విదేశీ ‘ముద్ర’!

Editorial Column On Foriegners In Assam - Sakshi

అస్సాం జనాభాలో ‘విదేశీయులను’ ఆరా తీసే ప్రక్రియ ఎన్ని వింత పోకడలు పోయిందో చెప్పడానికి సైన్యం నుంచి రిటైరై అస్సాం సరిహద్దు పోలీస్‌ విభాగంలో సబ్‌ ఇన్‌స్పెక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్న మహమ్మద్‌ సనావుల్లా పడుతున్న కష్టాలే ఉదాహరణ. ఆయన్ను గత నెల 24న విదేశీయుల నిర్ధారణ ట్రిబ్యునల్‌ బంగ్లాదేశ్‌ పౌరుడిగా ముద్రేసింది. ఈ దేశంలోకి అక్రమంగా ప్రవే శించాడని తేల్చింది. మరో నాలుగురోజులకు ఆయన్ను అరెస్టుచేసి నిర్బంధ శిబిరానికి తరలిం చారు. గువాహటి హైకోర్టు బెయిల్‌ మంజూరు చేయడంతో ఆయన 10 రోజుల తర్వాత శుక్రవారం విడుదలయ్యారు. గత ఆగస్టులో జాతీయ పౌర గుర్తింపు(ఎన్‌ఆర్‌సీ) తుది ముసాయిదా విడుదలైన ప్పుడు అస్సాం జనాభాలో 40.07 లక్షలమంది విదేశీయులని నిర్ధారించారు.

ఇలాంటివారందరినీ అరెస్టు చేసి రాష్ట్రంలో వేర్వేరుచోట్ల ఏర్పాటు చేసిన నిర్బంధ శిబిరాలకు తరలించారు. అక్కడ కనీస సదుపాయాలు కూడా లేవని, అందులో ఉన్నవారు దుర్భరమైన పరిస్థితుల్లో రోజులు వెళ్లదీస్తున్నా రని కథనాలు వెలువడుతున్నాయి. వాస్తవానికి అస్సాంలో ‘విదేశీయుల’ ఏరివేత చర్యలు, నిర్బంధ శిబిరాలు చాన్నాళ్లుగా ఉన్నాయి. ఎవరైనా స్థానికులు కారన్న ఫిర్యాదు అందితే  వారివద్ద ఉన్న ఆధా రాలు తనిఖీ చేయడం, అవి చూపలేనివారిని అరెస్టు చేయడం అక్కడ రివాజు. ఆ శిబిరాల్లో అమాన వీయమైన పరిస్థితులున్నాయని దాఖలైన పిటిషన్‌పై విచారణ సందర్భంగా మొన్న ఏప్రిల్‌లో సుప్రీంకోర్టు ఒక వెసులుబాటు కల్పించింది. రూ. లక్ష చొప్పున ఇద్దరు పౌరులు పూచీకత్తులిస్తే నిర్బంధితులను విడుదల చేయొచ్చునని చెప్పింది. కానీ ఎంతమందికి ఈ స్తోమత ఉంటుంది?

అస్సాం జాతుల సమస్య అత్యంత సంక్లిష్టమైనది. అక్కడ పదుల సంఖ్యలో తెగలున్నాయి. అనేకానేక భాషలు మాట్లాడేవారున్నారు. భిన్న ఆచారసంప్రదాయాలు పాటించేవారున్నారు. తరచుగా తోవమార్చుకునే బ్రహ్మపుత్ర నదివల్ల దానికి ఉత్తర తీరంలోని కోక్రాఝర్, చిరాంగ్, సోని త్‌పూర్, బక్సా, ఉదల్‌గురివంటి పలు జిల్లాల్లో వివిధ తెగలవారు కొత్త ప్రాంతాలను వెదుక్కుని స్థిర నివాసం ఏర్పర్చుకోక తప్పని స్థితిగతులున్నాయి. వీరుగాక బంగ్లాదేశ్‌ నుంచి పనుల కోసం వలస వచ్చేవారుంటారు. ఇలా స్థానిక తెగలకూ, కొత్తగా వచ్చి స్థిరపడాలనుకుంటున్నవారికి, బంగ్లా నుంచి వలసవచ్చినవారికి మధ్య నిరంతరం ఘర్షణలు తప్పడం లేదు. ఈ నేపథ్యంలో కొన్ని లక్షల మందిని ‘రాజ్యరహిత పౌరులు’గా నిర్ధారించి గెంటేయడం అంత సులభమేమీ కాదు.

ఈ దేశ పౌరులు కారని నిర్ధారించినవారంతా బంగ్లాదేశీయులేనని మన ప్రభుత్వం మున్ముందు ప్రకటిం చినా ఆ దేశం వారినందరినీ స్వీకరిస్తుందన్న నమ్మకం లేదు. తమ పౌరులెవరూ భారత్‌లో లేరని ఇప్పటికే బంగ్లాదేశ్‌ ప్రకటించింది. ఆ దేశంతో స్నేహపూర్వక సంబంధాలున్న ప్రస్తుత తరుణంలో దీన్ని పరిష్కరించడం అంత సులభం కాదు. సనావుల్లా మూడు దశాబ్దాలు సైన్యంలో సేవలందిం చారు. కార్గిల్‌ యుద్ధంలో పాల్గొన్నారు. రాష్ట్రపతి ప్రశంస పొందారు. కమిషన్డ్‌ ఆఫీసరుగా పని చేశారు. సైన్యంలో చేరినప్పుడూ, ఆ తర్వాత భిన్న సందర్భాల్లో ఆయన పుట్టుపూర్వోత్తరాల గురించి నిఘా సంస్థలు ఆరా తీసే ఉంటాయి. అందుకు సంబంధించిన రికార్డులు కూడా భద్రంగా ఉంటాయి.

కానీ ఆయన స్వస్థలమైన కాలాహిషా గ్రామస్తులు ఇచ్చిన సాక్ష్యంతో సనావుల్లాను ట్రిబ్యునల్‌ విదేశీయుడిగా పరిగణించింది.  ఆ ఇద్దరిలో అమ్జాద్‌ అలీ అనే పేరుగల వ్యక్తి ఎవరూ తమ గ్రామంలో లేరని అక్కడివారు చెబుతున్నారు. ట్రిబ్యునల్‌ దగ్గర కూడా అతని చిరునామా వగైరాలు లేవు. మరో వ్యక్తి అయితే తాను ఎలాంటి సాక్ష్యమూ చెప్పలేదంటున్నాడు. ట్రిబ్యునల్‌ తన ముందున్న సాక్ష్యాధారాల విశ్వసనీయతను నిర్ధారించుకోలేకపోవడమే కాదు...సనావుల్లా సమ ర్పించిన ఆధారాలను బేఖాతరు చేసింది. అస్సాంలో ఎవరినైనా విదేశీయుడిగా ముద్రేసి కష్టాల పాలు చేయడం ఎంత సులభమో సనావుల్లా ఉదంతం చెబుతోంది. ఇప్పుడు విదేశీయులుగా ముద్రపడిన 40 లక్షలకుపైగా జనాభాలో సనావుల్లా వంటి మాజీ సైనికులు, ప్రస్తుతం సైన్యంలో పనిచేస్తున్నవారు 500మంది వరకూ ఉన్నారు. 

పరస్పర విరుద్ధ ప్రయోజనాలున్నప్పుడూ, వాటిమధ్య ఘర్షణ వాతావరణం ఉన్నప్పుడూ విదేశీయుల నిర్ధారణ వంటి అంశాలు ఎన్ని సమస్యలను తెచ్చిపెడతాయో, ఏ స్థాయిలో విద్వేషాలు రగులుస్తాయో వర్తమాన అస్సాం చూపుతోంది. అక్రమ వలసలను నివారించవలసిందే. స్థానికుల ప్రయోజనాలకు చేటు కలిగేలా భారీయెత్తున వేరే దేశ పౌరులు చొరబడటం కూడా ఆందోళన కరమైనదే. కానీ వీటిని పరిష్కరించడానికి అనుసరించే విధానాల్లో లోపాలు, లొసుగులు ఉంటే స్వప్రయోజనపరులకు అవి అవకాశంగా మారతాయి. పొంచి ఉన్న ఇలాంటి ప్రమాదాల గురించి 48మంది రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారుల బృందం నాలుగు నెలలక్రితం ఆందోళన వ్యక్తం చేసింది. జాతీయ పౌర గుర్తింపు ముసాయిదాలో చోటు దొరకనివారికి ఏదోరకమైన చట్టప్రతిపత్తి కల్పించి, తగిన వ్యవధినిచ్చి, వారు అభ్యంతరాలు తెలియజేయడానికి, తమ దగ్గరున్న ఆధారాలు అందజేసేందుకు వీలు కల్పించాలని... సుప్రీంకోర్టు పర్యవేక్షణలో వాటిని పరిశీలించి పరిష్క రించాలని సూచించింది.

నిర్బంధ శిబిరాల్లో మెరుగైన సదుపాయాలు కల్పించాలని కోరింది. సనావుల్లా దగ్గర తన పౌరసత్వం నిరూపించుకోవడానికి అవసరమైన పత్రాలున్నాయి. సైన్యంలో పనిచేశాడు గనుక తగిన రికార్డులున్నాయి. ఆయనకు సైన్యంలో పనిచేస్తున్నవారు అండగా నిలి చారు. కనుక సనావుల్లా పది రోజుల తర్వాతైనా బెయిల్‌పై విడుదల కాగలిగాడు. కానీ ఎవరి ఆసరా లేని నిరుపేదల పరిస్థితేమిటి? విదేశీయులుగా ముద్రపడినవారిలో అలాంటివారి సంఖ్యే అధికం. సుప్రీంకోర్టు విధించిన గడువు జూలై 31 సమీపిస్తున్న తరుణంలో ఈ ప్రక్రియలోని లోటుపాట్లను సరిదిద్ది, అసహాయులు, అమాయకులు బలికాకుండా చూడాల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభు త్వాలపై ఉంది.

Read latest Editorial News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top