చుక్కేసి నడిపారు... చుక్కలు చూశారు! | Drunk And Drive Cases Filed In City Roundup | Sakshi
Sakshi News home page

చుక్కేసి నడిపారు... చుక్కలు చూశారు!

Mar 17 2018 7:33 AM | Updated on Sep 4 2018 5:07 PM

Drunk And Drive Cases Filed In City Roundup - Sakshi

సాక్షి, సిటీబ్యూరో: ఈ ఏడాది జనవరి 1 నుంచి మార్చ్‌ 15 మధ్య కేవలం రెండున్నర నెలల్లో మద్యం మత్తులో వాహనం నడుపుతూ ట్రాఫిక్‌ పోలీసుల స్పెషల్‌ డ్రైవ్స్‌లో చిక్కిన మందుబాబులు న్యాయస్థానాల్లో చెల్లించిన జరిమానా ఎంతో తెలుసా..? అక్షరాలా రూ.1,43,44,800. దీనికితోడు 1103 మంది జైలుకు వెళ్లగా... 475 మంది డ్రైవింగ్‌ లైసెన్సులను (డీఎల్స్‌) న్యాయస్థానం శాశ్వతంగా రద్దు చేయడం, సస్పెండ్‌ చేయడమో జరిగిందని అదనపు పోలీసు కమిషనర్‌ (ట్రాఫిక్‌) అనిల్‌కుమార్‌ శుక్రవారం వెల్లడించారు. మైనర్‌ డ్రైవింగ్‌ కేసులో ఒకరికి, డ్రంక్‌ డ్రైవింగ్‌ కేసులో ముగ్గురికి ఏకంగా నెల రోజుల పాటు జైలు శిక్ష విధించినట్లు తెలిపారు. ఈ రెండున్నర నెలల కాలంలో మరో ఐదు రకాలైన తీవ్రమైన ఉల్లంఘనలకు పాల్పడి చిక్కిన 170 మంది వాహనచోదకులకు కోర్టులు జైలు శిక్షలు విధించాయన్నారు.

డ్రంక్‌ డ్రైవింగ్‌ కేసుల్లో చిక్కిన వారి మద్యం తీసుకున్న మోతాదు తదితరాలు పరిశీలించిన కోర్టు 46 డ్రైవింగ్‌ లైసెన్సులను పూర్తిగా రద్దు చేయగా... ఒకరిది ఐదేళ్ళు, 14 మందివి మూడేళ్ళు, 46 మందివి రెండేళ్ళు, 88  మందివి ఏడాది, ఒకరిది తొమ్మిది నెలలు, 22 మందివి ఆరు నెలలు, 257 మందివి మూడు నెలల పాటు సస్పెండ్‌ చేసినట్లు అనిల్‌కుమార్‌ పేర్కొన్నారు. జైలుకు వెళ్ళిన మిగిలిన మందుబాబుల్లో ఒకరికి 20 రోజులు, ముగ్గురికి 15 రోజులు, నలుగురికి 11 రోజులు, 16 మందికి 10 రోజులు, ఒకరికి తొమ్మిది రోజులు, మరొకరికి ఎనిమిది రోజులు, 19 మందికి వారం, 28 మందికి ఆరు రోజులు, 89 మందికి ఐదు రోజులు, 88 మందికి నాలుగు రోజులు, 197 మందికి మూడు రోజులు, 653 మందికి రెండు రోజుల చొప్పున జైలు శిక్షలు విధించిందన్నారు.

డ్రంక్‌ డ్రైవింగ్‌తో పాటు మరో ఐదు రకాలైన ఉల్లంఘనల్నీ తీవ్రంగా పరిగణిస్తూ చార్జ్‌షీట్లు వేస్తున్నామన్నారు. వీటిని పరిగణలోకి తీసుకున్న న్యాయస్థానాలు మైనర్‌ డ్రైవింగ్‌ కేసులో ఒకరికి నెల రోజులు,  తొమ్మిది మందికి ఒకరోజు, డ్రైవింగ్‌ లైసెన్స్‌ లేకుండా వాహనం నడపటం నేరంపై 63 మందికి ఒకరోజు, 14 మందికి రెండు రోజులు, భారీ స్థాయిలో ఈ–చలాన్లు పెండింగ్‌లో ఉన్న 10 మందికి ఒక రోజు, 15 మందికి రెండు రోజులు, సెల్‌ఫోన్‌ డ్రైవింగ్‌ చేస్తూ చిక్కిన 21 మందికి ఒక రోజు, 28 మందికి రెండు రోజులు, డేంజరస్‌ డ్రైవింగ్‌ చేస్తూ చిక్కిన 9 మందికి ఒకరోజు, ఒకరికి రెండు రోజులు చొప్పున జైలు శిక్షలు పడ్డాయని ట్రాఫిక్‌ చీఫ్‌ పేర్కొన్నారు. వీరిని న్యాయస్థానం ఆదేశాల మేరకు చంచల్‌గూడ జైలుకు తరలించినట్లు తెలిపారు. ఇలాంటి ఉల్లంఘనులకు ట్రాఫిక్‌ ట్రైనింగ్‌ ఇన్‌స్టిట్యూట్స్‌లో కౌన్సిలింగ్స్‌ ఇస్తున్నామని, జైలు శిక్షలు పడిన వారికి భవిష్యత్తులో పాస్‌పోర్ట్స్, వీసాలు, ఉద్యోగాలు రావడంలో అడ్డంకులు ఎదురు కావచ్చని ఆయన హెచ్చరించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement