మహిళలే..చోరీల్లో ఘనులే! | Women Robbery Gang Arrest in Chittoor | Sakshi
Sakshi News home page

మహిళలే..చోరీల్లో ఘనులే!

Aug 9 2019 7:42 AM | Updated on Aug 9 2019 7:42 AM

Women Robbery Gang Arrest in Chittoor - Sakshi

అరెస్ట్‌ చేసిన దొంగల ముఠా, స్వాధీనం చేసుకున్న నగలను చూపుతున్న కల్లూరు పోలీసులు

వారు చూపు పడితే– ఏ నగల దుకాణంలోని నగ అయినా వారి హస్తలాఘవానికి అదృశ్యం కావాల్సిందే. దుకాణ యజమానుల్ని మాటల్లో పెట్టి, తెలివిగా నగలు కొట్టేసే ఐదుగురితో కూడిన సభ్యుల ముఠాలో నలుగురు మహిళలైతే, వారికి నాయకురాలు కూడా మహిళే కావడం గమనార్హం! వీరిపై నాలుగు జిల్లాల్లో కేసులు ఉండటం చూస్తే చోరీల్లో వీరెంత మహా ముదుర్లో ఇట్టే బోధపడుతుంది.

చిత్తూరు, పులిచెర్ల(కల్లూరు): బంగారు నగల దుకాణాల్లో చోరీలకు పాల్పడే దొంగల ముఠాను కల్లూరు పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల కథనం..  కల్లూరులోని రోషన్‌ నగల దుకాణంలో ఈనెల 6 మంగళవారం ఐదుగురు వ్యక్తులు నగలు కొనేందుకు వచ్చారు. షాపు యజమానిని మాయమాటలతో మభ్య పెట్టి, అతని దృష్టి మరల్చి, షాపులో సుమారు ఒక కేజీ 470 గ్రాముల బరువు కలిగిన 12 జతల కాలి పట్టీలు, కాలి గొలుసులు దొంగలించి ఉడాయించారు. దీనిపై షాపు యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సీసీ కెమెరాలో రికార్డయిన నిందితుల ముఖచిత్రాలు కీలకమయ్యాయి. ఈ చిత్రాలను చిత్తూరులోని దర్యాప్తుకు ఉపకరించే మరో విభాగానికి పంపితే వీరి నేరాల చిట్టా బయటపడింది. దీంతో ప్రత్యేకశ్రద్ధ వహించిన కల్లూరు ఎస్‌ఐ మల్లికార్జున తన సిబ్బందితో దొంగల ముఠా కదలికలపై  ప్రత్యేక నిఘా ఉంచారు. బుధవారం దొంగల గురించి పక్కా సమాచారం అందడంతో కల్లూరు సమీపంలోని చెరకువారిపల్లె బస్‌ స్టాప్‌ వద్ద వాహనాలను తనిఖీ చేశారు. ఎపి 03 టిజి 2223 నంబరు గల ఆటోలో వస్తున్న ఐదుగురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. ప్రాథమిక విచారణలో వీరే కల్లూరులోని నగల దుకాణంలో చోరీకి పాల్పడినట్లు తేలింది. వారు చోరీ చేసిన వెండి కాలిపట్టీలు, గొలుసులను స్వాధీనం చేసుకోవడంతోపాటు నేరానికి ఉపయోగించిన ఆటో సీజ్‌ చేశారు.

దొంగతనానికి పాల్పడిన వారిలో నలుగురు మహిళలు, ఒక పురుషుడు ఉన్నారు. వీరంతా వాల్మీకిపురం మండలం, చింతలవారిపల్లె పంచాయతీ బోయపల్లెకు చెందిన వారని, వీరంతా బంధువులేనని తేలింది. వీరు ఒక ముఠాగా ఏర్పడి ఐదేళ్ల కాలంలో పలు ప్రాంతాల్లో చోరీలకు పాల్పడ్డారు. వీరిపై చిత్తూరు, వైఎస్సార్‌ కడప, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, అనంతపురం జిల్లాల్లోని పలు స్టేషన్లలో కేసులు నమోదై ఉన్నాయని పోలీసులు తెలిపారు. 24 గంటల వ్యవధిలోనే కేసును ఛేదించి దొంగల ముఠాను అరెస్ట్‌ చేసిన పోలీసులకు పాకాల సీఐ ఆశీర్వాదం రివార్డు ప్రకటించి నగదు బహుమతి అందజేశారు. చిత్తూరు డీఎస్పీ కె.ఈశ్వరరెడ్డి అభినందించారు.

దొంగల వివరాలు చూస్తే..
ఏ–1 నిందితురాలైన రేపన అరుణ(45) గ్రూపు లీడరు అని, ఈమె నగల దుకాణాల్లో చోరీ చేయడంతో ఆరితేరిందని పోలీసుల దర్యాప్తులో తేలింది. ఈమెపై మూడు జిల్లాల్లో 7 కేసులు ఉన్నాయి.
2వ నిందితురాలై దిగుడు గీత(30)పై చిత్తూరు, వైఎస్సార్‌ కడప జిల్లాలో 3 కేసులు ఉన్నాయి.
3వ నిందితురాలై పల్లపు విజయ కుమారి(30)పై చిత్తూరు జిల్లాలో ఒక కేసు ఉంది.
4వ నిందితురాలుగా వేముల ప్రభావతి(29), 5వ నిందితుడిగా ఆర్‌.మణి (27) ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement