ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడిపై ఏపీసీసీ చీఫ్ ఎన్.రఘువీరారెడ్డి మండిపడ్డారు.
అనంతపురం: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడిపై ఏపీసీసీ చీఫ్ ఎన్.రఘువీరారెడ్డి మండిపడ్డారు. గురువారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ.. నీళ్లు లేకుండా పట్టిసీమ ప్రాజెక్టును జాతికి అంకితం చేయడం చంద్రబాబుకే చెల్లిందని విమర్శించారు. ఏపీకి ప్రత్యేక హోదాతో పాటు రాయలసీమ, ఉత్తరాంధ్రలకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారు. ఓటుకు కోట్లు, ట్యాపింగ్ పై ఇద్దరు సీఎంలు సీబీఐ విచారణకు సిద్ధపడాలని సూచించారు. అదే విధంగా ఆర్టికల్ 371డి పై చంద్రబాబు సర్కార్ అనవసర గంరగోళం సృష్టిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
చంద్రబాబునాయుడు ప్రత్యేక హోదా సాధనపై ఎందుకు శ్రద్ధ చూపటం లేదో బహిరంగ పర్చాలని కోరారు. రాజధాని కోసం ల్యాండ్ పూలింగ్ అంటూ ఇప్పటికే 35 వేల ఎకరాలు సేకరించిన ప్రభుత్వం.. ఇంకా ఎన్ని వేల ఎకరాలు కావాలో తెలపాలన్నారు. మూడు పంటలు పండే భూములను ఒక్క అంగుళం సేకరించినా ఊరుకోబోమని ఈ సందర్భంగా హెచ్చరించారు. భూ సేకరణతో ఈస్టిండియా కంపెనీ మాదిరిగా వ్యవహరిస్తూ విదేశీ కంపెనీలకు రాష్ట్రాన్ని ధారాదత్తం చేసేందుకు చంద్రబాబు యత్నిస్తున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు కరువయ్యాయని.. బీజేపీ, టీడీపీలు కుమ్మక్కై రాష్ట్రంలో అశాంతి రేపుతున్నాయని ఆరోపించారు.