రెచ్చిపోయిన మాఫియాలు

Editorial on Mafia Gangs - Sakshi

బిహార్, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాల్లో ఒకే రోజు ముగ్గురు పాత్రికేయులను మాఫియా ముఠాలు పొట్టనబెట్టుకున్నాయి. ఆ రెండు రాష్ట్రాలూ మాఫియా ముఠాల ఆగడాలను దశాబ్దాలుగా చవిచూస్తూనే ఉన్నాయి. ఇతర ప్రాంతాల్లో అంతా సవ్యంగా ఉన్నదని కాదు. న్యూఢిల్లీ మొదలుకొని ఈశాన్య రాష్ట్రాల వరకూ అన్నిచోట్లా పాత్రికేయులు మాఫియాలనుంచీ, పోలీసులనుంచి ఏదో రూపంలో బెదిరింపులు ఎదుర్కొంటూనే ఉన్నారు. బస్తర్‌వంటి ప్రాంతాల్లో పోలీసులే బాహాటంగా పాత్రి కేయులపై స్థానికుల్ని ఉసిగొల్పి వారిని రాష్ట్రం నుంచి వెళ్లగొట్టారు. గత రెండేళ్లలో 12మంది పాత్రికేయులు ప్రాణాలు కోల్పోయారు. 50కి పైగా దాడుల ఉదంతాలు చోటుచేసుకున్నాయి. 

గతంతో పోలిస్తే మాధ్యమాల విస్తృతి పెరిగింది. పాలకుల కైనా, వారి అండదండలతో చెలరేగిపోతున్న మాఫియాలకైనా ఈ కొత్త పరిస్థితి మింగుడుపడటం లేదు. కనుకనే రకరకాల విధానాల ద్వారా మాధ్యమాల గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన పార్టీకి చెందిన ఇతరులు ఇందులో ఆరితేరారు. ‘సాక్షి’పై పలు విధాలుగా వివక్ష ప్రదర్శించిన చరిత్ర బాబుది. ఇబ్బందికరమైన ఉదంతాలు జరిగినప్పుడు చానెళ్ల ప్రసారాలను ఆపేయడం, కొన్ని సందర్భాల్లో నెలల తరబడి వాటికి ఆటంకం కలిగించడం అక్కడ రివాజు. వాట్సాప్, ఫేస్‌బుక్‌ వంటి మాధ్యమాల్లో తమపై విమర్శలు చేశారన్న అక్కసుతో అర్థరాత్రుళ్లు పోలీసులతో దాడులు చేయించి కొందరిని నిర్బంధంలోకి తీసుకున్న ఉదంతాలు జరిగాయి. 

ఏతా వాతా స్వతంత్రంగా, నిర్భయంగా ఉన్నదున్నట్టు చెప్పడానికి ప్రయత్నించే పాత్రికేయు లకు ఇది గడ్డుకాలం. నిజానికి జరిగేవాటితో పోలిస్తే మీడియాలో వెల్లడవుతున్న ఉదంతాలు చాలా తక్కువ. న్యూఢిల్లీలోనో, మరో నగరంలోనో పాత్రికేయులపై దాడులు జరిగినప్పుడు అవి మీడియా దృష్టిని ఆకర్షిస్తాయి. కనుక వాటి గురించి అందరూ మాట్లాడుకుంటారు. ప్రభుత్వాలు కూడా స్పందించకతప్పని స్థితిలో పడతాయి. కానీ మారుమూల ప్రాంతంలో జరిగేవి సరిగా వెల్లడికావు. అక్కడ పోలీసులు, మాఫియా ముఠాలు కుమ్మక్కయితే అలా బయటపెట్టిన పాత్రికేయుల ప్రాణాలకు భరోసా ఉండదు. 

బిహార్‌లోని భోజ్‌పూర్‌ జిల్లాలో తాజాగా జరిగిన ఉదంతం వింటే దిగ్భ్రాంతి కలుగుతుంది. రాజధాని పట్నాకు 80 కిలోమీటర్ల దూరంలోని గర్హని గ్రామంలో బాల్య వివాహాలకు, వరకట్నం దురాచారానికి వ్యతిరేకంగా జరిగే మానవహారంలో పాల్గొనమని గ్రామస్తులపై స్థానిక అధికారి ఒకరు ఒత్తిళ్లు తెచ్చారని, బెదిరించారని రాసిన వార్త సర్పంచ్‌ భర్తకు అభ్యంతరకరంగా తోచింది. అలాగే ఆక్రమణల తొలగింపులో అధికారులు తన అధీనంలోని స్థలాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారని వెల్లడించడం ఆగ్రహం కలిగించింది. పర్యవసానంగా మోటార్‌సైకిల్‌పై వెళ్తున్న వారిద్దరినీ వాహనంతో ఢీకొట్టి హత్య చేశాడు. మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో ఒక చానెల్‌లో పనిచేస్తున్న మరో పాత్రికేయుణ్ణి ఇసుక మాఫియా ట్రక్కుతో ఢీకొట్టించి ప్రాణాలు తీసింది. 

చంబల్‌ నదీ గర్భం నుంచి ఇసుక తరలిస్తున్న మాఫియాతో స్థానిక పోలీసు అధికారి కుమ్మక్కవుతున్న తీరును నిరూపించేందుకు ఆ పాత్రి కేయుడు ఇసుక మాఫియాకు చెందిన వ్యక్తిగా పరిచయం చేసుకుని మాట్లాడి, ఆ అధికారి అడిగిన డబ్బులో కొంత మొత్తం చెల్లించాడు. దాన్నంతటినీ రహస్య కెమెరాలో చిత్రించాడు. ఇది ప్రసారమయ్యాక అతనిపై ఆ పోలీసు అధికారి కక్షగట్టాడు. చిత్రమేమంటే నిరుడు నవంబర్‌లో ఈ కథనం ప్రసారం చేశాక అటు ఇసుక మాఫియానుంచి, ఇటు పోలీసు అధికారి నుంచి బెదిరింపులు రావడంతో పోలీసు రక్షణ కావాలని పాత్రికేయుడు ఉన్నతాధికారులకు దరఖాస్తు చేసుకు న్నాడు. ఆ సంగతిని జిల్లా ఎస్‌పీ కూడా ధ్రువీకరిస్తున్నారు. కానీ ఆయన అడిగిన రీతిలో రక్షణ కల్పించలేకపోయారు. 

మధ్యప్రదేశ్‌లో మాఫియాలెలా చెలరేగుతున్నాయో అక్కడ ఏళ్ల తరబడి కొనసాగిన వ్యాపమ్‌ కుంభకోణమే చెబుతుంది. ఆ కుంభకోణాన్ని బయట పెట్టినవారు మాత్రమే కాదు... అందులో నిందితులుగా ఉన్నవారు సైతం వివిధ సందర్భాల్లో అనుమానాస్పద స్థితిలో మరణించారు. ఇదంతా చూసి ఆ కేసులో నిందితులుగా అరెస్టయి జైళ్లలో ఉన్న పలువురు బెయిల్‌ మంజూరైనా జైళ్లను వదిలి బయటికొచ్చేందుకు సిద్ధపడలేదు. ఆరోపణలెదుర్కొని అరెస్టయిన అధికారి గుండెపోటుతో మరణిస్తే కుటుంబసభ్యులు అది హత్య అని అనుమానించాక వారికి బెదిరింపులొచ్చాయి. అలాగే ఈ కేసులో నిందితురాలుగా ఉన్న ఒక యువతి బెయిల్‌పై విడుదలైన కొద్దిరోజులకే శవంగా మారింది. ఈ మిస్టరీని ఛేదించడానికి ప్రయత్నించిన పాత్రికేయుడు ఉన్నట్టుండి నురుగలు కక్కుకుని చనిపోయాడు. దాదాపు ఆరున్నరవేల కోట్ల రూపాయల ఈ కుంభకోణంపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించకపోవడాన్ని సుప్రీంకోర్టు తప్పుబట్టాక తప్పనిసరై మూడేళ్లక్రితం కేంద్రమూ, మధ్యప్రదేశ్‌ ప్రభుత్వమూ అందుకు అంగీకరించాయి. 

నిజాల్ని నిర్భయంగా వెలుగులోకి తెచ్చే పాత్రికేయులపైనా, అక్రమాలను అందరి దృష్టికీ తెచ్చే పౌరులపైనా ఇలా వరసబెట్టి దాడులు జరుగుతున్న నేపథ్యంలో విజిల్‌బ్లోయర్స్‌ చట్టం ఏమైందన్న అనుమానం ఎవరికైనా వస్తుంది. ఆ చట్టం 2014లో పార్లమెంటు ఆమోదం పొందినా దాని అమలుకు సంబంధించిన విధివిధానాల రూపకల్పనలో అంతులేని జాప్యం చోటు చేసుకుంది. ఆ కర్మకాండ పూర్తికాకుండానే కేంద్రం దానికి సవరణలు ప్రతిపాదిస్తూ బిల్లు తెచ్చింది. దాని అతీగతీ ఇంకా తేలలేదు. ఈలోగా మాఫియాలు ఎక్కడికక్కడ రెచ్చిపోయి దాడు లకు దిగుతున్నాయి.

ప్రాణాలు తీస్తున్నాయి. దాడి జరిగిన వెంటనే ప్రభుత్వాలు వెనువెంటనే చర్యకు ఉపక్రమిస్తే, సత్వరం విచారణ జరిపి కారకులను శిక్షిస్తే ఇటువంటివి పునరావృత్తం కావు. కానీ పాలకులు కావాలనే నిర్లక్ష్యంగా వ్యవహ రిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో  పాత్రికేయులపై దాడి అంటే సారాంశంలో ప్రజాస్వా మ్యంపై దాడి అని గుర్తించి, ప్రజలే చైతన్యవంతులై ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకు రావాలి. పాలకులకు బుద్ధి చెప్పాలి.

Read latest Editorial News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top