
నగరంలో పంజా విసిరిన గొలుసు దొంగలు
సిటీలోని మూడు వేర్వేరు ప్రాంతాల్లో మహిళల మెడలోంచి బంగారు గొలుసులు లాక్కెళ్లారు.
మలేసియా టౌన్ షిప్: నగరంలో చైన్‌స్నాచర్లు మరోసారి పంజా విసిరారు. సిటీలోని మూడు వేర్వేరు ప్రాంతాల్లో మహిళల మెడలోంచి బంగారు గొలుసులు లాక్కెళ్లారు. వివరాలు ఇలా ఉన్నాయి
కేపీహెచ్‌బీలో రెండు చోట్ల..
కేపీహెచ్‌బీలో మంగళవారం ఏక కాలంలో రెండు వేర్వేరు చోట్ల మహిళల మెడల్లోంచి గుర్తు తెలియని వ్యక్తులు బంగారు గొలుసులను లాక్కొని ఉడాయించారు.డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ బాలకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం... కేపీహెచ్‌బీ ఒకటో ఫేజ్ మంజీరా మెజిస్టిక్‌లో నివాసముంటున్న గుళ్ల నరసమ్మ మంగళవారం ఉదయం మిక్సీ రిపేర్ చేయించుకొని తిరిగి వస్తుండగా మహారాష్ట్ర బ్యాంక్ సమీపంలో ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు ఆమె మెడలో ఉన్న పుస్తెల తాడు, నల్లపూసల గొలుసు లాక్కెళ్లారు.
కేపీహెచ్‌బీ కాలనీ సర్దార్ పటేల్ నగర్‌కు చెందిన శేషుకుమారి భగత్‌సింగ్ నగర్ సమీపంలో దేవాలయానికి తిరిగి వెళ్లి వస్తుండగా ఇద్దరు వ్యక్తులు బైక్‌పై వచ్చి 3తులాల బంగారు గొలుసు లాక్కొని వెళ్లారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు సీసీ ఫుటేజీల ఆధారంగా దర్యాప్తు చేపట్టారు.
ఉప్పల్‌లో..
బోడుప్పల్: ఇంటి ముందు నిలబడి ఉన్న మహిళ మెడలోనుంచి నాలుగున్నర తులాల బంగారు పుస్తెల తాడును తెంచుకెళ్లిన సంఘటన మంగళవారం మేడిపల్లి పోలీస్‌స్టేన్ పరిధిలో చోటు చేసుకుంది. డీఎస్‌ఐ నవీన్ బాబు తెలిపిన వివరాల ప్రకారం ఎన్ఐఎన్ కాలనీకి చెందిన∙మేకల ప్రవళిక(32) మరో ఇద్దరు మహిళలతో కలిసి ఆదివారం రాత్రి తమ ఇంటి ముందు నిలబడి ఉండగా, బైక్‌పై వచ్చిన ఇద్దరు యువకులు ఆమె మెడలో పుస్తెల తాడును తెంచుకుని పారిపోయే ప్రయత్నం చేశారు. దీంతో ఆమె గొలుసును గట్టిగా పట్టుకుంది. దీంతో పుస్తెలు ఆమె చేతిలో ఉండి పోగా, నాలుగున్నర తులాల బంగారు గొలుసు లాక్కెళ్లారు. మేడిపల్లి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
కాచిగూడ రైల్వే స్టేషన్‌లో..
కాచిగూడ: ఓ మహిళ వద్దనుంచి 9 తులాల బంగారు ఆభరణాలు చోరీకి గురైన సంఘటన కాచిగూడ రైల్వే పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం జరిగింది. రైల్వే ఎస్‌ఐ రామారావు తెలిపిన వివరాల ప్రకారం... నిజామాబాద్ ప్రాంతానికి చెందిన మహిపాల్‌రెడ్డి భార్య అనిత రెండు రోజుల క్రితం నగరానికి వచ్చి మంగళవారం నిజామాబాద్ వెళ్లేందుకు కాచిగూడ రైల్వే స్టేషన్ కు వచ్చింది. ఇంటర్ సీటీ రైలు ఎక్కుతుండగా ఆమె బ్యాగులో ఉన్న పర్సులోని 9తులాల బంగారు అభరణాలను గుర్తుతెలియని మహిళ దొంగిలించింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు రైల్వే పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.