అదుపు తప్పిన అరటి వ్యాన్‌ బోల్తా | Sakshi
Sakshi News home page

అదుపు తప్పిన అరటి వ్యాన్‌ బోల్తా

Published Mon, Feb 20 2017 1:06 AM

banana van rolls over

తాడిపత్రి/యల్లనూరు: యల్లనూరు మండల బుక్కాపురం వద్ద ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో 12 మంది గాయపడ్డారు. అరటి గెలలను కత్తిరించేందుకు కూలీలతో వచ్చిన వ్యాన్‌ రామలింగాయపల్లి నుంచి తిమ్మంపల్లికి వెళ్తుండగా మార్గమధ్యంలో రోడ్డుపైనున్న గుంతను తప్పించే ప్రయత్నంలో వాహనం బోల్తాపడింది. అదులో ప్రయాణిస్తున్న 12 మందికి గాయాలయ్యాయి. వారిలో ఉత్తరప్రదేశ్‌కు చెందిన రాహుల్‌కుమార్‌(18), నసీం అహమ్మద్‌(20), రాంభజన్‌(50), అరవింద్‌ కుమార్‌(25), రోహిత్‌కుమార్‌(30), రాంసమీర్‌(50), అనిరుధ్‌(21), జితేందర్‌(30), తజుంబల్‌(22) సహా యల్లనూరు మండలం తిమ్మంపల్లికి చెందిన కుళ్లాయప్ప(20), చెన్నైకు చెందిన వాహన డ్రైవర్‌ లైలాస్వామి, మణి గాయపడ్డారు.

వారిలో రాహుల్‌కుమార్, నసీం అహమ్మద్, రాంభజన్, అరవింద్‌ కుమార్, రోహిత్‌కుమార్‌ పరిస్థితి విషమంగా ఉంది. రామలింగాయపల్లిలో అరటికాయల గెలలను కత్తిరించి వాటిని ప్యాంకింగ్‌ చేసిన తర్వాత చెన్నైకు తరలించాల్సి ఉంది. ఉత్తర ప్రదేశ్‌కు చెందిన కార్మికులు తిమ్మంపల్లిలో గది అద్దెకు తీసుకొని సమీప గ్రామాల్లో అరటి గెలలను కత్తిరించి, వాటిని ప్యాంకింగ్‌ చేసేందుకు చెన్నైకు చెందిన కాంట్రాక్టర్‌ పనికి పెట్టుకున్నాడు. రోజులాగే ఆదివారం కూడా అరటి గెలలను కత్తిరించి, తిరిగి తిమ్మంపల్లిలో దింపేందుకు వ్యాన్‌ రామలింగాయపల్లి నుంచి బయలుదేరగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.  

రంగంలోకి పోలీసులు  
సమాచారం అందిన వెంటనే పోలీసులు రంగంలోకి దిగారు. వెంటనే ఘటనా స్థలికి చేరుకుని క్షతగాత్రులను 108తో పాటు ఇతర ప్రైవేటు వాహనాల్లో తాడిపత్రి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరిస్థితి సీరియస్‌గా ఉన్న వారిని మెరుగైన వైద్యం కోసం డీఎస్పీ చిదానందరెడ్డి దగ్గరుండి అనంతపురం తరలించారు. ఘటనపై యల్లనూరు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. బాష రాక క్షతగాత్రులు తమ చిరునామాలు కూడా సరిగా చెప్పలేకపోయారు.   

Advertisement
 
Advertisement
 
Advertisement