ఇంటర్‌ విద్యార్థిని ఆత్మహత్య? | Journey College Students Suicide In Karimnagar | Sakshi
Sakshi News home page

ఇంటర్‌ విద్యార్థిని ఆత్మహత్య?

Feb 1 2019 12:38 PM | Updated on Feb 1 2019 12:38 PM

Journey College Students Suicide In Karimnagar - Sakshi

కరీంనగర్‌క్రైం: కరీంనగర్‌ శివారులోని రేకుర్తిలో ఉన్న ఓ ప్రముఖ జూనియర్‌ కళాశాలలో ఇంటర్‌ సెకండియర్‌ చదువుతున్న విద్యార్థిని గురువారం నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకుంది. మంచిర్యాల జిల్లా సీసీసీ నస్పూర్‌లోని నాగార్జున కాలనీకి చెందిన డొనూరి మల్లేశం– శారద దంపతులకు కొడుకు, కూతురు రుచిత(17) ఉన్నారు. మల్లేశం సింగరేణి కార్మికుడిగా చేస్తున్నాడు. రుచిత కరీంనగర్‌ శివారు రేకుర్తిలోని ఓ ప్రయివేటు కళాశాలలో ఇంటర్‌ సెకండియర్‌ (ఏంపీసీ) చదువుతూ కాలేజీ హాస్టల్లోనే ఉంటోంది.

జనవరి 12న సంక్రాంతి సెలవులకు ఇంటికి వెళ్లింది. తన తాత చనిపోవడంతో పెద్దకర్మ కార్యక్రమాలు పూర్తయిన తర్వాత 27న తిరిగి కళాశాలకు వచ్చింది. అప్పటినుంచి అందరితో కలివిడిగా ఉంటోంది. గురువారం ఉదయం టిఫిన్‌ చేసి, క్లాస్‌కు వెళ్లింది. 11.30కి పని ఉందని హాస్టల్‌లోని తన గదికి వెళ్లింది. కాసేపటికే అరుపులు వినిపించాయి. సిబ్బంది వెళ్లి చూసేసరికి రుచిత బాత్రూంలో మంటల్లో కాలిపోయింది. వెంటనే సివిల్‌ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే రుచిత చనిపోయిందని వైద్యులు నిర్దారించారు. కిరోసిన్‌ పోసుకోవడంతోనే విద్యార్థిని చనిపోయిందని వైద్యులు పేర్కొంటున్నారు. పోలీసులు ఆస్పత్రికి, కళాశాలకు వెళ్లి వివరాలు సేకరించారు.

అనుమానాలెన్నో...
రుచిత మృతిపై పలు అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. కిరోసిన్‌ పోసుకుని చనిపోయిందంటున్న రుచితకు కిరోసిన్‌ ఎక్కడిదనే ప్రశ్న తలెత్తుతోంది. రుచిత ఉంటున్న హాస్టల్‌లో వంట చేయరు. క్యాటరింగ్‌ ద్వారానే భోజనాలు వస్తుంటాయి. కళాశాల యాజమాన్యం మాత్రం రుచిత కిరోసిన్‌ వెంట తెచ్చుకుందని అంటున్నారు. అయితే ఇంటినుంచి కళాశాలలోకి వస్తున్న విద్యార్థినిని మొదటగా గేటువద్ద, తరువాత వార్డెన్, సిబ్బంది క్షుణ్ణంగా తనిఖీ చేస్తారు. డబ్బాలో కిరోసిన్‌ తెచ్చుకుంటే యాజమాన్యం గమనించదా..? తోటి విద్యార్థులకు వాసన రాదా..? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. నాలుగురోజుల క్రితం కళాశాలకు వచ్చిన రుచిత ఇన్నిరోజులు కిరోసిన్‌ డబ్బాను ఎక్కడ దాచి ఉంచిందన్న ప్రశ్నలు అనుమానాలకు తావిస్తోంది. అయితే రుచిత ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని తల్లిదండ్రులు అంటున్నారు. ఘటన స్థలాన్ని పోలీస్‌ కమిషనర్‌ కమలాసన్‌రెడ్డి, అడిషనల్‌ డీసీపీ సంజీవ్‌కుమార్, ఏసీపీ ఉషారాణి పరిశీలించారు. కేసు విచారణాధికారిగా రూరల్‌సీఐ శశిధర్‌రెడ్డిని నియమిస్తూ సీపీ కమలాసన్‌రెడ్డి అదేశించారు.

అడగడునా సీసీ కెమోరాలు
రేకుర్తిలో ఉన్న అల్ఫోర్స్‌ జూనియర్‌ కాలేజీలో అడగడునా సీసీ కెమోరాలున్నాయి. కానీ కాలేజీలోకి కిరోసిన్‌ ఎలా వచ్చిందో మాత్రం ఎవరూ చెప్పడం లేదని పలువురు పేర్కొంటున్నారు.

వరుస ఘటనలు..
కరీంనగర్‌లోని విద్యాసంస్థల్లో చదువుతున్న విద్యార్థుల వరుస బలవన్మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. మొన్న పారమిత హెరిటేజ్‌ పాఠశాలలో తొమ్మిదో తరగతి విద్యార్థి మానసిక ఒత్తిడితో ఐదంతస్తుల భవనం పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. నిన్న ఇంటర్‌ విద్యార్థి ఆత్మహత్య చేసుకుంది. ఇంత జరుగుతున్నా యాజమాన్యాలు దిద్దుబాటు చర్య తీసుకోవడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తున్నాయి.

విద్యార్థి సంఘాల ఆగ్రహం..
పేరున్న కళాశాలలో యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విద్యార్థి సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. కేవలం డబ్బులు తెచ్చేర్యాంకుల మిషన్లలా విద్యార్థులను చూస్తున్నారని ఆరోపించారు. దీంతో వారు మానసికంగా ఒత్తిడికి గురవుతున్నారని వాపోయారు. అసౌకర్యాల నడుమ హస్టళ్లను నిర్వహిస్తున్నారని పేర్కొంటున్నారు.

ఆస్పత్రి ఎదుట ధర్నా..
విద్యార్థిని మృతి సంఘటన తెలుసుకున్న విద్యార్ధి సంఘాలు ఆస్పత్రికి చేరుకుని అల్పోర్స్‌ యాజమాన్యంపై చర్య తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఏబీవీపీ నాయకులు ఆస్పత్రి ఎదుట ధర్నా చేశారు. పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని విద్యార్థి సంఘాల నాయకులను అరెస్టు చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
 

కన్నీరు మున్నీరైన తల్లిదండ్రులు
మధ్యాహ్నం మంచిర్యాల నుంచి కరీంనగర్‌ ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చిని తల్లిదండ్రులు కూతురు మృతదేహం చూసి కుప్పకూలిపోయారు. గుండెలు పగిలేలా రోదించారు. ‘మాకు ఆరోగ్యం బాగాలేదని మాత్రమే సమాచారం ఇచ్చారు.. కాలేజీ యాజమాన్యమే మా బిడ్డను హత్య చేసింది.’ అని ఆరోపించారు. గత ఆదివారమే కాలేజీకి వచ్చిందని.. రుచిత  ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని అమె బంధువులు తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement