ఫ్రస్టేషన్‌: ప్రియురాలు ఫోన్‌ తీయటంలేదని..

Man Stabs Lover Over Suspicion In Mumbai - Sakshi

ముంబై : ప్రియురాలి మీద అనుమానంతో ఓ యువకుడు దారుణానికి ఒడిగట్టాడు. కత్తితో ఆమెపై విచక్షణా రహితంగా దాడి చేశాడు. ముంబై ధోబీ టలావోలో చోటుచేసుకున్న ఈ సంఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ధోబీ టలావోకు చెందిన కదమ్‌ అనే యువకుడు అదే ప్రాంతానికి చెందిన యువతి 2016 నుంచి ప్రేమించుకుంటున్నారు. కాగా గత కొద్దిరోజులుగా ప్రియురాలు తన ఫోన్‌ కాల్స్‌కు స్పందించకపోవటం, కలవటానికి ఇష్టపడకపోవటం కదమ్‌లో అనుమానం రేకెత్తించింది. ఈ విషయమై ఇద్దరిమధ్యా తరుచూ వాగ్వివాదం చోటుచేసుకునేది. ఈ నేపథ్యంలో శుక్రవారం ప్రియురాలిని ఇంటికి పిలిచిన కదమ్‌ ఆమె లోపలికి రాగానే తలుపు బిగించాడు. ఫోన్‌కాల్స్‌ విషయమై ఆమెతో మరోసారి గొడవపెట్టుకున్నాడు. గొడవ పెద్దదవటంతో ఆగ్రహానికి గురైన కదమ్‌ కత్తితో ఆమెపై దాడికి దిగాడు.

విచక్షణా రహితంగా ఆమెను పొడవటం మొదలుపెట్టాడు. కత్తిగాట్ల నొప్పి భరించలేక ఆమె కేకలు వేయటంతో పొరుగింటివారు అక్కడికివచ్చి తలుపు కొట్టారు. కదమ్‌ అదేమీ పట్టించుకోకుండా ఆమెను పొడుస్తూ ఉండిపోయాడు. తలుపులు ఎంతసేపటికి తెరుచుకోకపోవటంతో వారు వాటిని బద్దలు కొట్టి లోపలికి ప్రవేశించారు. హఠాత్తుగా జనం లోపలికి రావటంతో ఖంగుతిన్న కదమ్‌.. పొడవటం ఆపేసి, తన మణికట్టును కోసుకున్నాడు. దీంతో గాయాలపాలైన ఇద్దర్ని పొరుగింటి వారు ఆసుపత్రికి తరలించారు. బాధితురాలి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కదమ్‌పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అతడ్ని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. బాధితురాలి పరిస్థితి ప్రస్తుతం మెరుగ్గా ఉన్నట్లు ఆసుపత్రి వైద్యులు తెలిపారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top