లక్ష్యం సాధించిన హరితహారం

చల్మెడలో మొక్కలు నాటుతున్న ప్రజాప్రతినిధులు(ఫైల్‌)

  • వంద శాతం మొక్కలు నాటిన మూడు పంచాయతీలు

  • రామాయంపేట: మండలంలోని మూడు పంచాయతీలు వంద శాతం మొక్కలు నాటి జిల్లాలోనే గుర్తింపు పొందాయి. డిప్యూటీ స్పీకర్‌ పద్మాదేవేందర్‌రెడ్డి  చొరవతో మండలంలోని తొనిగండ్ల, చల్మెడ, రాయిలాపూర్‌ గ్రామ పంచాయతీలు లక్ష్యం సాధించాయి. ప్రతి గ్రామంలో 40 వేలకు తగ్గకుండా మొక్కలు నాటాలని సీఎం కేసీఆర్‌ మొదలుకొని నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు, డిప్యూటీ స్పీకర్‌ పద్మాదేవేందర్‌రెడ్డి పలుమార్లు  విజ్ఞప్తి చేయడంతో ఆయా పంచాయతీల్లో యుద్ధప్రతిపాదికన మొక్కలు నాటారు.


    ఈ మేరకు చల్మెడ తిరుమలనాధస్వామి ఆలయంవద్ద ఈనెల 16న ఒకే రోజు  40 వేలకుపైగా మొక్కలు నాటారు. కార్యక్రమంలో మంత్రి హరీశ్‌రావుతోపాటు డిప్యూటీ స్పీకర్‌ పద్మాదేవేందర్‌రెడ్డి, మెదక్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి తదితరులు పాల్గొని మొక్కలు నాటారు. ఈగ్రామంలో ఇప్పటికే  50 వేల మొక్కలు నాటారు. ఇంకా మొక్కలు నాటేందుకు నాటడానికి ఆసక్తితో ఉన్నామని గ్రామ సర్పంచ్‌ నాగరాజు తెలిపారు.


    తొనిగండ్లలో ఇప్పటికే 41వేలకు పైగా మొక్కలు నాటారు. మరో ఐదువేల మొక్కలు నాటుతామని  సర్పంచ్‌ పిట్ల శ్యామయ్య తెలిపారు. రాయిలాపూర్‌ గ్రామ పంచాయతీ పరిధిలో 40 వేలకు పైగా మొక్కలు నాటారు. ఇంకా నాలుగైదు వేల మొక్కలు నాటుతామని  సర్పంచ్‌ రామస్వామి పేర్కొన్నారు.



    ప్రతిష్టాత్మకరంగా తీసుకున్నాం

    హరితహారం కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకరంగా తీసుకుని గ్రామస్తుల సహకారంతో ఇప్పటికే సుమారుగా 50వేల మొక్కలు నాటాం. 16న వేలాదిమంది ఒకేరోజు 40వేల మొక్కలు నాటారు.  మరిన్ని మొక్కలు నాటడానికి ఆసక్తితో ఉన్నాం. –  నాగరాజు, చల్మెడ సర్పంచ్‌



    ఇతర గ్రామాలకు ఆదర్శం

    మొక్కలు నాటే విషయంలో తొనిగండ్ల, రాయిలాపూర్, చల్మెడ గ్రామాలు వంద శాతం ఫలితాలు సాధించడం గర్వకారణం. ఈ గ్రామాలను ఇతర గ్రామాలు ఆదర్శంగా తీసుకోవాలి. గ్రామస్తులు ఐక్యంగా కృషి చేయడంతోనే ఫలితాన్ని సాధించారు. నాటిన మొక్కలను సంరక్షిస్తేనే సార్ధకత లభిస్తుంది. – పుట్టి విజయలక్ష్మి, ఎంపీపీ, రామాయంపేట



    వందశాతం ఫలితాలు సాధిస్తాం

    మండలంలోని మూడు గ్రామాల్లో వందశాతం మొక్కలు నాటడం పూర్తయింది. మిగతా గ్రామాల్లో కూడా  వంద శాతం లక్ష్యం సాధించే దిశగా ముందుకెళుతున్నాం. ఈ విషయంలో డిప్యూటీ స్పీకర్‌ పద్మాదేవేందదర్‌రెడ్డి ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారు. – రాణి, ఎంపీడీవో, రామాయంపేట



    పద్మాదేవేందర్‌రెడ్డి సహకారం వల్లే

    హారితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మొదటినుంచి డిప్యూటీ స్పీకర్‌ పదే పదే చెప్పడంతో తాము గ్రామస్తులతో సమావేశమై నిర్ణయం తీసుకున్నాం. ఇప్పటికే గ్రామం పరిధిలో 41 వేలకుపైగా మొక్కలు నాటాం ఇంకా నాటేందుకు  గ్రామస్తులు ఆసక్తి కనబరుస్తున్నారు. –  పిట్ల శ్యామయ్య, తొనిగండ్ల సర్పంచ్‌

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top