలో అప్పటికే సాగుతున్న స్వాతంత్య్ర పోరాటానికి బోల్షివిక్‌ పార్టీ, లెనిన్‌ల మద్దతు లభించింది. అలాగే అక్టోబర్‌ విప్లవ విజయాన్ని, లెనిన్‌ నాయకత్వాన్ని బాలగంగా ధర్‌ తిలక్‌వంటి జాతీయ నాయకులు, రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ లాంటి రచయితలు కీర్తించారు. బ్రిటిష్‌ పాలకులపై పోరాడి 23 ఏళ్ల వయసులోనే ఉరికంబం ఎక్కిన భగత్‌సింగ్‌ తదితర యువకిశోరాలకు గదర్‌ పార్టీతోపాటు అక్టోబర్‌ విప్లవమే స్ఫూర్తి. రెండో ప్రపంచ యుద్ధకాలంలో దండెత్తి వచ్చిన హిట్లర్‌ సైన్యాలను మట్టికరిపించి ప్రపంచాన్ని నాజీయిజం ముప్పు నుంచి తప్పించింది సోవియెట్‌ రాజ్యమే.

అక్టోబర్‌ విప్లవాన్ని సాధించిన గడ్డపై ఇవాళ దాని ఊసే లేదు. రష్యా చరిత్రలో అసలు అలాంటి పెను మార్పు జరిగిందన్న స్పృహే లేనట్టు  ఆ దేశ అధ్యక్షుడు పుతిన్‌ ప్రవర్తిస్తున్నారు. మేధావులు చర్చలు, సెమినార్లు నిర్వహించుకుంటారుగానీ సాధారణ పౌరులకు దాంతో పని లేదని ఇప్పటికే ఆయన ప్రకటించారు. ‘లెనిన్‌ తపస్సు, స్టాలిన్‌ సేద్యం’ సోవియెట్‌ యూనియన్‌ నిండా 70 ఏళ్లు కూడా నిలబడలేదు. అక్కడ స్టాలిన్‌తోనే సామ్యవాదం అంతరించి పెట్టుబడిదారీ విధానం వచ్చిందనేవారు కొందరైతే... 1992లో గోర్బచెవ్‌ అసమర్ధ పాలనవల్లే సోవియెట్‌ కుప్పకూలిందని, అప్పటివరకూ అక్కడ సోషలిజం వర్ధిల్లిందని వాదించేవారు మరికొందరు. అయితే మానవేతిహాసంలో వందేళ్లనేది చాలా స్వల్పకాలం. అన్ని సమాజాల్లోనూ కనబడుతున్న అసమానతలను అధ్యయనం చేసి, వాటి పుట్టు పూర్వోత్తరాలను వెలికితీసి, అవి వర్థిల్లడానికి కారణమవుతున్న శక్తులనూ, వాటి మూలాలనూ పట్టుకుని సిద్ధాంతీకరించింది మార్క్స్, ఏంగెల్స్‌లు. ఆ సిద్ధాంతాలను ఆచరించి అధిక సంఖ్యాకుల ప్రయోజనాలను కాపాడే వ్యవస్థల నిర్మాణం సాధ్యమేనని నిరూపించినవాడు లెనిన్‌. ఈ ఆచరణ ప్రపంచవ్యాప్తంగా పాలకుల వైఖరిలో మార్పు తీసుకొచ్చింది. జన సంక్షేమాన్ని కాంక్షించే ఆచరణ లేకపోతే పుట్టగతులుండవన్న స్పృహ ఏర్పరిచింది. అక్టోబర్‌ విప్లవ స్ఫూర్తి అజరామరం. ప్రపంచంలో ఏదో ఒక మూల, ఏదో ఒక రూపంలో అది అందరినీ ప్రభావితం చేస్తూనే ఉంటుంది.

Read latest Editorial News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top