మార్టిగేజ్‌ ల్యాండ్‌ మాయం?

Municipal Plots Mortgaged And  Sold Illegally  - Sakshi

సాక్షి, సిరిసిల్లటౌన్‌:మున్సిపల్‌ ఆస్తులకు రక్షణ కరువైంది. కొందరు మధ్యవర్థుల అడ్డగోలు వ్యవహారం.. అధికారుల గుడ్డినమ్మకం ఇందుకు కారణమైంది. రూ.25 లక్షల విలువ చేసే మార్టిగేట్‌ స్థలం వివాదంలో చిక్కింది. 

టౌన్‌ ప్లానింగ్‌ వైఫల్యంతో..
మున్సిపల్‌కు చెందిన ఆస్తుల రక్షణలో టౌన్‌ప్లానింగ్‌ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపణలకు ఈసంఘటన సాక్ష్యంగా నిలుస్తోంది. సాయినగర్‌లో 729/ఏ, 729/బి తదితర సర్వే నంబర్లలో 2000, 2001 ప్రాంతంలో పలువురు తమ స్థలాలను ప్లాట్లుగా మార్చుతూ అనుమతులు పొందారు. ఈప్రాంతం అభివృద్ధి కోసం మున్సిపల్‌కు 31 గుంటలు కేటాయించినట్లు సమాచారం. మున్సిపల్‌ స్థలాలకు రక్షించే చర్యలో భాగంగా సదరు సర్వే నంబర్లలోని లేఅవుట్‌ భూమి 31 గుంటలు ఉండగా మున్సిపల్‌ కేవలం 16 గుంటలకే ప్రహరీ నిర్మించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇందులో ప్రస్తుతం నర్సరీ నిర్వహిస్తున్నారు. ఇదే స్థలాన్ని ఆనుకుని మిగతా 15 గుంటలకు ప్రహరీ నిర్మించకపోవడంలో ఆంతర్యం ఏమిటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

చిన్నలోటు.. పెద్దతప్పు..
సాయినగర్‌ ప్రాంతంలోని రెండు వేర్వేరు వెంచర్ల ద్వారా మున్సిపల్‌కు 31 గుంటల స్థలం సంక్రమించింది. ఇందులో ఒక వెంచర్‌ను ముగ్గురి తరఫున ప్లాట్‌ నంబరు 21 పేరుతో మున్సిపల్‌ ఫీజు కింద కమిషనర్‌ పేరిట మార్టిగేజ్‌ చేశారు. ప్లాటింగ్‌ అనుమతిలో డీటీసీపీ నుంచి అనుమతి వచ్చినపుడు సదరు ప్లాటు నంబరు 25గా మారిం ది. హద్దులు మాత్రం వెనకాల మున్సిపల్‌ నర్సరీ, ముందు భాగంలో రోడ్డు వంటివి ప్లాన్‌లో నిర్ధారణ చేసినట్లు మిగతా ఇద్దరు బాధితులు తెలిపారు. అయినా మూడోవ్యక్తి కమిషనర్‌ పేరిట మార్టిగేజ్‌ చేసిన స్థలాన్ని విక్రయించడం..ఇటీవలే ఆ ప్లాటులో టౌన్‌ప్లానింగ్‌ నుంచి ఇంటి నిర్మాణానికి అనుమతి రావడం వివాదానికి తెరలేపింది. 

అడ్డదారులు పట్టిస్తున్న గుడ్డినమ్మకం..
మధ్యవర్థులపై అధికారులకు ఉన్న గుడ్డినమ్మకం అడ్డదారులకు తావిస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా.. ఇంటి నిర్మాణ అనుమతి మంజూరులో స్థానిక మున్సిపల్‌ ప్లానర్స్‌తోపాటు మరికొందరు మధ్యవర్థిత్వం నెరుపుతున్నట్లు సమాచారం. ఈవిషయంలో ఓ ప్లానర్‌ అ«ధికారులు, ప్లాటు విక్రయదారులకు మధ్యవర్థిత్వం నెరిపి విచారణ లేకుండా ఇంటి నిర్మాణానికి అనుమతి మంజూరు చేయించినట్లు చర్చసాగుతోంది. సాయినగర్‌లోని మున్సిపల్‌ మార్టిగేజ్‌ ల్యాండ్‌ను ఇతరులకు అమ్మిన వ్యక్తి ప్రముఖుడు కావడంతో ఎలాంటి వి చారణ లేకుండానే ఇంటిపర్మిషన్‌ ఇచ్చినట్లు విమర్శలున్నాయి. ప్రస్తుతం సదరు మార్టిగేజ్‌ ల్యాండ్‌ విడుదల కోసం ఇద్దరు బాధితులు దరఖాస్తు చేసుకుని న్యాయం కావాలని కోరుతున్నారు. 

చర్యలు తీసుకుంటాం 
మార్టిగేజ్‌ ల్యాండ్‌ విక్రయంపై మాకు ఫిర్యాదు రాలేదు. ఈవిషయంలో విచారణ చేపట్టి చర్యలు చేపడతాం. మున్సిపల్‌కు సంబం««ధించిన స్థలాలను ఆక్రమించినా..దుర్వినియోగం చేసినా కఠినంగా వ్యవహరిస్తాం. 
– రమణాచారి, మున్సిపల్‌ కమిషనర్‌ 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top