నమ్మించి మోసం | Postal Employee Fraud In Orissa | Sakshi
Sakshi News home page

నమ్మించి మోసం

Feb 16 2019 8:32 PM | Updated on Feb 16 2019 8:32 PM

Postal Employee Fraud In Orissa - Sakshi

సీఐ రాజులునాయుడుతో చర్చలు జరుపుతున్న బాధితులు, వైఎస్సార్‌సీపీ నాయకులు

చీపురుపల్లి: ఎంతో నమ్మకంతో అతని వద్ద పోస్టల్‌ ఆర్‌డీ, డిపాజిట్ల పేరిట డబ్బులు దాచుకున్నాం.. కట్టిన డబ్బులకు రశీదులు, బాండ్లు ఇవ్వలేదు.. అడిగితే మీకెందుకు నీనున్నానంటూ నమ్మబలికాడు.. అదును చూసుకుని ఊరి నుంచి పరారయ్యాడు. ఎక్కడో వేరే జిల్లాలో పట్టుకుని నిలదీస్తే తమపై కేసులు పెట్టి డబ్బు ఎగ్గొట్టేందుకు ప్రణాళికలు రచిస్తున్నాడంటూ సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ సీహెచ్‌ రాజులునాయుడు ఎదుట మండలంలోని గొల్లలములగాం గ్రామానికి చెందిన దాదాపు 100 మంది గోడు వెళ్లబోసుకున్నారు. రూ.60 లక్షల నుంచి 70 లక్షల రూపాయల వరకు వసూలు చేసి పరారయ్యాడని మాజీ సర్పంచ్‌ కరిమజ్జి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో వైఎస్సార్‌సీపీ నాయకులు ఇప్పిలి అనంతం, వలిరెడ్డి శ్రీనివాసనాయుడు, దన్నాన జనార్దన్, తదితరులు శుక్రవారం స్థానిక సీఐ రాజులునాయుడి దృష్టికి తీసుకువచ్చారు.

వివరాల్లోకి వెళితే.. దాదాపు పదిహేను సంవత్సరాలుగా జి.ములగాంలో పోస్టల్‌ శాఖలో రన్నర్‌గా విధులు నిర్వహిస్తున్న సత్యనారాయణ వద్ద గ్రామస్తులు ఆర్‌డీలు, డిపాజిట్ల పేరుతో డబ్బులు దాచుకున్నారు. అయితే వాటికి ఎలాంటి రశీదులు, బాండ్లు ఇవ్వలేదు. రశీదులు, బాండ్లు అడిగితే మీ దగ్గర ఉంటే పోతాయని నా దగ్గర ఉంటాయని చెబుతూ కాలయాపన చేశాడు. గ్రామస్తులకు అనుమానం వచ్చి గట్టిగా నిలదీయడంతో ఇటీవల కుటుంబంతో కలిసి పరారయ్యాడు. శ్రీకాకుళం జిల్లాలోని రణస్థలంలో నిందితుడు ఉన్నట్లు గుర్తించిన గ్రామస్తులు అక్కడ నుంచి గ్రామానికి తీసుకురాగా నిందితుడు, ఆయన కుమారుడు పెద్ద మనుషుల సమక్షంలో డబ్బులు ఇస్తామని ఒప్పుకున్నారు. తర్వాత మళ్లీ ముఖం చాటేయడంతో గ్రామస్తులు లబోదిబోమంటున్నారు.

తిరిగి మాపై కేసులా....
మాకు డబ్బు ఇవ్వాల్సింది పోయి నిందితుడు తిరిగి మాపై కేసులు పెట్టడం అన్యాయమని బాధితులు వాపోతున్నారు. నిందితుడిపై చీటింగ్‌ కేసు నమోదు చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు.

వేధిస్తున్నారంటూ ఫిర్యాదు....
ఇదే విషయమై సీఐ రాజులునాయుడు మాట్లాడుతూ, జి.ములగాం గ్రామానికి చెందిన పోస్టల్‌ రన్నర్‌ వాండ్రంగి సత్యనారాయణను గ్రామస్తులు, సర్పంచ్‌ వేధిస్తున్నారంటూ ఆయన కుమారుడు వాసుదేవరావు ఎస్పీకి ఇటీవల ఫిర్యాదు చేశాడని తెలిపారు. ఆ ప్రతులు తన వద్దకు రావడంతో విచారణ చేపడుతున్నట్లు చెప్పారు. అయితే గ్రామస్తుల నుంచి సేకరించిన డబ్బు సహారా ఇండియా పరివార్‌ అనే సంస్థలో పెట్టామని.. ఆ సంస్థ దివాలా తీసి కోర్టు కేసుల్లో ఉన్నట్లు బాధితుడి కుమారుడు తెలిపారన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement