బ్రాండ్ల ప్రచారానికి సోషల్‌ ‘మీడియా’

Social media for brands promotions - Sakshi

వినూత్న ఆలోచనలతో ముందుకెళుతున్న కంపెనీలు

కొత్త కొత్త కార్యక్రమాలకు శ్రీకారం  

సాక్షి, బిజినెస్‌ విభాగం :  పెద్ద పెద్ద బ్రాండ్లు మీడియా నైపుణ్యాలకు పదును పెడుతున్నాయి. సామాజిక మాధ్యమాల్లో దూసుకెళ్తున్నాయి. వినియోగదారులకు చేరువ కావడానికి వినూత్న మార్గాలను అన్వేషిస్తున్నాయి. పదాలను, చిత్రాలను కలిపి ఉపయోగిస్తూ సోషల్‌ మీడియా నెట్‌వర్క్స్‌ను సరికొత్తగా వినియోగించుకుంటున్నాయి.

‘గత కొన్నేళ్లలో సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో గణనీయమైన వృద్ధి నమోదయింది. కంపెనీలు వాటి ఉనికిని చాటుకోవటానికి ఇప్పుడు వీటిని ఉపయోగించుకుంటున్నాయి’ అని డిజైన్‌ఇట్‌ గ్లోబల్‌ స్ట్రాటజిక్‌ డిజైన్‌ డైరెక్టర్‌ పీయుష్‌ అగర్వాల్‌ తెలిపారు.  

బిర్లా ట్రీ ప్లాంటింగ్‌
ప్రపంచ పర్యావరణ దినోత్సవం రోజున ఆదిత్య బిర్లా గ్రూప్‌ సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌ ఫేస్‌బుక్‌లో ‘ప్లాంటబుల్‌ ఫిల్టర్స్‌’ను ప్రవేశపెట్టింది. సోషల్‌ మీడియాలో వాడిన ప్రతి ఫిల్టర్‌కి ఒక మొక్కను నాటుతామని కంపెనీ పేర్కొంది.

డిజిటల్‌ ఏజెన్సీ టోనిక్‌ వరల్డ్‌వైడ్‌ సీఈవో చేతన్‌ ఆషేర్‌ ఫిల్టర్ల గురించి వివరిస్తూ.. ‘ఈ ఫిల్టర్లు ఫోటోలలోని మనుషుల మొహాలను గుర్తుపడతాయి. బార్డర్లు, స్టిక్కర్లు వంటి గ్రాఫిక్స్‌ను సూచిస్తాయి’ అని చెప్పారు. ఆదిత్య బిర్లా గ్రూప్‌ కంపెనీలు అల్ట్రాటెక్‌ సిమెంట్, ఐడియా సెల్యులర్‌ ఒక ఎన్‌జీవోతో కలిసి గత రెండేళ్లలో ఇప్పటికే బెంగళూరులోని మియావాకిలో 9,000 మొక్కలను నాటాయని తెలిపారు.  

జాకీ వినూత్న ప్రచారం
అమెరికాకు చెందిన ఇన్నర్‌వేర్‌ సంస్థ జాకీ.. #KnowsMe  పేరుతో కొత్త ప్రచారానికి తెరతీసింది. అది ప్రత్యేకంగా మహిళల కోసం. దీన్ని పబ్లిసిస్‌ గ్రూప్‌కు చెందిన ఎల్‌ అండ్‌ కే సాచి అండ్‌ సాచి రూపొందించింది. ఉమెన్‌ ఇన్నర్‌వేర్‌ విభాగంలో తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకునేందుకు కంపెనీ ఈ ప్రచారాన్ని ప్రారంభించింది. ఇది ఇన్‌స్టాగ్రామ్, స్నాప్‌చాట్, ఫేస్‌బుక్‌ వంటి సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో చాలా మంది దృష్టిని ఆకర్షించింది.  

టూరిజం ప్రమోషన్‌
ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం కూడా సోషల్‌ మీడియా ప్రాధాన్యాన్ని గుర్తించింది. ఇది పర్యాటకులకు ఢిల్లీ అనువైన గమ్యస్థానమని తెలియజేయడానికి సోషల్‌ మీడియా ఏజెన్సీని నియమించుకోవాలని చూస్తోంది. మధ్యప్రదేశ్, రాజస్తాన్, గుజరాత్‌ రాష్ట్రాల దారిలోనే ఢిల్లీ కూడా పయనిస్తోందని సోషల్‌ మీడియా ఎగ్జిక్యూటివ్స్‌ తెలిపారు. ఈ రాష్ట్రాలు ఇప్పటికే టూరిజం ప్రమోట్‌ చేసుకునేందుకు సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్స్‌ను ఉపయోగిస్తున్నాయి.

నీటి పొదుపు
బ్రాండ్లు, అడ్వటైజర్లు సామాజిక బాధ్యతలో భాగంగా సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్స్‌ను కూడా విరివిగానే ఉపయోగించుకుంటున్నాయి. గోద్రెజ్‌ అప్లయెన్సెస్‌ నీటి పొదుపు కోసం #MyACSavesWater అనే కార్యక్రమానికి తెరతీసింది. దీని వల్ల రోజుకు 5 కోట్ల లీటర్ల నీరు పొదుపు అవుతుందని పేర్కొంది.

ఫేస్‌బుక్, ట్విటర్, యూట్యూబ్‌లలో బ్రాండ్‌లతో సంబంధం లేకుండా ఈ కార్యక్రమం చాలా మంది ఏసీ యూజర్లకు చేరింది. ఈ ప్రచారం వెనుకున్న ఆలోచన సరళమైనదే. ఏసీ 8 గంటలు పనిచేస్తే.. 10 లీటర్ల నీరు వస్తుంది. భారత్‌లో ప్రతి ఏడాది దాదాపు 50 లక్షల ఎయిర్‌కండిషన్‌ యూనిట్లు విక్రయమౌతున్నాయి. అందువల్ల రోజుకు 5 కోట్ల లీటర్ల  మేర నీరు పొదుపు అవుతుందని అంచనా. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top