ఖరీదైన బైక్‌లపై కన్ను

Bike Robbery Gang Held in YSR Kadapa - Sakshi

నలుగురు దొంగలు అరెస్టు

రూ.12లక్షలు విలువ చేసే వాహనాలు స్వాధీనం

వివరాలు వెల్లడించిన డీఎస్పీ విజయ్‌కుమార్‌  

దువ్వూరు : వ్యసనాలకు లోనైన ఓ నలుగురు యువకులు ఖరీదైన బైక్‌లపై కన్నేసి వాటిని దొంగలించి అమ్ముకుని జల్సాలకు పాల్పడేవారు. అయితే వారి ఆటలు సాగలేదు. పోలీసులు ఆ నలుగురిని పట్టుకున్నారు. ఈ వివరాలను దువ్వూరు పోలీస్‌స్టేషన్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మైదుకూరు డీఎస్పీ విజయ్‌కుమార్‌ వెల్లడించారు. దువ్వూరు మండల పరిధిలోని ఏకోపల్లె గ్రామం వద్ద బుధవారం ఉదయం ఎస్‌ఐ కుళ్లాయప్ప వాహనాలను తనిఖీ చేస్తున్నారు. చాగలమర్రి వైపు నుంచి దువ్వూరు వైపుకు రెండు ద్విచక్రవాహనాల్లో నలుగురు యువకులు పోలీసుల తనిఖీని చూసి వెనుదిరిగి వేగంగా వెళుతుండగా ఎస్‌ఐకి అనుమానం వచ్చి వెంబడించి వారిని పట్టుకున్నారు.

దువ్వూరు మండలం ఇడమడక గ్రామానికి చెందిన భీమునిపాటి మహ్మద్‌బాషా, కర్నూలు జిల్లా చాగలమర్రి మండలానికి చెందిన పెనుకొండ ఫకృద్దీన్, కొత్తపల్లె రమేష్, రాజుపాళెం మండలం గోపాయపల్లె గ్రామానికి చెందిన సంజీవరాయుడులుగా వారిని గుర్తించారు. ఏకోపల్లె గ్రామ పెద్దమనుషుల సమక్షంలో పోలీసులు వారిని విచారించగా రెండు బైక్‌లను చోరీ చేశామని ఒప్పుకున్నారు. వారిని పోలీస్‌స్టేషన్‌కు తీసుకొచ్చి విచారించగా రెండు బైక్‌లతోపాటు మరో 10 బైక్‌లను చోరీ చేసినట్లు విచారణలో వెల్లడైంది. దువ్వూరు, ఎర్రగుంట్ల, జమ్మలమడుగు, మైదుకూరు, పెండ్లిమర్రి మండలంలోని పొలతలు, చాగలమర్రి, కృష్ణంపల్లె ఉరుసులో ఈ బైక్‌లను దొంగలించామని వారు చెప్పారు. 10 మోటార్‌ బైక్‌లను రాజుపాళెం మండలం గోపాయల్లె వద్ద స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. వీటి విలువ రూ.12 లక్షలు ఉంటుందని డీఎస్పీ పేర్కొన్నారు. వీరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. సమావేశంలో రూరల్‌సీఐ టీవీ కొండారెడ్డి, దువ్వూరు ఎస్‌ఐ కుళ్లాయప్ప, పీఎస్‌ఐ నరసింహుడు, పోలీసులు పాల్గొన్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top