వివాహిత ఆత్మహత్య ?

married woman dead suspectly

పరారీలో భర్త

భర్తే చంపాడని ఆరోపణ

ఆస్పత్రిలో బంధువుల ఆందోళన

ఎస్సీ, ఎస్టీ విభాగం డీఎస్పీ విచారణ

ఆత్మహత్య చేసుకుందని భర్త చెబుతున్నాడు. భర్తే హత్య చేసి.. ఆత్మహత్యగా చిత్రీకరించాడని మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు.

గుత్తి: వివాహిత ఆత్మహత్య గుత్తి ఆర్‌ఎస్‌లో ఉద్రిక్తతకు దారి తీసింది. తన వివాహేతర సంబంధాలకు అడ్డు లేకుండా చూసుకునేందుకు భర్తే అదనపు కట్నం పేరిట వేధింపులకు గురిచేసి, చివరకు హత్య చేసి.. ఆత్మహత్యగా చిత్రీకరించాడని బంధువులు ఆరోపిస్తున్నారు. సీఐ ప్రభాకర్‌గౌడ్‌ తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. విడపనకల్లు మండలం వేల్పుమడుగుకు చెందిన దాసరి తిరుపతమ్మ కుమార్తె మహాలక్ష్మికి గుత్తి ఆర్‌ఎస్‌కు చెందిన ఓబన్న కుమారుడు సత్యనారాయణతో 2012లో వివాహమైంది. కట్నకానుకల కింద రూ.2లక్షల నగదు, ఆరు తులాల బంగారు ఆభరణాలు అందజేశారు. సత్యనారాయణ గుత్తి రైల్వే డీజిల్‌షెడ్‌లో టెక్నీషియన్‌గా పనిచేస్తున్నాడు. వీరికి కుమార్తెలు దాక్షాయణి(5), దీక్షత(3), కుమారుడు ఇతేష్‌ బాబు(2) ఉన్నారు.  

మూడేళ్ల నుంచి వేధింపులు
సత్యనారాయణకు ఆర్‌ఎస్‌లోని రైల్వే ఉన్నతాధికారి భార్యతోపాటు, తాడిపత్రి, గుత్తికి చెందిన మరో ఇద్దరు యువతులతో వివాహేతర సంబంధం ఉంది. భార్యకు విషయం తెలిసిన తర్వాత.. భర్తను మార్చుకోవాలని ప్రయత్నించింది. అయితే అతను మారకపోగా.. భార్యను వేధించడం మొదలుపెట్టాడు. అదనపు కట్నం కూడా తీసుకురావాలని చిత్రహింసలు పెట్టాడు. భర్తతోపాటు అత్త నాగలక్ష్మమ్మ, ఆడపడచు నాగవేణిలు కూడా తోడయ్యారు. మూడేళ్లుగా ఈ వేధింపులు కొనసాగుతున్నాయి. భార్యాభర్తల మధ్య గొడవలు తారస్థాయికి చేరాయి. వారం క్రితం పీకలదాకా మద్యం తాగొచ్చి భార్యను చితకబాదాడు. ఆమె తల్లి, తమ్ముడు వచ్చి భార్యాభర్తలకు సర్దిచెప్పి వెళ్లారు.

అర్ధరాత్రి తర్వాత మృతి..
మంగళవారం అర్ధరాత్రి 12 గంటల సమయంలో సత్యనారాయణ ఫుల్‌గా తాగొచ్చి భార్యతో గొడవపెట్టుకున్నాడు. అదనపు కట్నం తీసుకురావాలని భర్త, అత్త, ఆడపడుచు కూడా వేధించారు. దీంతో మనస్తాపం చెందిన మహాలక్ష్మి పురుగుమందు తాగి, అనంతరం ఉరివేసుకుంది. తన భార్య ఆత్మహత్యయత్నానికి పాల్పడిందని సత్యనారాయణ పోలీసులకు ఫోన్‌ద్వారా సమాచారం అందించాడు. గుత్తి ప్రభుత్వాసుపత్రిలో భార్యను చేర్పించి రాత్రికి రాత్రే పరారయ్యాడు. సంఘటనా స్థలాన్ని సీఐ ప్రభాకర్‌ గౌడ్‌ పరిశీలించారు. భర్తేహత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారని మృతురాలు తల్లి దాసరి తిరుపతమ్మ, అక్క సుధా, తమ్ముడు అనిల్‌తో పాటు బంధువులు ఆరోపించారు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

బంధువుల ఆందోళన
భర్త వచ్చే వరకు మహాలక్ష్మి మృతదేహానికి పోస్టుమార్టం చేయకూడదని బంధువులు ఆస్పత్రిలో బుధవారం ఆందోళనకు దిగారు. సీఐ ప్రభాకర్‌గౌడ్, పోలీసులతో వాగ్వాదానికి దిగారు. సీఐను చుట్టుముట్టి హంతకుడిని రప్పించాలని డిమాండ్‌ చేశారు. నిందితుడిని 24 గంటల్లో అరెస్టు చేస్తామని సీఐ చెప్పినా వినలేదు. అనంతపురం నుంచి ఎస్సీ, ఎస్టీ విభాగం డీఎస్పీ మహబూబ్‌బాషా గుత్తికి వచ్చి వివాహిత మృతిపై బంధువులను విచారణ చేశారు. కట్నకానుకల కింద ఇచ్చిన రూ.2లక్షల నగదు, ఆరు తులాల బంగారు ఆభరణాలను వెనక్కు ఇప్పించాలని బంధువులు డిమాండ్‌ చేశారు. నగలు, నగదు రికవరీ చేసి పిల్లల పేరిట బ్యాంకులో డిపాజిట్‌ చేయిస్తామని డీఎస్పీ హామీ ఇచ్చారు. మహాలక్ష్మి భర్త సత్యనారాయణ, ఆడ పడుచు నాగవేణి, అత్త నాగలక్షమ్మపై 304ఎ సెక్షన్‌ కింద కేసు నమోదు చేశామని చెప్పారు. దీంతో బంధువులు శాంతించారు. డాక్టర్లు వెంటనే పోస్టుమార్టం చేసి మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top