సీబీఐ డీఎస్పీ అరెస్ట్‌

CBI arrests its deputy SP in bribery case involving special director Rakesh Asthana - Sakshi

సతీశ్‌ సనా కేసులో వాంగ్మూలాన్ని ఫోర్జరీ చేశారని ఆరోపణ

సీఎం రమేశ్‌ పాత్రపై అనుమానాలు  

న్యూఢిల్లీ: సీబీఐలో డీఎస్పీగా పనిచేస్తున్న దేవేంద్ర కుమార్‌ను వ్యాపారవేత్త సతీశ్‌ సానాకు సంబంధించిన అవినీతి కేసులో అరెస్టు చేశామని సీబీఐ అధికారులు సోమవారం చెప్పారు. మాంసం వ్యాపారి మొయిన్‌ ఖురేషీకి సంబంధించిన కేసులో సతీశ్‌ విచారణను ఎదుర్కొంటున్నారు. కాగా, శని, ఆదివారాల్లో దేవేంద్ర కుమార్‌ కార్యాలయంలో, ఇంట్లో తనిఖీలు చేసి కొన్ని ఫోన్లు, ఐపాడ్‌ను స్వాధీనం చేసుకున్నామనీ, వాటిలోని సమాచారాన్ని ప్రస్తుతం పరిశీలిస్తున్నామని అధికారులు వెల్లడించారు. ఇదే అవినీతి కేసులోనే సీబీఐ స్పెషల్‌ డైరెక్టర్‌ రాకేశ్‌ ఆస్తానాపై కూడా ఇప్పటికే కేసు నమోదైన విషయం ఆదివారం వెలుగులోకి రావడం తెలిసిందే. మరోవైపు సీబీఐ డైరెక్టర్‌ అలోక్‌ వర్మ, ఆస్తానాలు పరస్పరం అవినీతి ఆరోపణలు చేసుకుంటుండటంతో వారికి ప్రధాన మంత్రి కార్యాలయం నోటీసులు పంపింది. ఆదివారమే అలోక్‌ వర్మ పీఎంవోలోని సీనియర్‌ అధికారులను కలిశారు. సతీశ్‌ నిందితుడిగా ఉన్న కేసును ఆస్తానా నేతృత్వంలోని సీబీఐ బృందం విచారిస్తుండగా, ఆ బృందంలో దేవేంద్ర ఒకరు. సతీశ్‌ నుంచి ఆస్తానా రూ. 5 కోట్ల లంచాన్ని మనోజ్‌ ప్రసాద్‌ అనే మధ్యవర్తి ద్వారా తీసుకుని సతీశ్‌కు అనుకూలంగా విచారణను ప్రభావితం చేశారనేది ఆస్తానాపై ప్రధాన ఆరోపణ. ఈ కేసులో సతీశ్‌ వాంగ్మూలాన్ని నమోదు చేయడంలో దేవేంద్ర ఫోర్జరీకి పాల్పడ్డారనే ఆరోపణలపై ఆయనను సీబీఐ అరెస్టు చేసింది. గత నెల 26న సతీశ్‌ వాంగ్మూలాన్ని నమోదు చేసినట్లు ఆస్తానా బృందం చెబుతోందనీ, అయితే ఆ రోజున సతీశ్‌ హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో ఉన్నట్లు తమ విచారణలో తెలిసింది కాబట్టి వాంగ్మూలాన్ని ఫోర్జరీ చేశారని తేలిందని సీబీఐ అధికారులు చెప్పారు.

సీఎం రమేశ్‌తో మాట్లాడారా?
తెలుగుదేశం పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుడు, తన పాత మిత్రుడు సీఎం రమేశ్‌తో ఈ ఏడాది జూన్‌లో తాను మాట్లాడానని సతీశ్‌ పేర్కొనట్లు దేవేంద్రకు ఇచ్చిన వాంగ్మూలంలో ఉంది. ‘‘నాపై ఉన్న కేసుకు సంబంధించి సీఎం రమేశ్‌తో నేను మాట్లాడాను. సీబీఐ డైరెక్టర్‌ అలోక్‌ వర్మతో తాను మాట్లాడతానని రమేశ్‌ నాకు అభయమిచ్చారు. ఆ తర్వాత కలిసినప్పుడు సీబీఐ డైరెక్టర్‌ను వ్యక్తిగతంగా కలిసి మాట్లాడాననీ, ఇకపై సీబీఐ నన్ను విచారణకు పిలవదని రమేశ్‌ భరోసా ఇచ్చారు. ఆ తర్వాత జూన్‌ నుంచి నన్ను సీబీఐ పిలవలేదు. దీంతో నాపై విచారణ ముగిసిందని నేను అనుకున్నా’ అని సతీశ్‌ దేవేంద్రకు ఇచ్చిన వాంగ్మూలంలో ఉన్నట్లు సీబీఐ అధికారులు చెబుతున్నారు. అయితే అలోక్‌ వర్మపై ఆస్తానా సీవీసీ వద్ద చేసిన ఆరోపణలను బలపరిచేందుకే సతీశ్‌ వాంగ్మూలాన్ని దేవేంద్ర ఇలా ఫోర్జరీ చేశారని సీబీఐ ఆరోపిస్తోంది. ఆస్తానా బృందంలోని ఇతర సభ్యులపై కూడా విచారణ జరుపుతున్నట్లు సీబీఐ చెప్పింది. సతీశ్‌ నుంచి అలోక్‌ వర్మ రూ. 2 కోట్ల లంచం తీసుకున్నారని ఈ ఏడాది ఆగస్టు 24నే ఆస్తానా ఆరోపించారు. పూర్తి వివరాలు విచారణలోనే తెలియాల్సి ఉంది.

అసలు ఏమిటీ కేసు?
మొయిన్‌ ఖురేషీ డెహ్రాడూన్‌లోని డూన్‌ స్కూల్‌ విద్యార్థి. ఆ తరువాత యూపీలో మాంసం ఎగుమతి వ్యాపారాన్ని ప్రారంభించి అంచలంచెలుగా ఎదిగాడు. అనేక ఇతర రంగాల్లో వ్యాపారాలు ప్రారంభించాడు. ఆయనపై పన్ను ఎగవేతలు, హవాలా కార్యకలాపాలు తదితర కేసులున్నాయి. వాటిపై పలు కేసులను సీబీఐ విచారిస్తోంది. దేశం నుంచి రూ. 200 కోట్లను అక్రమంగా దేశం నుంచి తరలించారనే కేసును ఈడీ విచారణ జరుపుతోంది. ఈ విచారణల్లో భాగంగా జరిపిన సోదాల్లో ఖురేషీకి సంబంధించిన మరిన్ని అక్రమాలు, సహచరుల వివరాలు వెలుగులోకి వచ్చాయి. ఖురేషీ తనకున్న పరిచయాలతో సీబీఐ కేసుల నుంచి తప్పిస్తానంటూ పలువురు నిందితుల నుంచి భారీగా డబ్బులు తీసుకునేవాడు. దీనికి సంబంధించి కూడా ఆయనపై ఓ కేసు విచారణలో ఉంది. అలా ఖురేషీకి సంబంధించిన  కేసులో ఒక నిందితుడు హైదరాబాద్‌కు చెందిన వ్యాపారవేత్త సానా సతీశ్‌. కేసు నుంచి తప్పించేందుకు సీబీఐ డైరెక్టర్‌ అస్తానాకు ఇవ్వాలని చెప్పి తన వద్ద ఖురేషీ రూ. 3 కోట్లు తీసుకున్నాడని మెజిస్ట్రేట్‌ కోర్టులో సతీశ్‌ వాంగ్మూలం ఇచ్చాడు. ఆ వాంగ్మూలంలో సీబీఐ స్పెషల్‌ డైరెక్టర్‌ రాకేశ్‌ ఆస్తానా, దుబాయ్‌కు చెందిన వ్యాపారవేత్త మనోజ్‌ ప్రసాద్, అతని సోదరుడు సోమేశ్‌ల పేర్లను సతీష్‌ ప్రస్తావించారు. ఈ వాంగ్మూలమే ఆస్తానాపై కేసు నమోదుకు ప్రాతిపదికగా మారింది.

ఎఫ్‌ఐఆర్‌లో ఏముంది?
సతీశ్‌ వాంగ్మూలం, ఫిర్యాదుల ఆధారంగానే ఆస్తానాపై కేసు నమోదైంది. ఈ ఎఫ్‌ఐఆర్‌లో ఉన్న వివరాల ప్రకారం.. ‘మధ్యవర్తులు మనోజ్, సోమేశ్‌లు దుబాయ్‌లో సతీశ్‌ను కలుసుకున్నారు. సీబీఐ కీలక అధికారి సహాయంతో సతీశ్‌ కేసును సెటిల్‌ చేస్తామని వారు హామీ ఇచ్చారు. సీబీఐ స్పెషల్‌ డైరెక్టర్‌ ఆస్తానాకు సోమేశ్‌ ఫోన్‌ చేసి సతీశ్‌తో మాట్లాడించారు. రూ. 5 కోట్లు ఇస్తే కేసును సెటిల్‌ చేస్తాననీ, 3 కోట్లు అడ్వాన్సుగా ఇవ్వాలని ఆస్తానా డిమాండ్‌ చేశారు. దీంతో మనోజ్‌కు దుబాయ్‌లోనే సతీశ్‌ కోటి రూపాయలు ఇచ్చాడు. తర్వాత సునీల్‌ మిత్తల్‌కు ఢిల్లీలో రూ.1.95 కోట్లు ఇచ్చాడు. అయినా, ఈ ఏడాది ఫిబ్రవరిలో సీబీఐ నుంచి సతీశ్‌కు నోటీసులు వచ్చాయి. దీంతో సతీష్‌ మనోజ్‌ను కలిసి డబ్బలిచ్చినా నోటీసులెందుకు వచ్చాయని నిలదీశాడు. మిగతా రూ. 2.05 కోట్లు కూడా ఇస్తే నోటీసు మాఫీ చేయిస్తానని మనోజ్‌ చెప్పాడు. అక్టోబర్‌ 9న 2 కోట్లు ఇస్తానని సతీశ్‌ హామీ ఇచ్చాడు. అనారోగ్యం వల్ల విచారణకు హాజరు కాలేకపోతున్నట్టు సతీష్‌ సీబీఐకి మెయిల్‌ పంపాడు. ఆ తర్వాత సీబీఐ నుంచి సతీష్‌కు ఎలాంటి సందేశాలూ రాలేదు. అక్టోబర్‌ 10న రూ. 25 లక్షలను సతీశ్‌ మనోజ్‌కు ఇచ్చాడు. మిగతా సొమ్మును అక్టోబర్‌ 16న ఇవ్వాల్సి ఉండగా తీసుకునేందుకు మనోజ్‌ భారత్‌ వచ్చి అరెస్టయ్యాడు’. ఈ ఎఫ్‌ఐఆర్‌ ఆధారంగానే ఆస్తానాపై సీబీఐ కేసు నమోదు చేసింది.

మోదీకి ఇష్టుడు ఆస్తానా
ప్రధాని ఏరికోరి మరీ ఆస్తానాను సీబీఐ స్పెషల్‌ డైరెక్టర్‌గా నియమించారు. 1984 గుజరాత్‌ ఐపీఎస్‌ కేడర్‌కు చెందిన ఆస్తానా అంతకు ముందు సీబీఐ అదనపు డైరెక్టర్‌గా పని చేశారు. గోధ్రా రైలు దహనం కేసులో సిట్‌కు నాయకత్వం వహించారు. యూపీఏ హయాంలో జరిగిన ఐఎన్‌ఎక్స్‌ మీడియా, ఎయిర్‌సెల్‌ మాక్సిస్‌ తదితర కుంభకోణాల దర్యాప్తు కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందానికి ఆస్తానా అధిపతిగా వ్యవహరించారు. అలోక్‌ వర్మ తన ఎదుగుదలకు అడ్డుగా నిలుస్తున్నారని భావించిన ఆస్తానా ఆయనపై పలు ఆరోపణలు చేశారు. ఖురేషీ కేసులో అలోక్‌ వర్మ లంచం తీసుకున్నారని కూడా ఆరోపించారు. అలోక్‌ వర్మపై 10 అవినీతి ఆరోపణలతో కేబినెట్‌ కార్యదర్శికి లేఖ కూడా రాశారు. ఆయన ఈ వ్యవహరాన్ని విజిలెన్స్‌ కమిషన్‌కు అప్పగించారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top