చోరీ సొమ్ముతో రియల్‌ ఎస్టేట్‌ దందా

OG Kuppam Gang Arrest in Hyderabad - Sakshi

ఓజి కుప్పం గ్యాంగ్స్‌ వ్యవహారశైలి ఇదీ

చిక్కితే ఇంటరాగేషన్‌ లేకుండానే వెల్లడి

ఆధారాలు చూపిస్తే  సొత్తు అప్పగింత

పరారీలో ఉన్న మరో ఇద్దరి కోసం గాలింపు

సాక్షి, సిటీబ్యూరో: దృష్టి మళ్లించి నేరాలకు పాల్పడే ఓజి కుప్పం ముఠాలు ఆ సొమ్మును రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారంలో పెట్టుబడులుగా పెడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. వీరిని పట్టుకున్నప్పుడు నేరాలకు సంబంధించి ఆధారాలు చూపితే వెంటనే ఆ మొత్తం అప్పగించేయడం వీరి స్టైల్‌ అని అధికారులు చెబుతున్నారు. నగరంతో పాటు ఏపీ, కర్ణాటకల్లోనూ ఎనిమిది నేరాలకు పాల్పడిన ఓజి కుప్పం గ్యాంగ్‌ లీడర్‌ ఆకుల కిరణ్, సభ్యుడు గోగుల తులసీంధర్‌లను నార్త్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు గురువారం అరెస్టు చేసిన విషయం తెలిసిందే. వీరి విచారణలో అనేక ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఈ గ్యాంగ్‌కు సంబంధించి పరారీలో ఉన్న మరో ఇద్దరు నిందితులు ప్రభుదాస్, శామ్యూల్‌ రాజ్‌ల కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. 

ఇప్పటికీ యాక్టివ్‌గా 12 ముఠాలు...
చిత్తూరు జిల్లాలోని తమిళనాడు సరిహద్దుల్లో ఉన్న ప్రాంతమే ఓజీ కుప్పంగా పిలిచే ఓరన్‌ థంగల్‌ గొల్ల కుప్పం. ఎదుటి వారి దృష్టి మళ్లించి నేరాలు చేయడంలో ఇక్కడి వారు నిష్ణాతులు. ఈ ప్రాంతంలో ఒకప్పుడు 500 మంది వరకు నేరగాళ్లు ఉండేవాళ్ళు. కాలానుగుణంగా వీరిలోనూ మార్పు వచ్చి యువత విద్యాభ్యాసంపై దృష్టి పెట్టారు. అయినా ఇప్పటికీ 12 గ్యాంగులు దృష్టి మళ్లించి నేరాలు చేస్తున్నాయి. గ్యాంగ్‌ లీడర్లు మినహా సభ్యులు ఒక్కోసారి ఒక్కో గ్యాంగ్‌తో కలిసి ‘పని’కి వెళ్తుంటారు. తెలుగు, తమిళం బాగా, హిందీ ఓ మోస్తరుగా తెలిసిన వీరు దక్షిణాది రాష్ట్రాలనే టార్గెట్‌గా చేసుకుంటారు. ఉత్తరాదికి వెళ్లడానికి భాష, తమ ఆహార్యం అడ్డంకులుగా వీరు భావిస్తుంటారు. 

ఒకప్పుడు జల్సాలు...
ఈ నేరాల్లో వచ్చిన సొమ్మును ఓజీ కుప్పం ముఠాలు ఒకప్పుడు విలాసాలకు ఖర్చు చేసేవి. చేతిలోని డబ్బు అయిపోయిన తర్వాత మరో నేరం చేసేవి. ఫలితంగా వీరిలో ఎవరైనా మంచం పట్టినా, ఇతర ఇబ్బందులు ఎదురైనా వారి బతుకు దుర్భరంగా మారేది. దీనిని గ్రహించిన అక్కడి ముఠాలు నేరాల్లో వచ్చిన సొమ్ముతో రియల్‌ ఎస్టేట్‌ రంగంలో పెట్టుబడులు పెట్టడం ప్రారంభించాయి. ప్రధానంగా చెన్నై, బెంగళూరుల్లో వీరు ప్లాట్లు ఖరీదు చేస్తున్నట్లు పోలీసులు చెబుతున్నారు. అయితే కనీసం ఒక్క స్థలాన్ని కూడా తమ పేరుతోరో, నేరచరిత్ర ఉన్న వారి పేర్ల మీదో ఉండనీయరు. అలా చేస్తే పోలీసులు అరెస్టు చేసినప్పుడు వాటినీ స్వాధీనం చేసుకుంటారనే ఉద్దేశంతో స్థిరాస్తులన్నింటినీ ఎలాంటి నేరచరిత్ర లేని తమ బంధువుల పేర్లతోనే రిజిస్ట్రేషన్‌ చేయిస్తుంటారని అధికారులు గుర్తించారు. 

ఇంటరాగేషన్‌ అవసరం లేకుండానే...
పోలీసులకు ఈ తరహా నేరాలు చేసే బయటి ముఠాలను పట్టుకోవడం ఒక ఎత్తైతే.. వారిని ఇంటరాగేట్‌ చేసి సొత్తు, సొమ్ము రికవరీ చేయడం మరో ఎత్తు. అయితే ఓజీ కుప్పం గ్యాంగ్స్‌ విషయంలో ఇలాంటి ఇబ్బంది ఉండదని పోలీసులు చెబుతున్నారు. కేవలం వీరిని గుర్తించి, ఆ ప్రాంతానికి వెళ్లి పట్టుకోవడమే కష్టమని, అలా చిక్కిన మరుక్షణం ఒక్క దెబ్బ కూడా తినకుండానే తమ నేరాలు అంగీకరిస్తూ ఆ మేరకు రికవరీలు సైతం ఇచ్చేస్తారని వివరిస్తున్నారు. కొన్ని సందర్భాల్లో నేరగాళ్లు చిక్కకపోయినా... నేరానికి సంబంధించిన సీసీ టీవీ ఫుటేజీలతో అక్కడికి వెళ్తే చాలని, మధ్యవర్తులుగా ఉండే మాజీ నేరగాళ్లు ఈ ఆధారాలను పరిశీలించి ఆ మేరకు సొమ్ము రికవరీ ఇచ్చేస్తారని పేర్కొంటున్నారు. ఈ మాజీ నేరగాళ్లు రికవరీలతో పాటు తమ వారు అరెస్టు అయినప్పుడు న్యాయవాదుల్ని మాట్లాడటం, బెయిల్స్‌ ఇప్పించడం సైతం చేస్తున్నట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు.  

కుటుంబ పోషణ భారమైతే మహిళలూ
నగరంలోని పశ్చిమ మండల పోలీసులు గత ఏడాది డిసెంబర్‌లో బెంగళూరులో స్థిరపడిన ఓజీ కుప్పం ముఠాను పట్టుకున్నారు. గాయత్రి అనే మహిళ నేతృత్వంలో ఈ ముఠా నడుస్తున్నట్లు తేల్చారు. సాధారణంగా అక్కడి ఆడవారు నేరాల జోలికి పోరని పోలీసులు చెబుతున్నారు. భర్తలు చనిపోవడం, అనారోగ్యానికి గురికావడం తదితర కారణాలతో కుటుంబ పోషణ భారంగా మారితేనే వారు నేరగాళ్ల అవతారం ఎత్తుతారని వివరిస్తున్నారు. అయితే మహిళలు రోడ్ల పైన, బ్యాంకుల వద్ద నేరాలు చేయరు. మరికొందరితో కలిసి బస్సుల్లో తిరుగుతూ ఒంటరి మహిళల్ని టార్గెట్‌గా చేసుకుని అటెన్షన్‌ డైవర్షన్‌ నేరాలకు పాల్పడతారని అధికారులు వివరించారు. నార్త్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌కు చిక్కిన కిరణ్, తులసీంధర్‌ల అరెస్టుపై నగర పోలీసులు ఏపీ, కర్ణాటక అధికారులకు సమాచారం అందించారు. నగరంలో వీరిపై ఉన్న కేసుల్లో పీటీ వారెంట్ల దాఖలు పూర్తయిన తర్వాత ఆయా రాష్ట్ర అధికారులకు అప్పగించనున్నారు. ఈ కేసులకు సంబంధించి పరారీలో ఉన్న ప్రభుదాస్, శామ్యూల్‌ రాజ్‌లను పట్టుకోవడానికి గాలింపు కొనసాగిస్తున్నారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top