తెలంగాణ రాష్ట్రంలో వడదెబ్బకు మృతిచెందుతోన్నవారి సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. జిల్లా కలెక్టర్లు పంపిన తాజా ప్రాథమిక నివేదిక ప్రకారం రాష్ట్రంలో ఏకంగా 869 మంది వడదెబ్బకు చనిపోయారు.
-సర్కారుకు కలెక్టర్ల తాజా నివేదిక
-ఖమ్మం జిల్లాలో అత్యధికంగా 351 మంది మృతి
-మహబూబ్‌నగర్ జిల్లాలో 144 మంది
-నల్లగొండలో గతంలో పెంచి చూపిన సంఖ్యను 91కి తగ్గించిన వైనం
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో వడదెబ్బకు మృతిచెందుతోన్నవారి సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. జిల్లా కలెక్టర్లు పంపిన తాజా ప్రాథమిక నివేదిక ప్రకారం రాష్ట్రంలో ఏకంగా 869 మంది వడదెబ్బకు చనిపోయారు. అందులో అత్యధికంగా ఖమ్మం జిల్లాలో 351 మంది చనిపోయారని సర్కారుకు అందజేసిన నివేదికలో వెల్లడించారు. ఆ తర్వాత మహబూబ్‌నగర్ జిల్లాలో 144 మంది, కరీంనగర్ జిల్లాలో 115 మంది, ఆదిలాబాద్ జిల్లాలో 52 మంది, మెదక్ జిల్లాలో 48, రంగారెడ్డి జిల్లాలో 28, వరంగల్ జిల్లాలో 15, హైదరాబాద్‌లో 8 మంది చనిపోయారని నివేదికలో వివరించారు. నల్లగొండ జిల్లాలో 332 మంది చనిపోయారని గతంలో నివేదిక ఇచ్చిన అక్కడి అధికారులు తాజాగా దాన్ని 91 తగ్గించి నివేదికలో ప్రస్తావించినట్లు విపత్తు నిర్వహణశాఖ అధికారి ఒకరు వెల్లడించారు.
రాష్ట్ర చరిత్రలో ఇంతమంది వడదెబ్బకు చనిపోవడం ఇదే తొలిసారి. 2015 వేసవిలో 541 మంది వడదెబ్బకు చనిపోతే... ఇప్పుడు ఏకంగా 869 చనిపోవడంపై అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పైపెచ్చు 45 నుంచి 50 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో పరిస్థితి దారుణంగా మారింది. ఇటీవల వారం పది రోజులపాటు రాష్ట్రంలో కాస్తంత వర్షాలు కురవడం, ఉష్ణోగ్రతలు తగ్గడం వల్ల వడదెబ్బ మృతుల సంఖ్య పెరగలేదని... ఇప్పటి నుంచి జూన్ మొదటి వారం వరకు వడగాల్పుల కారణంగా మరిన్ని వడదెబ్బ మృతులు పెరిగే అవకాశం ఉందని అధికారులు ఆందోళన చెందుతున్నారు.
త్రిసభ్య కమిటీ ప్రకారం 317...
ఇదిలావుండగా కలెక్టర్ల ప్రాథమిక లెక్కలపై జిల్లాల్లోని త్రిసభ్య కమిటీలు మృతుల వివరాలపై విచారణ చేపట్టాయి. విచారణ అనంతరం 317 మరణాలు మాత్రమే వడదెబ్బతో సంభవించాయని పేర్కొనడం గమనార్హం. వడదెబ్బతో చనిపోయిన వారి సంఖ్యను త్రిసభ్య కమిటీ తక్కువ చేసి చూపిస్తోందన్న ఆరోపణలున్నాయి. కలెక్టర్లు నిర్థారించాక... త్రిసభ్య కమిటీ అందుకు విరుద్ధంగా తక్కువ చేసి చూపించడంపై విమర్శలు వస్తున్నాయి. వడదెబ్బ మృతుల సంఖ్యను తక్కువ చేసి చూపించేందుకే ప్రభుత్వం త్రిసభ్య కమిటీ పేరుతో గందరగోళం సృష్టిస్తోందని అంటున్నారు. వడదెబ్బతో చనిపోయినవారిని పోస్టుమార్టం చేయడంలేదు. కాబట్టి వడదెబ్బ మృతుల వివరాలను గుర్తించడంలో అశాస్త్రీయత నెలకొందని తెలిసింది.
చర్యలు శూన్యం...
రాష్ట్రం నిప్పుల కుంపటిపై కుతకుతలాడుతోంది. ప్రస్తుతం 50 డిగ్రీల వరకూ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పరిస్థితి తీవ్రతపై సర్కారుకు ఎప్పటికప్పుడు నివేదికలు అందుతున్నా ప్రజలను వడదెబ్బ నుంచి కాపాడటంలో వైఫల్యం కనిపిస్తోందన్న ఆరోపణలున్నాయి. ఎండతీవ్రత నుంచి ప్రజలను కాపాడేందుకు తెలంగాణ విపత్తు నిర్వహణశాఖ వేసవి కార్యాచరణ ప్రణాళికను రూపొందించింది. ఆ ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా నగరాలు, పట్టణాల్లో ఎల్‌ఈడీ స్క్రీన్స్ పెట్టి ఉష్ణోగ్రతల వివరాలు ప్రదర్శించాలి.
ఎఫ్‌ఎం రేడియో ద్వారా ప్రజలను అప్రమత్తం చేయాలి. ఐస్ ప్యాక్స్, ఐవీ ఫ్లూయిడ్స్‌ను అందుబాటులో ఉంచాలి. 108 సర్వీసును అందుబాటులో ఉంచాలి. వడగాల్పులుంటే ఆర్టీసీ బస్సులను మధ్యాహ్నం 12 నుంచి 4 గంటల మధ్య నడపకూడదు. ఆరు బయట శారీరక శ్రమ చేసేవారికి తగు నీడ కల్పించాలి. ఫ్యాక్టరీల్లో ఏసీ వసతి కల్పించాలి. వడదెబ్బకు గురైనవారి కోసం ఆసుపత్రుల్లో ప్రత్యేకంగా వార్డులను ఏర్పాటు చేయాలి. చలివేంద్రాలు ఏర్పాటు చేయాలి. ప్రభుత్వ కార్యాలయాలు, దేవాలయాలు ఇతర అన్నిచోట్లా నీడ వసతి కల్పించాలి. కానీ ఇవేవీ అమలుకావడంలేదన్న విమర్శలున్నాయి. ఇటీవల కాస్తంత వర్షాలు కురవడంతో అసలు కార్యాచరణ ప్రణాళికనే అటకెక్కించారన్న విమర్శలున్నాయి.