మహిళ అనుమానాస్పద మృతి 

Women Suspicious Death In Chittoor District - Sakshi

సాక్షి, అనంతపురం : కదిరిపల్లికి చెందిన బోయ.అంజినమ్మ (45) మంగళవారం రాత్రి అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. ఇందుకు సంబంధించి రూరల్‌ ఎస్‌ఐ వలిబాషా, మృతురాలి బంధువులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. రామాంజనేయులు, అంజినమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు, ఒక కూతురు ఉన్నారు. పెద్దకొడుకు అనిల్‌తోపాటు కూతురు మహాలక్ష్మికి వివాహాలు జరిపించారు. ఈ క్రమంలో మూడేళ్ల క్రితం రామాంజనేయులు, అంజినమ్మ దంపతుల మధ్య మనస్పర్ధలు వచ్చాయి.

భార్యపిల్లలను వదిలి వెళ్లిన రామాంజనేయులు గుత్తిలో వేరే మహిళతో కలిసి ఉంటున్నాడు. పెద్దవాడైన అనిల్‌ విద్యుత్‌ కాంట్రాక్టు పనులు చేసే వ్యక్తి వద్ద పనిచేస్తూనే వ్యవసాయ పనుల్లో తల్లికి చేదోడు వాదోడుగా ఉంటున్నాడు. చిన్న కుమారుడు శివానంద గార్లదిన్నె మండలం ముకుందాపురంలో ఉంటున్న తన మేనమామ ఇంట్లో ఉంటూ అక్కడే పొలాన్ని కౌలుకు తీసుకొని వ్యవసాయం చేసుకుంటున్నాడు. కొన్ని నెలల క్రితం అనిల్‌ భార్య కాన్పు నిమిత్తం పుట్టింటికి వెళ్లింది. అప్పటినుండి అంజినమ్మ, కుమారుడు అనిల్‌ మాత్రమే ఉంటున్నారు.  

పొలానికి వెళ్లి పరలోకాలకు.. 
ఈ క్రమంలో మంగళవారం ఉదయం పని మీద అనిల్‌ బయటకు వెళ్లగా అంజినమ్మ పొలానికి వెళ్లింది. పనులు ముగించుకొని సాయంత్రం ఇంటికి చేరేసరికి తలుపులకు తాళం వేసి ఉండటంతో అనిల్‌ తన తల్లి గురించి చుట్టుపక్కల వారిని అడిగాడు. పొలానికి వెళ్లడం చూశామని ఇరుగుపొరుగు వారు చెప్పడంతో వెంటనే ఆమెకు ఫోన్‌ చేశాడు. ఫోన్‌ రింగ్‌ అవుతున్నా ఎత్తకపోవడంతో అనుమానం కలిగిన అనిల్‌ ఆ రాత్రి ఆమెను వెతుక్కుంటూ పొలానికి వెళ్లాడు.

అక్కడ ఒక చోట అపస్మారక స్థితిలో పడి ఉన్న తల్లిని గుర్తించి లేపేందుకు ప్రయత్నించినా చలనం లేకపోవడంతో వెంటనే ఆమెను ఆటోలో ఇంటికి తీసుకువచ్చాడు. చుట్టుపక్కల వారు పరిశీలించి ఆమె మృతిచెందిందని చెప్పారు. బుధవారం ఉదయం ఆమెను ఖననం చేసేందుకు కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేసుకున్నారు. కాగా గ్రామస్తుల ద్వారా విషయం తెలుసుకున్న ఎస్‌ఐ వలిబాషా గ్రామానికి చేరుకున్నారు. ఘటనా స్థలాన్ని పరిశీలించగా విషపుద్రావకం డబ్బా కనిపించింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గుంతకల్లు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అంజినమ్మ ఆత్మహత్య చేసుకుందా.. లేక ఆమెను ఎవరైనా హత్య చేశారా అన్నది విచారణలో తేలాల్సి ఉంది.   

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top