రైతు ఇంట రాజసం | Sakshi
Sakshi News home page

రైతు ఇంట రాజసం

Published Fri, Mar 18 2016 4:32 AM

రైతు ఇంట రాజసం - Sakshi

అంతరిస్తున్న ఆ జాతి పశువులను ప్రత్యేకంగా పెంచుతున్న ఓ రైతు
వాటి కోసం షెడ్డు ఏర్పాటు నిత్య పర్యవేక్షణలో పోషణ

 బలంగా, దృఢంగా .. కండపట్టి ఉండే శరీర సౌష్టవం. పొట్టిగా.. గట్టిగా ఉండే కొమ్ములు. ఎత్తై మూపురం.. వేలాడే గంగడోలు.. ఎంతో అందంగా, ఆకర్షణీయంగా కనిపించే ‘ఒంగోలు గిత్త’ రైతు ఇంటి ముందుంటే అదో రాజసం. ఎంతటి బరుైవైనా అవలీలగా లాగే తత్వం. లోతుగా దుక్కి చేసేందుకు కిలోల కొద్దీ బరువు పెట్టినా ఇట్టే దున్న గల శక్తి. బండి కడితే గంటకు కనీసం 30 మైళ్ల వేగంతో పరుగు తీయ గల సామర్థ్యం. కయ్యానికి కాలు దువ్వితే వెనుకడుగేయని నైజం. ఇవి ఒంగోలు గిత్తలకుండే గొప్ప లక్షణాలు. ఒకప్పుడు ఊళ్లలో ప్రతి రైతు ఇంటా కనిపించే గొప్ప పశుజాతిలో భాగమైన ఒంగోలు జాతి ఇప్పుడు అదృశ్యమవుతోంది. ఊరుకు పది, పదిహేను కనిపిస్తే మహా ఎక్కువ అనే పరిస్థితి మారింది. ఈ అరుదైన పశుజాతే తన అదృష్టంగా భావించి.. వేలకు వేలు వాటి పోషణ కోసం ఖర్చు పెట్టి ఒంగోలు జాతి పశువులను కాపాడుతున్న ఓ సామాన్య రైతు కథే.. ఈ ప్రత్యేక కథనం...

కడప అగ్రికల్చర్: ఆధునిక యంత్రాలు వ చ్చి... పశువులతో వ్యవసాయం చేసే పద్ధతులను మొరటుగా మార్చాయి. ఒకప్పుడు దుక్కి దున్నాలంటే ఎద్దులకు కాడి కట్టాల్సిందే. ఇప్పుడీ పశువుల స్థానాన్ని ట్రాక్టర్లు ఆక్రమించాయి. సులభంగా, వేగంగా పనయ్యే పద్ధతులు అందుబాటులోకి వచ్చాయి. పంటలను సాగు చేయడానికి ఒకటి, రెండు ఎద్దుల జతలు ఉంటే చాలనుకునే పరిస్థితి కొంత కాలం కిందట ఉండేది. ఇప్పుడు దాన్ని కూడా అధిగమించి అన్నింటికీ యంత్రాలు అందుబాటులోకి వచ్చాయి. కరువు కాలం, పశుగ్రాసం కొరత వల్ల సేద్య పశువులను గ్రామ పొలిమేరలు దాటించారు. ఇప్పుడు ఏ కొద్ది మంది రైతులో ఎద్దును నమ్ముకుని వ్యవసాయం చేస్తున్నారు. అందునా ఒంగోలు గిత్తలతో సాగు చేసే రైతులు జిల్లాలో వేళ్ల మీద లెక్కించవచ్చు. కానీ ఒంగోలు పశు సంపదే తన అదృష్టమని భావించి వ్యవసాయం చేస్తున్న అతి కొద్ది మంది రైతుల్లో ఒకరు మైదుకూరు మండలం నెల్లూరు కొట్టాల గ్రామానికి చెందిన కిరణ్‌కుమార్‌రెడ్డి (ఫోన్: 9985365336).

తెంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో కూడా అరుదైన పశుజాతిగా మారిన ఒంగోలు పశువులకు చిరునామాగా మారారు కిరణ్‌కుమార్‌రెడ్డి. ప్రస్తుతం మూడు జతల గిత్తలు, 6 ఆవులు, 3 జతల ఎద్దులను పోషిస్తున్నారు. వీటికి సొంత పొలంలో పండించిన ఒడ్లను ఆడించగా వచ్చే తవుడు, సజ్జలు, జొన్నలు, ఉలవలు, పచ్చిమేతను అందిస్తున్నారు. ఒంగోలు జాతి పశవులను పెంచితే దేవతామూర్తులు ఇంట్లో నడిచినట్లు ఉంటుందని సిరిసంపదలతో రైతు తులతూగుతాడనే నమ్మకమని యువరైతు కిరణ్‌కుమార్‌రెడ్డి విశ్వసిస్తారు. ఈ ఒంగోలు గిత్త రూ. 3 నుంచి 4 లక్షల రూపాయలు పలుకుతున్నాయంటే అతిశయోక్తికాదు. ఈ గిత్తలను చూసేందుకు ఇక్కడికి హైదరాబాద్, రంగారెడ్డి, ఖమ్మం, నల్గొండ, గుంటూరు, కృష్ణ, నెల్లూరు, ప్రకాశం, కర్నూలు జిల్లాల నుంచి అభ్యదయ రైతులు, వివిధ పార్టీల రాజకీయ నాయకులుగా ఉండే రైతులు వస్తుంటే.. ఈ పశువులను పోషిస్తున్న మాకు మనసు పులకించిపోతోందని కిరణ్‌కుమార్‌రెడ్డి కుంటుంబం పేర్కొంటోంది.

పూర్వవైభవం సంతరించుకోవాలన్నదే... నా తపన
ఒంగోలు గిత్త... ఇది అరుదైన పశుజాతి. ఒకప్పుడు ప్రతి ఇంటా ఈ సంతతి ఉండేది. గ్రామాల్లో మందలు మందలు ఉండేవి. ఎప్పుడైతే వ్యవసాయంలోకి యాంత్రీకరణ ప్రవేశించిందో అప్పుడు పశువు సంపదకు దుర్దినాలు ప్రారంభమయ్యాయి. ఇప్పుడు గ్రామాల్లో ఎక్కడ కూడా ఒంగోలు పశువులు కనిపించని పరిస్థితి. కేవలం బండలాగుడు పోటీలకు ఉపయోగించే ఎద్దులు మాత్రమే ఈ సంతతికి చెందినవి కనిపిస్తాయి. ఈ గిత్తలు మా అదృష్ట దేవతలు. రోజుకు 3 జతల ఎద్దులు, 3 జతల దూడలు, 6 ఆవులకు కలిపి 1300 రూపాయలు ఖర్చు అవుతోంది. ప్రత్యేకంగా పశువులకు షెడ్డును ఏర్పాటు చేశాం. నాకున్న పొలంలో రోజూ సేద్యానికి ఉపయోగిస్తాను. సేద్యంలో ట్రాక్టరు కంటే ఎందునా తీసిపోవు. అందుకే ఖర్చులో వెనకడుగు వేయకుండా ఆ పశువులను పోషిస్తున్నాను. రాష్ట్రమంతా ఈ సంతతిని పెంపొందించేలా చేయడమే నా ధ్యేయం. పార్లమెంటులో ఒంగోలు ఎంపీ వైవి సుబ్బారెడ్డి ఈ పశువుల రక్షణకు చట్టం చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి రాధామోహన్‌సింగ్‌ను, కేంద్ర ప్రభుత్వాన్ని అభ్యర్థించడం అభినందనీయం. కనుమరుగవుతున్న ఒంగోలు జాతిని ఏపీలో నిలిపితే రైతులకు ఎంతో మేలు చేసిన వారవుతారని కోరుతున్నాను. - కిరణ్‌కుమార్‌రెడ్డి, యువరైతు, నెల్లూరు కొట్టాల. 

Advertisement
Advertisement