ఖరీఫ్‌కు సిద్ధం.. | Farmers are plucking sacks and ready to harvest kharif. | Sakshi
Sakshi News home page

ఖరీఫ్‌కు సిద్ధం..

Jun 7 2017 4:15 AM | Updated on Jun 4 2019 5:04 PM

ఖరీఫ్‌కు సిద్ధం.. - Sakshi

ఖరీఫ్‌కు సిద్ధం..

‘తొలకరి పలకరించింది.. మరో రెండు, మూడు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది

అందుబాటులో విత్తనాలు, ఎరువులు
రైతులు ఎలాంటి ఆందోళన చెందొద్దు
వారంలో రుణ ప్రణాళిక ఖరారు
బ్యాంకులు రుణాలివ్వకుంటే మా దృష్టికి తీసుకురావాలి
సాగు సమస్యల పరిష్కారానికి ప్రత్యేక సెల్‌
72888 4486, 08682 244560 నంబర్లలో సంప్రదించాలి
జిల్లా వ్యవసాయాధికారి బి.నర్సింహారావు

నల్లగొండ అగ్రికల్చర్‌ : ‘తొలకరి పలకరించింది.. మరో రెండు, మూడు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. రైతులు ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో దుక్కులు దున్నుకుని ఖరీఫ్‌ సాగుకు సిద్ధంగా ఉన్నారు. ఈ మేరకు జిల్లా వ్యవసాయ శాఖ సర్వసన్నద్ధంగా ఉంది.’ అని అంటున్నారు జిల్లా వ్యవసాయాధికారి బి.నర్సింహారావు.

రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువులను సకాలంలో అందుబాటులో ఉంచడానికి పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతున్నామని స్పష్టం చేశారు. గత ఖరీఫ్‌లో ఎదురైన సవాళ్లను దృష్టిలో పెట్టుకుని రైతులకు ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నామని వివరించారు. జిల్లాలో రైతులు ఏరువాకకు సిద్ధమవుతున్న సందర్భంగా ఆయన మంగళవారం ‘సాక్షి’కి ప్రత్యేక ఇంటర్వూ్య ఇచ్చారు. నరసింహారావు ఏమంటున్నారో ఆయన మాటల్లోనే..

సాగు అంచనా..
జిల్లాలో ఖరీఫ్‌ సాధారణ సాగు విస్తీర్ణం 2,70,256 హెక్టార్లు కాగా.. ఈ ఖరీఫ్‌లో వర్షాలు సకాలంలో కురిస్తే జిల్లా వ్యాప్తంగా సుమారు 3,27,650 హెక్టార్లలో రైతులు వివిధ పంటలను సాగు చేసే అవకాశం ఉంది. ఇందులో ప్రధానంగా  పత్తి  2,35,000 హెక్టార్లు, వరి 70,000 హెక్టార్లు, కంది 14,000 హెక్టార్లు, పెసర 3,500 హెక్టార్లు, వేరుశనగ 1,500 హెక్టార్లు, ఆముదం 1,50,000 హెక్లార్లతోపాటు ఇతర పంటలు సాగు చేసే అవకాశం ఉంటుంది.   

వరి ఇతర విత్తనాలు..
జిల్లాలో రైతులకు 15,285 క్వింటాళ్ల విత్తనాలను సబ్సిడీపై అందించడానికి ఏర్పాట్లు చేశాం. వరి విత్తనాలు 10 వేల క్వింటాళ్లు, కంది 780 క్వింటాళ్లు, పెసర 400 క్వింటాళ్లు, వేరుశనగ 1,400 క్వింటాళ్లు, మొక్కజొన్న  80 క్వింటాళ్లు, జొన్న 50 క్వింటాళ్లు, సజ్జ 15 క్వింటాళ్లు, ఆముదం 55 క్వింటాళ్లు, జనుము 2,000 క్వింటాళ్లు, ఇతర విత్తనాలు 200 క్వింటాళ్లను సబ్సిడీపై పంపిణీ చేస్తాం. ఇప్పటికే 1,992 క్వింటాళ్ల వరి, 201 క్వింటాళ్ల కంది, 21 క్వింటాళ్ల వేరుశనగ, 614 క్వింటాళ్ల జనుము, 67 క్వింటాళ్ల పిల్లిపెసర.. మొత్తం 2,897 క్వింటాళ్ల విత్తనాలను వివిధ విక్రయ కేంద్రాల్లో అందుబాటులో ఉంచాం.

పత్తి విత్తనాలు..
ఖరీఫ్‌లో  3 లక్షల పత్తిగింజల  ప్యాకెట్లను జిల్లాకు తెప్పించేలా చర్యలు తీసుకున్నాం. ఇప్పటికే సగానికి పైగా  పత్తి విత్తనాలు మార్కెట్‌లోని డీలర్ల వద్ద అందుబాటులో ఉన్నాయి. రెండు, మూడు రోజుల్లో మొత్తం బీటీ పత్తి విత్తనాలు జిల్లాకు రానున్నాయి. పత్తి విత్తనాలకు ఎలాంటి కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్నాం.

ఎరువులు..
జిల్లావ్యాప్తంగా ఖరీఫ్‌లో లక్ష మెట్రిక్‌ టన్నుల వివిధ రకాల ఎరువులు అవసరమని గుర్తించాం. ఇందులో యూరియా 60 వేల మెట్రిక్‌ టన్నులు, డీఏపీ  20 వేల మెట్రిక్‌ టన్నులు, కాంప్లెక్స్‌ ఎరువులు 20 వేల మెట్రిక్‌ టన్నులు అవసరమవుతాని ప్రభుత్వానికి నివేదిక అందజేశాం. జిల్లాలో ఇప్పటికే యూరియా 30,449 మెట్రిక్‌ టన్నులు, డీఏపీ 3,171  మెట్రిక్‌ టన్నులు, ఎంఓపీ 1,683 మెట్రిక్‌ టన్నులు, ఎస్‌ఎస్‌పీ 743 మెట్రిక్‌ టన్నులు, కాంప్లెక్స్‌ 15,967 మెట్రిక్‌ టన్నులు.. మొత్తం 52,014 మెట్రిక్‌ టన్నుల ఎరువులు వివిధ కేంద్రాల్లో  అందుబాటులో ఉన్నాయి. సీజన్‌ ప్రారంభం కాగానే నెలనెల వారీగా అవసరమైన ఎరువులను అందుబాటులో ఉంచేలా చర్యలు చేపట్టాం.

వారంలో రుణ ప్రణాళిక..
ఖరీఫ్‌ రుణ ప్రణాళికను వారం రోజుల్లో రూపొందించి ఆమోదించే అవకాశం ఉంది. అయినప్పటికీ బ్యాంకర్లు.. రైతులకు ఎలాంటి ఇబ్బందులకు గురిచేయకుండా పంట రుణాలు అందజేస్తున్నారు. ఎక్కడైనా బ్యాంకర్లు పంట రుణాలు ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తే మా దృష్టికి తీసుకురావాలి. వెంటనే ఆ బ్యాంకులతో మాట్లాడి రుణాలను ఇప్పించేలా చర్యలు తీసుకుంటాం.

ప్రత్యేక సెల్‌..
జిల్లా వ్యాప్తంగా ఎక్కడైనా విత్తనాలు, ఎరువుల సమస్యలు తలెత్తితే వెంటనే పరిష్కరించేలా వ్యవసాయ శాఖ కార్యాలయంలో ప్రత్యేక సెల్‌ను ఏర్పాటు చేశాం. 72888 94486, 08682 244560 ఫోన్‌ నంబర్లలకు సమాచారం అందించాలి. జిల్లాకు అవసరమైన అన్ని రకాల విత్తనాలు, ఎరువులు సిద్ధం చేసినందున రైతులు ఎలాంటి ఆందోళన చెందొద్దు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement