మిస్టరీ వీడిన రజినీకుమార్‌ హత్య కేసు | rajnikumar murder case mystery revealed | Sakshi
Sakshi News home page

మిస్టరీ వీడిన రజినీకుమార్‌ హత్య కేసు

Apr 2 2017 9:57 PM | Updated on Sep 5 2017 7:46 AM

మిస్టరీ వీడిన రజినీకుమార్‌ హత్య కేసు

మిస్టరీ వీడిన రజినీకుమార్‌ హత్య కేసు

నగరానికి చెందిన గుడ్‌షప్పర్డ్‌ పాఠశాల మాజీ యజమాని మోడీ రజినీకుమార్‌ (48) హత్య కేసు మిస్టరీ ఎట్టకేలకు వీడింది.

– కుటుంబ కలహాలే కారణమని తేల్చిన పోలీసులు
– ఆరుగురు కిరాయి హంతకుల అరెస్టు
– పరారీలో సూత్రధారులు
కర్నూలు : నగరానికి చెందిన గుడ్‌షప్పర్డ్‌ పాఠశాల మాజీ యజమాని మోడీ రజినీకుమార్‌ (48) హత్య కేసు మిస్టరీ ఎట్టకేలకు వీడింది. కుటుంబ తగాదాలే హత్యకు దారి తీశాయని పోలీసులు విచారణలో తేల్చారు. గతనెల 17 సాయంత్రం పెద్దటేకూరు సమీపంలో రైల్వే ట్రాక్‌పై రజినీకుమార్‌ మృతదేహం బయటపడింది. ఈ అఘాయిత్యానికి పాల్పడిన నిందితులు బుధవారపేటకు చెందిన కొప్పుల శివప్రసాద్,  వీకర్‌ సెక‌్షన్‌ కాలనీకి చెందిన రాముడు, సాయికృష్ణ, ఖాదర్‌బాషా, మిన్నెల్ల హుసేన్, నితీష్‌ తదితరులను తాలుకా పోలీసులు అరెస్టు చేసి కర్నూలు డీఎస్పీ రమణమూర్తి ఎదుట హాజరు పరిచారు. ఆదివారం సాయంత్రం స్థానిక తాలుకా పోలీస్‌ స్టేషన్‌లో విలేకరులతో డీఎస్పీ వివరాలను వెల్లడించారు.
 
కర్నూలులోని ఆదర్శ విద్యాసంస్థల అధినేత తిమ్మయ్య కూతురును రజినీకుమార్‌ వివాహం చేసుకున్నాడు. కర్నూలులోనే ఉంటూ కొంతకాలం విద్యాసంస్థల నిర్వహణ చూసుకునే వారు. వారి మధ్య విభేదాలు తలెత్తి, భార్యను కూడా వదిలేసి కొంతకాలంగా ఒంటరిగా జీవిస్తున్నాడు. ఈ నేపథ్యంలో బుధవారపేటకు చెందిన మాజీ కార్పొరేటర్‌ శ్రీరాములు, ఎన్‌కౌంటర్‌ పత్రికా విలేకరి మద్దిలేటియాదవ్‌లు అదేకాలనీకి చెందిన వెంకట్రాముడుతో కలసి రజనీకుమార్‌ హత్య చేయించేందుకు కిరాయి హంతకులతో ఒప్పందం(రూ.3 లక్షలు) కుదుర్చుకున్నారు. 
 
హత్యజరిగిందిలా..
వెంకట్రాముడికి అల్లుడైన శివప్రసాద్, తన మిత్రులతో కలిసి గతనెల 17న రజినీకుమార్‌ను గోరంట్ల తిరునాళ్లకు వస్తే పార్టీ ఇస్తామని కోడుమూరు పిలిపించారు. రాత్రి 9 గంటల సమయంలో కోడుమూరు, కర్నూలు రహదారిలోని మోడల్‌ స్కూలుకు వెళ్లే దారిలోకి తీసుకెళ్లి వెంకట్రాముడు రజినీకుమార్‌ గొంతుపట్టుకొని బీరు బాటిల్‌తో పొడవగా, శివప్రసాద్, సాయికృష్ణలు పిడిబాకులతో పొడిచారు. ఖాదర్‌బాషా రాయితో, నితీష్‌ కట్టెతో తలపై కొట్టడంతో అతను అక్కడికక్కడే చనిపోయాడు. రజినీకుమార్‌ మృతదేహాన్ని ఆయన కారు (ఏపీ 21 ఏపీ 9779) వెనుకసీటులో వేసుకొని పెద్దటేకూరు సమీపంలోని రైలు పట్టాలపై పడవేశారు. మృతుడి మెడలో ఉన్న బంగారు చైన్, సెల్‌ఫోను దొంగలించి, కారులో కర్నూలు చేరుకొని సస్య హోటల్‌ దగ్గర వదిలేసి పరారయ్యారు.
 
మొదట రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ నిమిత్తం ఉళిందకొండ పోలీస్‌స్టేషన్‌కు బదిలీ చేశారు. సీఐ నాగరాజు యాదవ్, ఎస్‌ఐ వెంకటేశ్వరరావు విచారణ ముమ్మరం చేయగా, ముద్దాయిలు కోడుమూరు వీఆర్‌ఓ వెంకట్రాముడు వద్ద లొంగిపోయి హత్య వెనుక ఉన్న వాస్తవాలను వెల్లడించారు. వారిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించి చైన్, సెల్‌ఫోన్‌తో పాటు, కారును స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సూత్రధారి అయిన శ్రీరాములు, ఎన్‌కౌంటర్‌ విలేకరి మద్దిలేటి యాదవ్‌లు పరారీలో ఉన్నారని, వారి కోసం పోలీసు బృందాలు గాలిస్తున్నట్లు డీఎస్పీ వెల్లడించారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement