గిరి దాటని బతుకులు
ఆదివాసీలు ఇంకా అడవుల్లోనే మగ్గుతున్నారు. దశాబ్దాలు గడుస్తున్నా ఆహారసేకరణ దశను దాటలేకపోతున్నారు.
– దరి చేరని ప్రభుత్వ పథకాలు
– విద్య, వైద్యం అందని పండే
– దక్కిన పొలాల్లోనూ ఆదివాసేతరులదే పెత్తనం
– నేడు ప్రపంచ ఆదివాసీల దినోత్సవం
ఆదివాసీలు ఇంకా అడవుల్లోనే మగ్గుతున్నారు. దశాబ్దాలు గడుస్తున్నా ఆహారసేకరణ దశను దాటలేకపోతున్నారు. ప్రభుత్వాలు కోట్లాది రూపాయలు వెచ్చిస్తున్నా గిరిజనుల్లో అభివృద్ధి జాడ వెతికినా కనిపించదు. ఓ వైపు అవినీతి.. మరో వైపు అవగాహన కరువై సంక్షేమ పథకాలు వారి దరి చేరడం లేదు. కనీసం వైద్యం, విద్య కూడా అందడం లేదు. అధికారుల నిర్లక్ష్య ఫలితంగా గిరిజనులు ఇంకా సమాజపు అట్టడుగు వర్గంగానే మిగిలిపోతున్నారు. మంగళవారం ప్రపంచ ఆదివాసీల దినోత్సవం సందర్భంగా జిల్లాలో గిరిజనులు ఎదుర్కొంటున్న దీనస్థితిపై కథనం..
– ఆత్మకూరు రూరల్
జిల్లాలోని 43 చెంచు గూడేల్లో ఆదివాసీలు నివసిస్తున్నారు. వీటిలో పది గూడేలు మినహా మిగతా గూడేలన్ని ఇంచుమించు అడవులు, అటవీ అంచు మైదాన ప్రాంతాల్లోనో ఉన్నాయి. ఈ గూడేలన్నింటిని సమీకతంగా అభివృద్ధి చేసే లక్ష్యంతో ప్రభుత్వం ఏర్పాటుచేసిన ఐటీడీఏ మెరుగైన ఫలితాలు సాధించడంలో విఫలమవుతోంది. గిరిజనులకు సొంతిల్లు, రహదారి, విద్య, వైద్యం వంటి కనీస సౌకర్యాలకు నోచుకోలేకపోతున్నారు. పెచ్చెర్వు లాంటి కీలక మైన చెంచు గూడెం వాసులు సొంతింటి కలను సాకారం చేసుకోలేక పోతున్నారు. అడవుల్లో ఉండే చెంచు గూడేలకు బయటి ప్రపంచంతో అనుసంధానం కావడానికి కనీసం రోడ్డు సౌకర్యం కల్పించలేకపోతున్నారు. చెంచు గూడేలకు అందుబాటులో వైద్య సేవలుండడం లేదు. అత్యవసర సమయాల్లో ఉపయోగపడాల్సిన అంబులెన్స్ సౌకర్యానికి వీరు ఆమడదూరంలోనే ఉన్నారు. కాన్పుల కోసం ఆత్మకూరు సీహెచ్‌సీ ఆసుపత్రికి వచ్చే చెంచు గర్భిణులు అధిక శాతం రక్తహీనత ఉండటంతో అక్కడ ప్రసవం చేయడానికి వైద్యులు సిద్ధపడటం లేదు. రిస్క్ అవుతుందన్న కారణాలను సాకుగా చూపుతూ కర్నూలుకు రెఫర్ చేస్తున్నారు. పౌష్టికాహార లోపం చెంచుల జీవన ప్రమాణాన్ని 40 ఏళ్లకు కుదించి వేస్తోంది. ఆత్మకూరు మండలంలో కేవలం చెంచులకు ఉద్దేశించి ఏర్పాటు చేసిన కొట్టాల చెర్వు, బైర్లూటి ప్రా«థమిక ఆరోగ్య కేంద్రాలు వైద్యుల కొరతతో మెరుగైన సేవలు అందడం లేదు. సాక్షాత్తు కర్నూలు జిల్లా కలెక్టర్ దత్తతలో ఉన్న బైర్లూటీ పీహెచ్‌సీకి వైద్యుడి పోస్టు ఇంతవరకు మంజూరు కాలేదు.
అమలు కానీ అటవీ హక్కుల చట్టం..
అటవీ హక్కుల చట్టం అమలులో నోడల్ ఏజెన్సీ, ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయ లోపంతో గిరిజనులు తీవ్రంగా నష్టపోతున్నారు. అడవుల్లో చెంచులు స్వేచ్ఛగా చిన్నతరహా అటవీ ఉత్పత్తులు సేకరించుకునే వీలు లేకుండా కొంత ప్రాంతానికే పరిమితం చేయడానికే అటవీ శాఖ ప్రయత్నిస్తుంటుంది. కొట్టాల చెర్వు లాంటి పునరావాస చెంచు గూడెంలో వారికి ప్రభుత్వం కేటాయించిన భూముల్లో గిరిజనేతరుల కబ్జా చేసి సాగు చేసుకుంటున్నారు. ఈ గూడెంలో దాదాపు 273 కుటుంబాలకు మూడు ఎకరాల చొప్పున కేటాయించారు. ప్రస్తుతం అధిక శాతం ఇతరులే సాగు చేసుకుంటున్నారు. బైర్లూటి, నాగలూటి, రుద్రకోడు లాంటి ప్రాంతాల్లో గిరిజనేతరులే చెంచుల భూముల్లో వ్యవసాయం చేస్తున్నారు. పెచ్చుర్వు గూడెంలో 470 ఎకరాలు గ్రామ కంఠంగా ఇవ్వాల్సి ఉండగా కేవలం 70 ఎకరాలు మాత్రమే కేటాయించారు.
జీవనసరళికి దూరంగా విద్య:
అత్యంత స్వేచ్ఛ ప్రియత్వం కలిగిన చెంచు చిన్నారులకు విద్య గరపడంలో వారి జీవనసరళిని ఏమాత్రం అధ్యయనం చేయని ప్రభుత్వం నాలుగు గోడల మధ్య నిర్భంధ విద్య అమలు చేస్తోంది. దీంతో చెంచు బాలబాలికలు పాఠశాలల వద్ద మధ్యాహ్న బోజన సమయంలో తప్ప మిగతా సమయంలో కనిపిండం లేదు. అడవుల్లో ప్రకతితో మమేకమవుతూ తిరుగాడే బాలురకు ప్రకృతి బడి తరహా విద్య అవసరమని సామాజిక శాస్త్రవేత్తలు చెబుతున్నారు.