మళ్లీ ‘ఢిల్లీ యుద్ధం’ | Arvind Kejriwal vs Lt Governor: again the 'delhi war' starts | Sakshi
Sakshi News home page

మళ్లీ ‘ఢిల్లీ యుద్ధం’

Nov 4 2017 1:27 AM | Updated on Nov 4 2017 1:27 AM

Arvind Kejriwal vs Lt Governor: again the 'delhi war' starts - Sakshi

ఢిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌గా నజీబ్‌ జంగ్‌ స్థానంలో అనిల్‌ బైజాల్‌ వచ్చి దాదాపు ఏడాది కావస్తోంది. జంగ్‌ ఉన్నన్నాళ్లూ ఆయనకూ, ఆమ్‌ ఆద్మీ పార్టీ(ఆప్‌) ప్రభుత్వానికీ మధ్య నిరంతర ఘర్షణ సాగేది. అనిల్‌ వచ్చాక ఆ పరిస్థితి మారిందనుకుని అందరూ సంబరపడేలోగానే గత నాలుగైదు నెలలుగా విభేదాలు ముదురుతున్నాయి. అయితే ఈసారి అవి మీడియాలో హోరెత్తకపోవడానికి కారణం ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ వైఖరిలో వచ్చిన మార్పే. ఆయన మునుపటి మాదిరి రోడ్డెక్కి గొడవ చేయడం లేదు.

కేంద్రాన్నీ, లెఫ్టినెంట్‌ గవర్నర్‌నూ దుమ్మెత్తిపోయడం లేదు. ఫిబ్రవరిలో జరిగిన పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికల్లోనూ, ఏప్రిల్‌లో జరిగిన ఢిల్లీ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లోనూ ఆప్‌ పరాజయం పాలయ్యాక ఆయన వ్యవహార శైలి మారింది. అయితే సమస్యలు ఎప్పటిలానే ఉన్నాయి. కీలక ఫైళ్లపై సంతకాలు పెట్టకుండా అనిల్‌ చాన్నాళ్లనుంచి దగ్గరే ఉంచుకున్నారని, ఇందువల్ల ప్రజా సంక్షేమ కార్యక్రమాలు నిలిచిపోయాయని ఆప్‌ మంత్రులు, ఎమ్మెల్యేలు ఆరోపిస్తున్నారు. ఒక దశలో ఆ పార్టీ ఎమ్మెల్యేలంతా రాజ్‌భవన్‌లో నాలుగు గంటలపాటు బైఠాయించారు కూడా. 

మన గవర్నర్ల వ్యవస్థ విచిత్రమైనది. కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ ఒకే పార్టీ అధికారంలో ఉన్న సందర్భంలో గవర్నర్‌కూ, ముఖ్యమంత్రికీ మధ్య ఎలాంటి వివాదాలూ ఉండవు. ఉన్నా అవి నాలుగు గోడల మధ్యే సమసిపోతాయి. సమ స్యంతా రెండుచోట్లా వేర్వేరు పార్టీలు అధికారంలో ఉన్నప్పుడే వస్తుంది. అలాంటి చోట సైతం గవర్నర్‌లు సామరస్యపూర్వకంగా మెలిగేవారైతే సమస్యలుండటం లేదు. అరుణాచల్‌ప్రదేశ్‌లో ఎన్‌డీఏ సర్కారు నియమించిన గవర్నర్‌ జ్యోతిరాజ్‌ ఖోవా ఇష్టానుసారం ప్రవర్తించి అక్కడి ముఖ్యమంత్రిని తొలగించారు.

స్పీకర్‌ను కూడా పదవి నుంచి తప్పించి తీరాలని ప్రయత్నించారు. రద్దయిన ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు పునరుద్ధరించాక కేంద్రంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం ఆయనపై ఆగ్ర హోదగ్రమైంది. చివరకు తొలగిస్తే తప్ప ఆయన పదవి వదల్లేదు. ఢిల్లీతో పాటు పుదుచ్చేరి లెఫ్టినెంట్‌ గవర్నర్‌ కిరణ్‌బేడీకి, పశ్చిమబెంగాల్‌ గవర్నర్‌ కేసరినాథ్‌ త్రిపాఠీకి అక్కడి ముఖ్యమంత్రులతో పెద్దగా సఖ్యత లేదు. అడపాదడపా ఆ రెండు చోట్లా వివాదాలు రగులుతూనే ఉంటాయి. 

ఇప్పుడు ఢిల్లీ సర్కారుకూ, అక్కడి లెఫ్టినెంట్‌ గవర్నర్‌కూ మధ్య తలెత్తిన విభేదాలపై సుప్రీంకోర్టు ముందున్న కేసు కీలకమైనది. ఢిల్లీలో ఎన్నికైన ప్రభుత్వం ఇచ్చే సలహామేరకు కాకుండా లెఫ్టినెంట్‌ గవర్నర్‌ ఏకపక్షంగా పాలించవచ్చునో, లేదో తేల్చాలని ఆప్‌ ప్రభుత్వం కోరింది. దీన్ని అయిదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం విచారిస్తోంది. నిరుడు ఆగస్టులో ఢిల్లీ హైకోర్టు ఇదే విషయంలో ఆప్‌ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్లపై తీర్పునిస్తూ లెఫ్టినెంట్‌ గవర్నరే సర్వంసహాధికారి అని తేల్చింది. ఆయనకు విస్తృతమైన అధికారా లున్నాయని స్పష్టం చేసింది. ఆప్‌ ప్రభుత్వం ఈ తీర్పునే సవాల్‌ చేసింది. ఈ కేసు విలక్షణమైనది. ఢిల్లీలో ఎన్నికైన అసెంబ్లీ, దానిద్వారా ఏర్పడిన ప్రభుత్వమూ ఉన్నాయి.

జాతీయ రాజధాని కావడం వల్ల 1992లో ఢిల్లీకి ప్రత్యేక ప్రతిపత్తిని ఇస్తూ అక్కడ ప్రజా ప్రభుత్వమూ, అసెంబ్లీ ఏర్పడేవిధంగా 69వ రాజ్యాంగ సవరణ తీసుకొచ్చారు. దీని ద్వారా 239–ఏఏ అధికరణం రాజ్యాంగంలో చేరింది. అందులోని సబ్‌ సెక్షన్‌ 4 లెఫ్టినెంట్‌ గవర్నర్‌ కార్యకలాపాలకు మంత్రిమండలి తోడ్పాటు, సలహాలు ఇవ్వాలని సూచిస్తోంది. ఇరువురిమధ్యా ఏ సమస్యపైన అయినా భిన్నాభిప్రాయాలుంటే లెఫ్టినెంట్‌ గవర్నర్‌ ఆ సమస్యను రాష్ట్రపతికి నివేదించాలని నిర్దేశిస్తోంది. ఆ సమస్య రాష్ట్రపతి ముందు పెండింగ్‌లో ఉంటే, అది అత్యవసరమైనదని లెఫ్టినెంట్‌ గవర్నర్‌ భావిస్తే ఆయన విచక్షణాయుతంగా వ్యవహరించి నిర్ణయం తీసుకోవచ్చునని అంటున్నది. ఇప్పుడు ఈ అధికరణే సమస్యగా మారింది. లెఫ్టినెంట్‌ గవర్నర్‌దే పాలనలో పైచేయి అని దీన్ని గమనిస్తే అర్ధమవుతుంది.

అయితే ఈ అధికరణ రాష్ట్రపతికి, ఇతర రాష్ట్రాల గవర్నర్లకు మించిన అధికారాలను లెఫ్టినెంట్‌ గవర్నర్‌కు కట్టబెడుతున్నదా అనే అనుమానం ఎవరికైనా వస్తుంది. దానికితోడు అనిల్‌ బైజాల్‌ ప్రవర్తన కూడా ఆ మాదిరే ఉంటున్నది. మున్సిపల్‌ పాఠశాలల్లో టీచర్ల నియామకాలు మొదలుకొని మొహల్లా (కాలనీ) ఆస్పత్రుల ఏర్పాటు వరకూ అన్నిటినీ ఆయన తొక్కిపెడుతున్నారు. ఇదంతా సబబేననుకుంటే అసలు ఢిల్లీకి ప్రభుత్వాన్నీ, అసెంబ్లీని ఎందుకు ఏర్పాటు చేసినట్టు? క్రమం తప్పకుండా అసెంబ్లీకి ఎన్నికలు ఎందుకు జరుపుతున్నట్టు? ప్రజాభిప్రాయాన్ని ఎందుకు తెలుసుకోవాలనుకుంటున్నట్టు? అవి ఉనికిలోకి రాక ముందు ఢిల్లీలో పెత్తనానికేమీ కొదువలేదు. అక్కడి 11 జిల్లాల్లో ఎనిమిది ఢిల్లీ మున్సిపల్‌ కార్పొరేషన్‌(ఎంసీడీ) పరిధిలో ఉన్నాయి. దీనికితోడు న్యూఢిల్లీ మున్సిపల్‌ కౌన్సిల్,(ఎన్‌డీఎంసీ), ఢిల్లీ కంటోన్మెంట్‌ బోర్డు ఉన్నాయి. ఇన్ని ఉన్నా మళ్లీ ప్రజా ప్రభుత్వం ఏర్పాటుకు అవకాశమిచ్చినప్పుడు దాన్ని చేతగాని స్థితికి నెట్టడం ఎంతవరకూ సబబు? 

ఎన్నికైన అసెంబ్లీకీ, దానిద్వారా ఏర్పడే ప్రభుత్వానికీ పాలనలో ప్రమేయం లేనప్పుడు, దాని అభిప్రాయానికి విలువ ఇవ్వనప్పుడూ వాటి ఉనికికే అర్ధం ఉండదు. లెఫ్టినెంట్‌ గవర్నర్‌ తీరు అధికారుల్లో, మంత్రుల్లో, ఎమ్మెల్యేల్లో అయో మయాన్ని సృష్టిస్తోంది. ఫైళ్లన్నీ నెలల తరబడి పెండింగ్‌ పడుతున్నాయి. అధికార పక్షానికి ఇది ఇబ్బందికర పరిస్థితి. పదవుల్లో ఉన్నవారు చిత్తశుద్ధితో ప్రవర్తించి, ఎప్పటికప్పుడు చర్చించుకుని అవగాహనకు రావాలని జనం ఆశిస్తారు. విభేది స్తున్నదెక్కడో వెల్లడిస్తే కనీసం లోపం ఎవరిదో జనం నిర్ణయించుకుంటారు. కానీ జన సంక్షేమంతో ముడిపడి ఉండే అంశాలను నెలల తరబడి అనిశ్చితిలో ఉంచితే అంతిమంగా ప్రజలే నష్టపోతారు. ఈ కేసులో సుప్రీంకోర్టు ఇవ్వబోయే తీర్పు ఢిల్లీలో ఎవరి పరిధులేమిటో పరిమితులేమిటో తేల్చి, స్పష్టమైన విభజనరేఖను ఏర్పరుస్తుందని ఆశించాలి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement