
13 ముక్కలాటలో జోక్యం చేసుకోవద్దు
పందెం ఎంతైనప్పటికీ ఎవరైనా రమ్మీ ఆట (13 ముక్కలాట) ఆడుతుంటే, అందులో ఏవిధంగానూ జోక్యం చేసుకోరాదని తెలంగాణ రాష్ట్ర పోలీసులను హైకోర్టు ఆదేశించింది.
♦ తెలంగాణ పోలీసులకు హైకోర్టు ఆదేశం
♦ క్లబ్బుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని నిర్దేశం
సాక్షి, హైదరాబాద్: పందెం ఎంతైనప్పటికీ ఎవరైనా రమ్మీ ఆట (13 ముక్కలాట) ఆడుతుంటే, అందులో ఏవిధంగానూ జోక్యం చేసుకోరాదని తెలంగాణ రాష్ట్ర పోలీసులను హైకోర్టు ఆదేశించింది. అలాగే సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి అక్కడ జరిగే వినోద కార్యక్రమాలను రికార్డ్ చేయాలని పలు క్లబ్బులను ఆదేశించింది. పోలీసులు తనిఖీ చేసేందుకు వీలుగా ఆ రికార్డ్‌లను కనీసం 15 రోజుల పాటైనా భద్రపరచాలని స్పష్టం చేసింది. అంతేకాక ఆ సీసీ కెమెరాలన్నింటినీ తమ తమ పరిధిలోని పోలీస్‌స్టేషన్లకు అనుసంధానం చేయాలన్న హైకోర్టు, ఈ క్లబ్బుల్లో ఎటువంటి జూద కార్యకలాపాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ ఆకుల వెంకట శేషసాయి గురువారం తీర్పు వెలువరించారు.
కోర్టును ఆశ్రయించిన క్లబ్బులు..
తమ క్లబ్బుల్లో రమ్మీ ఆడుతుంటే పోలీసులు జోక్యం చేసుకుంటున్నారని, రమ్మీ ఆట నైపుణ్యానికి (స్కిల్) సంబంధించిందని, అందువల్ల ఇందులో జోక్యం చేసుకునే అధికారం పోలీసులకు లేదంటూ హైదరాబాద్, కరీంనగర్‌లకు చెందిన ఫ్రెండ్స్ కల్చరల్ క్లబ్, జగిత్యాల క్లబ్, మరో 10 క్లబ్బులు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశాయి. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది వేదుల వెంకటరమణ, ఎన్.హరినాథ్‌రెడ్డిలు వాదనలు వినిపించారు. రమ్మీ జూద క్రీడ పరిధిలోకి రాదనే విషయాన్ని సుప్రీంకోర్టు సైతం స్పష్టం చేసిందని వాదించారు. వాదనలను పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి ఈ నెల 29న తీర్పు వెలువరించారు.