పేలుతున్న మామూళ్లు

fire and police departments collecting money  from cracker shops

ఒక్కో టపాసుల దుకాణం నుంచి రూ.10 వేల వసూలు  

మంచంపై పెట్టుకుని విక్రయిస్తే రోజుకు రూ.5 వేలు

అధికారుల పిల్లలకు ఉచితంగా బాణసంచా..  

కొన్నిచోట్ల ‘తమ్ముళ్లే’ దందా రాయుళ్లు

ఆళ్లగడ్డ : దీపావళి సందర్భంగా టపాసుల విక్రయ దందా సాగుతోంది. అధికారులు మామూళ్లు దండుకుని యథేచ్ఛగా అనుమతి ఇచ్చేస్తున్నారు. ఆళ్లగడ్డలో సుమారు వంద తాత్కాలిక షాపులు ఏర్పాటు చేసి టపాసుల విక్రయాలు చేపడతారు. ఈ సందర్భంగా అగ్నిమాపక, పోలీస్, రెవెన్యూ అధికారులు, సిబ్బంది మామూళ్ల పంట పండించుకుంటున్నారు.  తాత్కాలిక లైసెన్స్‌దారుల నుంచి రూ.10 వేల చొప్పున, అనుమతులు లేకుండా మంచంపై పెట్టుకుని అమ్మేందుకైతే రోజుకు రూ.5 వేలతో పాటు వారి పిల్లలకు ఉచితంగా టపాసులు తీసుకుంటున్నారు. ఆళ్లగడ్డలోనే కాకుండా.. జిల్లాలోని మిగిలిన ప్రాంతాల్లోనూ ఇదే తరహాలో దందా సాగుతోంది. కొందరు అధికారులతో పాటు ఆళ్లగడ్డ, కర్నూలు, ఆదోని, నంద్యాల, కోవెలకుంట్ల పట్టణాల్లో టీడీపీ నేతలు సైతం దందాకు దిగినట్లు తెలుస్తోంది. జిల్లాలోని అన్ని పట్టణ, మండల కేంద్రాలు, గ్రామీణ ప్రాంతాల్లో సైతం తాత్కాలిక స్టాల్స్‌ ఏర్పాటు చేసి యథేచ్ఛగా విక్రయాలు సాగిస్తున్నారు. ఇందుకోసం భారీమొత్తంలో అధికారులకు ముట్టజెప్పినట్లు తెలుస్తోంది.

సామాన్యులపై భారం
జిల్లాలోని దుకాణాలకు తమిళనాడు, కర్ణాటకతో పాటు రాష్ట్రంలోని గుంటూరు, ప్రొద్దుటూరు, కర్నూలు, నంద్యాల, ఆదోని తదితర ప్రాంతాల నుంచి బాణసంచా వస్తోంది. విక్రయ అనుమతుల కోసం భారీగా ముడుపులు చెల్లించిన వ్యాపారులు దాన్ని టపాసులపై రేటు పెంచడం ద్వారా సామాన్యుల నుంచి వసూలు చేసుకుంటున్నారు. రూ.100 విలువ చేసే వాటిని రూ.700 నుంచి రూ.వెయ్యి వరకు అమ్ముతున్నట్లు
తెలుస్తోంది.

నిబంధనలివీ..  
వీధుల్లో, నివాసాల మధ్య బాణసంచా విక్రయించరాదు. గ్రామ, పట్టణ శివారుల్లోని ఖాళీ ప్రదేశాల్లో మాత్రమే తాత్కాలిక దుకాణాలు ఏర్పాటు చేసుకోవాలి.
స్టాల్స్‌ వద్ద అగ్నిమాపక వాహనాన్ని, ప్రతి స్టాల్‌ దగ్గర 200 లీటర్ల సామర్థ్యమున్న రెండు డ్రమ్ముల్లో నీటిని ఏర్పాటు చేసుకోవాలి.
ఒక్కో దుకాణం దగ్గర రెండు ఇసుక నింపిన బకెట్లు ఉంచుకోవాలి.  
దుకాణానికి దుకాణానికి మధ్య కనీసం మూడు మీటర్ల దూరం ఉండాలి.  
13 ఏళ్లలోపు పిల్లలకు బాణసంచా విక్రయించరాదు.
పై నిబంధనలన్నీ పాటిస్తూ టపాసుల విక్రయానికి లైసెన్స్‌ పొందేందుకు రూ .500 చలానాతో ఫైర్‌ అధికారికి దరఖాస్తు చేసుకోవాలి. వారు దరఖాస్తు పరిశీలించి ఆర్‌డీఓ కార్యాలయానికి రెఫర్‌ చేస్తారు. అక్కడి నుంచి ఆయా మండలాల రెవెన్యూ, పోలీస్‌ కార్యాలయాలకు పంపిస్తారు. వారు నిబంధనలకు అనుగుణంగా ఉన్న షాపులకు ఎన్‌ఓసీ ఇస్తారు. ఆ తర్వాతే బాణసంచా విక్రయాలు చేపట్టాల్సి ఉంటుంది.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top