‘మధ్యంతర’ సందడిలో బ్రిటన్‌ | Sakshi
Sakshi News home page

‘మధ్యంతర’ సందడిలో బ్రిటన్‌

Published Sat, Nov 2 2019 12:46 AM

Editorial On UK Parliament Interim Elections - Sakshi

చరిత్రలో కనీవినీ ఎరుగని స్థాయి రాజకీయ సంక్షోభంలో కూరుకుపోయిన బ్రిటన్‌ ఎట్టకేలకు వచ్చే నెల 12న పార్లమెంటుకు మధ్యంతర ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించింది. అయిదేళ్లకోసారి ఎన్నికలు జరిగే బ్రిటన్‌లో నాలుగేళ్లలో ఎన్నికలు రావడం ఇది రెండోసారి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎన్నికలకు వెళ్లడమే మార్గమని గత రెండు నెలలుగా బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ వాదిస్తున్నారు. అయితే సొంత పార్టీతోపాటు విపక్షమైన లేబర్‌ పార్టీ నుంచి కూడా వ్యతిరేకత రావడంతో ఆయన మాట నెగ్గలేదు. యూరప్‌ యూనియన్‌(ఈయూ) నుంచి బ్రిటన్‌ వైదొలగడం(బ్రెగ్జిట్‌)పై ఉన్న తుది గడువు అక్టోబర్‌ 31తో ముగియవలసి ఉండగా, వచ్చే ఏడాది జనవరి 31 వరకూ పొడిగిం చడానికి ఈయూ అంగీకరించడంతో లేబర్‌ పార్టీ తన వైఖరి మార్చుకుంది. దాంతో మధ్యంతర ఎన్నికలకు మార్గం సుగమమైంది. క్రిస్మస్‌ పండుగ హడావుడి ఉండే డిసెంబర్‌లో ఎన్నికలు రావడం 1923 తర్వాత బ్రిటన్‌లో ఇదే మొదటిసారి. అయితే ఈ ఎన్నికల తర్వాతనైనా ఇప్పుడున్న అనిశ్చితి తొలగుతుందని స్పష్టంగా చెప్పగల పరిస్థితి లేదు. ఎందుకంటే అటు రాజకీయ పక్షాల్లోనూ, ఇటు ప్రజల్లోనూ ఈయూ నుంచి వైదొలగడంపై అస్పష్టత ఉంది. ఒకప్పుడు బ్రెగ్జిట్‌కు బలంగా అనుకూ లత వ్యక్తం చేసిన వర్గాలు ఇప్పుడంత సుముఖంగా లేవు. 

2015 ఎన్నికల సమయంలో అప్పటి ప్రధాని డేవిడ్‌ కామెరాన్‌ నేతృత్వంలోని కన్సర్వేటివ్‌ పార్టీకి అధికారం చేజారుతుందన్న భయం పట్టుకుంది. ఎన్నికల సర్వేలన్నీ లేబర్‌ పార్టీ నెగ్గుతుం దని జోస్యం చెప్పాయి. ఆ పార్టీ బ్రెగ్జిట్‌కు గట్టి వ్యతిరేకి. దాంతో ఎలాగైనా మళ్లీ అధికారంలోకి రావాలన్న పట్టుదలతో ఉన్న కామెరాన్‌ అలవిగాని  హామీలిచ్చారు. తామొస్తే బ్రెగ్జిట్‌పై రిఫరెండం నిర్వహించి అవసరమైతే ఈయూ నుంచి వైదొలగుతామన్నది ఆ హామీల్లో ఒకటి. నైజల్‌ ఫరాజ్‌ నేతృత్వంలోని బ్రెగ్జిట్‌ అనుకూల పార్టీ వల్ల తమకు నష్టం ఉండకూడదని భావించే కామెరాన్‌ ఈ హామీ ఇచ్చారు. తీరా ఫలితాలు వచ్చాక చూస్తే అందరి అంచనాలూ తలకిందులయ్యాయి. అంత వరకూ లిబరల్‌ డెమొక్రాట్లతో కలిసి అధికారాన్ని పంచుకున్న కన్సర్వేటివ్‌లకు ఊహించని స్థాయిలో సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగల స్థాయిలో మెజారిటీ వచ్చింది. 650 స్థానా లున్న హౌస్‌ ఆఫ్‌ కామన్స్‌లో ఆ పార్టీకి 331 స్థానాలు లభించాయి. అధికారం దక్కుతుందనుకున్న లేబర్‌ పార్టీ విపక్షంగా ఉండిపోయింది. లిబరల్‌ డెమొక్రాట్లు, బ్రెగ్జిట్‌ పార్టీ తుడిచిపెట్టుకు పోయాయి. లిబరల్‌ డెమొక్రాటిక్‌ పార్టీ సాకు చూపి రిఫరెండం నుంచి తప్పించుకోవచ్చుననుకున్న కన్సర్వేటివ్‌ పార్టీ ఇరుక్కుపోయింది. ఫలితంగా కామెరాన్‌కు వ్యక్తిగతంగా ఇష్టం లేకపోయినా 2016లో రిఫరెండం నిర్వహించకతప్పలేదు. అందులో 51.9 శాతంమంది ఈయూ నుంచి బయ టకు రావడంవైపే మొగ్గు చూపారు.

ఫలితంగా కామెరాన్‌ వైదొలగి ఆ స్థానంలో థెరిస్సా మే ప్రధాని అయ్యారు. 2017 జూన్‌లో మధ్యంతర ఎన్నికలు జరిగాక కన్సర్వేటివ్‌ల బలం బాగా తగ్గి పోయింది. అది 218 స్థానాలకు పరిమితమై, 10 స్థానాలున్న డెమొక్రటిక్‌ యూనియనిస్టు పార్టీ (డీయూపీ)తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఆ తర్వాత బ్రెగ్జిట్‌పై ఆమె ఈయూతో కుదుర్చుకొచ్చిన ఒప్పందాలను పార్లమెంటు వరసగా మూడుసార్లు తోసిపుచ్చడంతో థెరిస్సా రాజీ నామా చేయకతప్పలేదు. ఆమె స్థానంలో వచ్చిన బోరిస్‌ జాన్సన్‌ను కూడా ఈ కష్టాలే వెంటా డాయి. పార్లమెంటులో అత్యధికులు ఆయన కుదుర్చుకొచ్చిన ఒప్పందాన్ని తిరస్కరించారు. ఆ ఒప్పందం వల్ల బ్రిటన్‌ 9వేల కోట్ల డాలర్లు నష్టపోవాల్సివస్తుందని నిపుణులు లెక్కలేశారు. బ్రెగ్జిట్‌ తుది గడువు దగ్గరపడుతుండగా పార్లమెంటులో ఎటూ తేలకపోవడంతో బోరిస్‌ జాన్సన్‌ చివరకు మధ్యంతర ఎన్నికల ప్రతిపాదన చేశారు. ఇప్పటికైతే ప్రజాభిప్రాయం ఆయనవైపే ఉంది. కానీ అది చివరివరకూ నిలబడుతుందన్న నమ్మకం లేదు. 2017 ఎన్నికల ముందు థెరిస్సా మే సైతం అందరి కన్నా ముందున్నారు. తీరా ఫలితాల్లో సీట్లు గణనీయంగా తగ్గిపోయాయి. 

పార్టీలో ఉన్న తన వ్యతిరేకుల ప్రాబల్యం పెరగకుండా చూడటం, ప్రజల్లో బ్రెగ్జిట్‌ అనుకూల తను మళ్లీ పెంచడం ఇప్పుడు బోరిస్‌ జాన్సన్‌ లక్ష్యాలు. వీటిల్లో ఆయన ఎంతవరకూ సఫలీకృతుల వుతారో ఎవరూ చెప్పలేకపోతున్నారు. తాను ఈయూతో మెరుగైన ఒప్పందం కుదుర్చుకొచ్చినా పార్లమెంటులో తనకెవరూ సహకరించలేదని జాన్సన్‌ ప్రచారం చేస్తారు. అయితే గతంతో పోలిస్తే ఇప్పుడంతా మారింది. ఆర్థిక అనిశ్చితి, సామాజిక అభద్రత చవిచూసిన అనేక ప్రాంతాలు 2016లో బ్రెగ్జిట్‌కు అనుకూలంగా ఓటేసినా...ఆ తర్వాత లేబర్‌ పార్టీవైపు మొగ్గుచూపాయి. బ్రెగ్జిట్‌ అనుకూ లుర ఓట్లు దూరం చేసుకోకూడదన్న భావనతో లేబర్‌ పార్టీ మునపట్లా బ్రెగ్జిట్‌ను గట్టిగా వ్యతి రేకించడం లేదు.

తాము వస్తే మరోసారి బ్రెగ్జిట్‌పై రిఫరెండం నిర్వహించి దేశ ప్రయోజనాలు కాపా డతామని హామీ ఇస్తోంది. అదే సమయంలో దానితో సంబంధం లేని సంక్షేమ పథకాల గురించి ప్రచారం చేస్తోంది. ఇక తిరిగి పుంజుకుంటున్నట్టు కనిపిస్తున్న లిబరల్‌ డెమొక్రాట్లు అసలు బ్రెగ్జిట్‌ జోలికే పోవద్దన్న తమ పాత వాదనను బలంగా వినిపిస్తున్నారు. బ్రిటన్‌ ఎదుర్కొంటున్న సమస్య లకు ఈయూ సభ్యత్వాన్ని సాకుగా చూపడం రాజకీయ నేతలు చేసిన తప్పు. బ్రెగ్జిట్‌లో ఇమిడి ఉండే సమస్యలేమిటో ఈ నాలుగేళ్లలో ప్రజలకు బాగా అర్థమైంది. దేశంలో పేదరికం ఎన్నడూ లేనంత పెరిగింది. జాతీయ ఆరోగ్య సర్వీస్‌(ఎన్‌హెచ్‌ఎస్‌)కు నిధుల కేటాయింపు బాగా తగ్గింది. అదొక్కటే కాదు... మొత్తంగా సంక్షేమానికి భారీ కోతలు అమలవుతున్నాయి. వీటన్నిటా లేబర్‌ పార్టీ వైఖరిపై ప్రజల్లో సానుకూలత ఉంది. కానీ లేబర్‌ పార్టీ నాయకుడు జెరిమీ కోర్బిన్‌ సమర్థతపై పార్టీలోనే సందేహాలున్నాయి. వీటిని కోర్బిన్‌ అధిగమించవలసి ఉంది. తాజా ఎన్నికలు ఇప్పుడున్న అనిశ్చితికి తెరదించితే మళ్లీ బ్రిటన్‌ చురుగ్గా ముందుకెళ్తుంది. 

Advertisement

తప్పక చదవండి

Advertisement