కీచక కానిస్టేబుల్‌..

Constable molested colleague wife - Sakshi

భర్త రాకతో పరారయ్యే ప్రయత్నంలో కోట్లాట

చిలకలపూడి పీఎస్‌లో కేసు నమోదు

కోనేరుసెంటర్‌(మచిలీపట్నం): భర్త విధులకు వెళ్లడంతో ఇంట్లో ఒంటరిగా ఉన్న ఓ కానిస్టేబుల్‌ భార్యపై మరో కానిస్టేబుల్‌ లైంగికదాడికి యత్నించాడు. అదే సమయంలో డ్యూటీ నుంచి ఇంటికి వచ్చిన ఆమె భర్త ఆ దారుణాన్ని అడ్డుకుని అతన్ని పట్టుకునేందుకు ప్రయత్నించడంతో ఇరువురి మధ్య ఘర్షణ జరిగింది. తోటి ఉద్యోగులు వీరిని విడదీసి గొడవను సర్దుబాటు చేశారు. ఒక రోజు ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన కృష్ణా జిల్లా పోలీసు సూపరింటెండెంట్‌ కార్యాలయానికి కూతవేటు దూరంలో ఉన్న పోలీస్‌ క్వార్టర్స్‌లో చోటుచేసుకుంది. కృష్ణాజిల్లా ఆర్మ్‌డ్‌ రిజర్వు విభాగంలో బాగావతు బాలాజీ నాయక్, ఎల్లయ్య కానిస్టేబుళ్లుగా పనిచేస్తున్నారు. బాలాజీ నాయక్‌ స్క్వాడ్‌ టీంలో పనిచేస్తుండగా, ఎల్లయ్య పోలీస్‌ క్యాంటీన్‌లో పనిచేస్తున్నాడు.

ఇరువురూ పోలీస్‌క్వార్టర్స్‌లోని యూ బ్లాక్‌లో ఎదురెదురు ప్లాట్‌లలో ఉంటున్నారు. గురువారం బాలాజీ నాయక్‌ డ్యూటీకి వెళ్లిపోగా మధ్యాహ్నం అతని భార్య ఒంటరిగా ఉండటాన్ని గమనించిన ఎల్లయ్య ఇంట్లోకి చొరబడ్డాడు. తన కోరిక తీర్చమంటూ ఆమెపై ఒత్తిడి తెచ్చాడు. అందుకు ఆమె అంగీకరించకపోవటంతో బలవంతంగా లొంగదీసుకునేందుకు ప్రయత్నించాడు. అదే సమయంలో డ్యూటీ నుంచి ఇంటికి వచ్చిన బాలాజీ నాయక్‌ తన భార్యతో ఎల్లయ్య అసభ్యంగా ప్రవర్తించటాన్ని చూసి అతన్ని పట్టుకునేందుకు ప్రయత్నించాడు. ప్రతిఘటించిన ఎల్లయ్య పారిపోవడానికి ప్రయత్నించడంతో ఇరువురి మధ్య కోట్లాట జరిగింది. జరిగిన దారుణంపై బాధితురాలు గురువారం చిలకలపూడి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఎల్లయ్య తనపై లైంగికదాడికి ప్రయత్నించాడంటూ ఫిర్యాదులో పేర్కొంది. కేసు నమోదు చేసిన పోలీసులు శుక్రవారం ఎల్లయ్యను అరెస్ట్‌ చేసి కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top