రావిళ్లవారిపల్లెలో.. మిన్నంటిన సంక్రాంతి సంబరాలు

ys jagan celebrate sankranti festival in ravilla vari palli - Sakshi

తరలివచ్చిన అభిమానులు, పార్టీ శ్రేణులు

సంప్రదాయ దుస్తుల్లో ఆకట్టుకున్న జననేత

పుంగనూరు గోవును

బహూకరించిన ఎమ్మెల్యే చెవిరెడ్డి

తిరుపతి రూరల్‌ : చంద్రగిరి నియోజకవర్గం రావిళ్లవారిపల్లెలో సోమవారం వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సంక్రాంతి సంబరాలను ఘనంగా నిర్వహించారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా రావిళ్లవారిపల్లెలో రెండు రోజుల పాటు బసచేసిన ఆయన సంక్రాంతి పర్వదినం సందర్భంగా పాదయాత్రకు సోమవారం విరామం ఇచ్చారు. సంప్రదాయ దుస్తుల్లో వచ్చి.. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.

ఉట్టిపడిన పండుగ వాతావరణం
తమ దగ్గర పెద్ద పండుగ జరుపుకునేందుకు అనుకోని అతిథిగా విచ్చేసిన జగన్‌మోహన్‌రెడ్డికి శుభకాంక్షలు తెలిపేందుకు భారీ సంఖ్యలో కార్యకర్తలు, అభిమానులు ఆయన బస చేసిన ప్రదేశానికి సోమవారం ఉదయమే చేరుకున్నారు. చంద్రగిరి ఎమ్మెల్యే డాక్టర్‌ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఆధ్వర్యంలో జననేత బసచేసిన ప్రదేశంలో సంక్రాంతి పండుగ వాతావరణం ఉట్టిపడేలా భారీ ఏర్పాట్లు చేశారు. గంగిరెద్దుల విన్యాసాలు, ఎద్దుల బండి, ఇల్లు, గొబ్బెమ్మలు, హరిదాసు గానం, గొబ్బెమ్మలు తడుతూ.. పాటలు పాడడం, ఉట్టి కొట్టడం, రంగవల్లుల వంటి సంప్రదాయ ఏర్పాట్లు చేపట్టారు. బసచేసిన ప్రదేశం నిండా  బెలూన్లతో ముస్తాబు చేశారు. సంప్రదాయ దుస్తుల్లో వచ్చిన జగన్‌మోహన్‌రెడ్డి అందరికీ అభివాదం చేస్తూ శుభాకాంక్షలు తెలిపారు. 

పెద్దలకు దుస్తులు..
సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పెద్దలకు సంప్రదాయబద్ధంగా బట్టలు పెట్టారు. అంతకుముందు ప్రాం గణంలో ఏర్పాటుచేసిన దివంగత నేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులులర్పించారు. కార్యక్రమంలో వైఎస్‌ఆర్‌ సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్‌ విజయమ్మ, పార్టీ రాష్ట్ర ప్రధానకార్యదర్శులు విజయసాయి రెడ్డి, భూమన కరుణాకరరెడ్డి, ఎంపీ మిథున్‌రెడ్డి, మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు, నగరి ఎమ్మెల్యే ఆర్‌కే రోజా, శాసనసభ్యులు నారాయణ స్వామి, డాక్టర్‌  సునీల్‌కుమార్, చిత్తూరు పార్లమెంట్‌ జిల్లా అధ్యక్షులు జంగాలపల్లి శ్రీనివా సులు, సమన్వయకర్తలు బియ్యపు మధుసూదన్‌ రెడ్డి, ఆదిమూలం తదితరులు పాల్గొన్నారు.

చంద్రగిరి నియోజకవర్గంలో జగన్‌కు ఘనవీడ్కోలు
చంద్రగిరి నియోజకవర్గంలో ఏడు రోజుల పాటు పాదయాత్ర చేసిన వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు జగన్‌మోహన్‌రెడ్డికి మంగళవారం వైఎస్సార్‌ సేవాదళ్‌ రాష్ట్ర అధ్యక్షుడు, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఆధ్వర్యంలో ఘన వీడ్కోలు పలికారు. రామచంద్రాపురం మండలం రావిళ్లవారిపల్లెలో మంగళవారం ఉదయం ప్రారంభమైన యాత్ర నియోజకవర్గంలో అర కిలోమీటరు మేర సాగి, నగరి నియోజకవర్గంలోని పత్తిపుత్తూరుకు చేరుకుంది. ఈసందర్భంగా దాదాపు రెండు టన్నుల పూలను  జగన్‌పై వర్షంగా కురిపించారు. మంగళవాయిద్యాలు, కళాబృందాలతో వీడ్కోలు పలికారు. పెద్దఎత్తున బాణసంచా కాల్చారు. అరటిబోదెలు, మామిడి తోరణాలను రోడ్డుకిరువైపులా అలంకరించారు.

పుంగనూరు గోవు బహూకరణ
సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని వైఎస్సార్‌ సేవాదళ్‌ రాష్ట్ర అధ్యక్షుడు, చంద్రగిరి ఎమ్మెల్యే డాక్టర్‌ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి అభిమాన నాయకుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి పుంగనూరు గోవును బహూకరించారు. ఆ గోవు విశిష్టతను ఆయనకు వివరించారు.

Read latest Chittoor News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top