బీమా టర్మ్ ప్లాన్ ఎంపిక ఎలా? | Sakshi
Sakshi News home page

బీమా టర్మ్ ప్లాన్ ఎంపిక ఎలా?

Published Mon, Apr 11 2016 12:46 AM

బీమా టర్మ్ ప్లాన్ ఎంపిక ఎలా?

నేను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ)లో ఒక పబ్లిక్ ప్రావిడెండ్ ఫండ్(పీపీఎఫ్) ను 1985లో ప్రారంభించాను. ఈ ఖాతా మెచ్యూర్ అయినప్పటికీ, గత ఆర్థిక సంవత్సరం చివరి వరకూ ఈ ఖాతాలో ఇన్వెస్ట్ చేస్తూ వచ్చాను. ఇప్పుడు నేను ఈ ఖాతాను క్లోజ్ చేసి. నా ఇన్వెస్ట్‌మెంట్స్ అన్నింటీని తీసేసుకోవచ్చా?
- పారిజాత, హైదరాబాద్

 
ప్రజా భవిష్య నిధి(పీపీఎఫ్) ఖాతా 15 ఆర్థిక సంవత్సరాలు పూర్తయిన తర్వాత మెచ్యూర్ అవుతుంది. ఈ ఖాతా మెచ్యూర్ అయిన తర్వాత ఐదేళ్ల పాటు పొడిగించుకోవచ్చు. ఇలా ఎన్ని సార్లైనా చేసుకోవచ్చు. మీరు 1985లో ఖాతా ప్రారంభించారు కాబట్టి, మీ ఖాతా 2001లో మెచ్యూర్ అవుతుంది. మూడుసార్లు పొడిగించిన పిదప మీ ఖాతా 2016 మే తర్వాత మెచ్యూర్ అవుతుంది. మరో ఐదేళ్లు పొడిగించుకోవాలనుకుంటే పొడిగించుకోవచ్చు. లేదా ఈ ఖాతాలో ఇప్పటి వరకూ జమ చేసిన మొత్తాన్ని విత్‌డ్రా చేసుకొని మీ ఆర్థిక అవసరాలకు వినియోగించుకోండి.
 
ఈ ఆర్థిక సంవత్సరం నుంచి ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్(ఈఎల్‌ఎస్‌ఎస్)ల్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను. మంచి పనితీరు కనబరుస్తున్న ఈఎల్‌ఎస్‌ఎ్‌స్ ఫండ్స్‌ను సూచించండి. ఈ ఫండ్స్ లాక్-ఇన్-పీరియడ్ పూర్తయిన తర్వాత ఇన్వెస్ట్‌మెంట్స్‌ను కొనసాగించమంటారా ? లేకుంటే వేరే కొత్త ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయమంటారా?
- నిరంజన్, కరీంనగర్


ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్(ఈఎల్‌ఎస్‌ఎస్)లో లేదా పన్ను ఆదా మ్యూచువల్ ఫండ్స్‌లో  ఇన్వెస్ట్  చేస్తే, ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 80 సీ  ప్రకారం ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.1.5 లక్షల వరకూ పన్ను తగ్గింపులు పొందవచ్చు. ఈఎల్‌ఎస్‌ఎస్‌లకు లాక్-ఇన్ పీరియడ్ మూడేళ్లుగా ఉంటుంది. లాక్-ఇన్-పీరియడ్ పూర్తయిన తర్వాత ఈఎల్‌ఎస్‌ఎస్ యూనిట్లను విక్రయించాల్సిన అవసరం లేదు.

ఈ ఫండ్స్ మంచి పనితీరు కనబరుస్తున్నంత కాలం మీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను ఈ ఫండ్స్‌లో కొనసాగించవచ్చు. మీరు ఇన్వెస్ట్ చేయడానికి... యాక్సిస్ లాంగ్‌టర్మ్ ఈక్విటీ ఫండ్, బిర్లా సన్‌లైఫ్ ట్యాక్స్‌ప్లాన్-డెరైక్ట్ ప్లాన్, బీఎన్‌పీ పారిబా  లాంగ్‌టర్మ్ ఈక్విటీ, ఫ్రాంక్లిన్ ఇండియా ట్యాక్స్ షీల్డ్ ఫండ్-డెరైక్ట్ ప్లాన్, రెలిగేర్ ఇన్వెస్కో ట్యాక్స్ ప్లాన్-డెరైక్ట్ ప్లాన్ వంటి ఈఎల్‌ఎస్‌ఎస్ ఫండ్స్‌ను పరిశీలించవచ్చు.
 
నేనొక ప్రభుత్వ ఉద్యోగిని. నా వయస్సు 27 సంవత్సరాలు. నేను ఒక టర్మ్ ప్లాన్‌ను తీసుకోవాలనుకుంటున్నాను. సరైన టర్మ్ ప్లాన్‌ను ఎలా ఎంచుకోవాలి?
- జాన్సన్, గుంటూరు

 
బీమా కంపెనీ క్లయిమ్ సెటిల్మెంట్ నిష్పత్తిని పరిగణనలోకి తీసుకొని టర్మ్ ప్లాన్లను ఎంచుకోవాలి. చెల్లించాల్సిన ప్రీమియమ్‌లను కూడా పరిగణనలోకి తీసుకోవాలి. ఈ రెండు అంశాలు ఆధారంగా మీకు కొన్ని టర్మ్ పాలసీలను సూచిస్తున్నాం. ఏగాన్ రెలిగేర్ ఐటర్మ్ ప్లాన్, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ క్లిక్2ప్రొటెక్ట్, మ్యాక్స్ లైఫ్ ఆన్‌లైన్ టర్మ్ ప్లాన్, అవైవా ఐ-లైఫ్ టర్మ్ ప్లాన్.. ఈ సంస్థలన్నీ ఆన్‌లైన్ టర్మ్ ప్లాన్‌లను ఆఫర్ చేస్తున్నాయి. మామూలు బీమా పాలసీలతో పోల్చితే ఆన్‌లైన్ టర్మ్ పాలసీల ప్రీమియమ్‌లు 30 శాతం నుంచి 50 శాతం వరకూ తక్కువగా ఉంటుంది.

ఈ పాలసీలకు మీ వయస్సును బట్టి ఎంత ప్రీమియమ్ చెల్లించాలో లెక్కేసి, మీ బడ్జెట్‌కు అనుగుణంగా తగిన పాలసీని ఎంచుకోండి. మీపై ఆర్థికంగా ఆధారపడి ఉన్న వారి అవసరాలను దృష్టిలో ఉంచుకొని తగిన జీవిత బీమా కవర్‌ను తీసుకోవాలి. ఒక బండ సూత్రం ఏమిటంటే, మీ పదేళ్ల ఆదాయానికి సమానమైన బీమా కవర్‌ను తీసుకోవడం. దీంతో పాటు కొన్ని అంశాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలి. మీకు సొంత ఇల్లు ఉందా? లేక మరేదైనా ఆస్తులున్నాయా? అప్పులేమైనా ఉన్నాయా? మీ జీవిత భాగస్వామి, లేదా మీ కుటుంబంలో మరెవరైనా ఆదాయాన్ని ఆర్జిస్తున్నారా? పిల్లల విద్యావసరాలు తదితర అంశాలన్నింటీని  పరిగణనలోకి తీసుకోవాలి.  

సింపుల్‌గా చెప్పాలంటే మీరు లేనప్పుడు మీ కుటుంబం ఆర్థిక అవసరాలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేలా బీమా కవర్ తీసుకోవాలి. ఇక ప్రపోజల్ ఫార్మ్ నింపేటప్పుడు అన్ని వివరాలు సవివరంగా వెల్లడిస్తే, క్లెయిమ్ చేసుకునేటప్పుడు ఎలాంటి ఇబ్బందులు ఉండవు.
 
నాకు ఇటీవలనే పెళ్లయింది. నెలకు రూ.5,000 చొప్పున సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్(సిప్) విధానంలో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను. పన్ను ప్రయోజనాలతో పాటు 10 శాతం రాబడులు ఆశిస్తున్నాను. నా బిడ్డ చదువు కోసం వీటిని వినియోగించుకోవాలనుకుంటున్నాను. తగిన సూచనలివ్వండి.
- మహ్మద్ జాఫర్, విశాఖపట్టణం

 
పన్ను ఆదాతో పాటు రెండంకెల రాబడి కావాలనుకుంటే ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్స్(ఈఎల్‌ఎస్‌ఎస్)లో ఇన్వెస్ట్ చేయాలి. మరే ఇతర సాధనాల్లో చేసే ఇన్వెస్ట్‌మెంట్స్ కన్నా వీటిపైననే అధిక రాబడులు వస్తాయి. అయితే వీటిల్లో దీర్ఘకాలం పాటు(కనీసం ఐదేళ్ల నుంచి ఏడేళ్ల వరకూ) ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. అయితే ఈ స్థాయిలో రాబడులు వస్తాయనే ఈ స్కీమ్‌లు గ్యారంటీనివ్వవు.

రిస్క్ తీసుకోవడం ఇష్టం లేకపోతే, ఐదేళ్ల ట్యాక్స్ సేవింగ్ ఫిక్స్‌డ్ డిపాజిట్, పీపీఎఫ్, తదితర సాధనాల్లో ఇన్వెస్ట్ చేయవచ్చు. మీరు దీర్ఘకాలం పాటు ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారు కాబట్టి ట్యాక్స్ సేవింగ్ స్కీమ్స్‌లో ఇన్వెస్ట్ చేయండి. వీటికి లాక్ ఇన్ పీరియడ్ మూడేళ్లుగా ఉంటుంది. కనీసం ఐదేళ్ల పాటు ఇన్వెస్ట్ చేయగలిగితేనే వీటిని ఎంచుకోండి.
- ధీరేంద్ర కుమార్
సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్

Advertisement
Advertisement