మొన్న తల్లి.. నిన్న కూతురు

daughter dead in NIMS this month 17th mother dead in auto accident - Sakshi

ఏడుకు చేరిన‘ఆటో’ ప్రమాద మృతులు

నిమ్స్‌లో చికిత్స పొందుతూ ఒకరి మృతి

రూ.97వేలు చెల్లించాల్సిందేనన్న వైద్యులు

ఎమ్మెల్యే, మంత్రి ఆదేశాలతో మృతదేహం అప్పగింత

కరీంనగర్‌రూరల్‌: ఈనెల 17న ఆటోలో కూలీ పనులకు వెళ్తుండగా.. కరీంనగర్‌ శివారు మల్కాపూర్‌ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో చనిపోయిన వారి సంఖ్య ఏడుకు చేరింది. ఆ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన కరీంనగర్‌ మండలం చామన్‌పల్లికి చెందిన మేకల అనూష(20) హైదరాబాద్‌లోని నిమ్స్‌లో చికిత్స పొందుతూ మంగళవారం అర్ధరాత్రి మృతిచెందినట్లు కుటుంబసభ్యుల తెలిపారు. ఆటోలో పత్తి ఏరేందుకు వెళ్తుండగా జరిగిన ఆ ప్రమాదంలో కూలీలు మేకల దేవమ్మ, లలిత, సాయిలీ ల, లావణ్య, కూనరాజుల ఓదెమ్మ, ఆటోడ్రైవర్‌ వెంకటమాధవరావు మృతిచెందిన విషయం తెల్సిందే. గాయపడిన పదిమందిని అపోలోరీచ్‌ ఆస్పత్రిలో చేర్పించారు. అనూష కాలు విరగడంతో ఆమెను ఈనెల 18న హైదరాబాద్‌లోని నిమ్స్‌ ఆస్పత్రికి తరలించారు. ఆరోగ్యం విషమించడంతో మృతిచెందింది. ప్రమాద సమయంలో చనిపోయిన మేకల దేవమ్మ కూతురే ఈ అనూష. మొన్న తల్లి.. నిన్న కూతురు చనిపోవడంతో కుటుంబసభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.

రూ.97వేలు చెల్లించాలని వైద్యుల డిమాండ్‌
ఆస్పత్రికి తరలించిన అనూషకు శస్త్రచికిత్స చేసేందుకు ఆమె తండ్రి లచ్చయ్య రూ.60వేల వరకు చెల్లించాడు. ఇంకా రూ.97వేలు చెల్లించాక మృతదేహాన్ని తీసుకెళ్లాలని ఆస్పత్రి సిబ్బంది కరాఖండీగా చెప్పడంతో కుటుంబసభ్యులు ఆందోళన గురయ్యారు. ఇప్పటికే చనిపోయిన భార్య లలిత.. తాజాగా కూతురు అనూష మరణంతో లచ్చయ్య దిక్కుతోచని స్థితిలో పడిపోయాడు. అనూష చనిపోయిన విషయం తెలుసుకున్న మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ బుధవారం గ్రామానికి చేరుకున్నారు. కలెక్టర్,  నిమ్స్‌ డైరెక్టర్‌తో ఫోన్‌లో మాట్లాడారు. స్ధానిక టీఆర్‌ఎస్‌ నాయకులు స్పందించి ఎమ్మెల్యే గంగులకు వివరించారు. ఆయన మంత్రి రాజేందర్‌ దృష్టికి తీసుకెళ్లగా మంత్రి నిమ్స్‌ డైరెక్టర్‌తో మాట్లాడి ప్రభుత్వపరంగా బిల్లు చెల్లిస్తామని చెప్పారు. అనూష మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కరీంనగర్‌కు తీసుకొచ్చారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top