ఓట్ల వేటలో..కొత్త ‘ట్రెండ్‌’..!    

Political Campaign In Social Media - Sakshi

బరంపురం : ఆధునిక గ్లోబలైజేషన్‌ యుగంలో మారుతున్న కాలానికి అనుగుణంగా రాజకీయ నాయకులు ట్రెండ్‌ మార్చారు. నియోజకవర్గాల్లో తాము చేస్తున్న అభివృద్ధి పనులు అందరికీ తెలిసేలా.. ‘సోషల్‌ మీడియా’ వేదికగా ప్రచారం సాగిస్తున్నారు. రాష్ట్రంలో ప్రధానంగా అధికార పార్టీ బీజేడీ, ప్రతిపక్ష పార్టీలైన బీజేపీ   కాంగ్రెస్‌ పార్టీల నాయకులు ఫేస్‌బుక్, వాట్సాప్‌లను చురుగ్గా వినియోగించుకుంటున్నారు. పార్టీపరంగా చేసిన కార్యక్రమాలు ప్రజలకు తెలిసేలా ఆకర్షణీయమైన ఫొటోలు, వీడియోలను పోస్ట్‌ చేస్తున్నారు. అక్కడితో ఆగకుండా ప్రత్యర్థులపై విమర్శలు, ప్రతి విమర్శలకూ సామాజిక మాధ్యమాలనే వేదికగా చేసుకుంటున్నారు.

ఇది వరలో ఎన్నికలు వచ్చాయంటే గ్రామసభలు, ముఖ్య నాయకులతో ముఖాముఖి సమావేశాలు నిర్వహించేవారు. అయితే ప్రస్తుతం సోషల్‌ మీడియా ప్రవేశంతో ఇటువంటి కార్యక్రమాలకు ప్రాధాన్యం తగ్గుతోంది.  ఈ నేపథ్యంలో రాజకీయ నాయకులు తమ ప్రచార పద్ధతిలో రూట్‌ మార్చారు. పార్టీ ప్రచారాలు, అభివృద్ధి కార్యక్రమాలు, పార్టీ సమావేశాలు ఇలా ఆన్నింటినీ ఎప్పటికప్పుడు సోషల్‌ మీడియాలో అప్‌డేట్‌ చేస్తూ నయా ట్రెండ్‌ను ఫాలో అవుతున్నారు. ప్రతి ఆంశాన్ని రాజకీయంగా మలుచుకునేందుకు సోషల్‌ మీడియాలో వారి  అభిప్రాయాలు తెలుపుతూ అందరి అభిప్రాయాలను సేకరించేందుకు వీటినే వేదికగా మార్చుకుంటున్నారు.

విషయం కొత్తదైనా, పాతదైనా, రాజకీయమైనా, కయ్యమైనా, వియ్యమైనా, ప్రైవేట్‌ విషయమైనా అన్నింటికీ ఇదే అస్త్రాన్ని ప్రయోగిస్తూ రాష్ట్రంలో గల ప్రధాన పార్టీల పేర్లతో ప్రచారం ముమ్మరం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రానున్న 2019 జమిలి ఎన్నికల్లో పై ప్రధాన పార్టీల రాజకీయ నాయకులు సోషల్‌ మీడియానే ప్రచార అస్త్రంగా మార్చుకోనున్నారు. 

మంత్రి సూర్యానారాయణ పాత్రో 

రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి సూర్యనారాయణ పాత్రో ప్రాతినిధ్యం వహిస్తున్న గంజాం జిల్లా దిగపండి   నియోజకవర్గాంతో పాటు రాష్ట్రంలో గల ఇతర జిల్లాల్లో  జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై ఫొటోలు, పత్రికల కథనాల క్లిప్పింగ్‌ జతచేస్తూ సోషల్‌ మీడియాలో పోస్టింగ్‌లు పెడుతున్నారు.  

ఆరోగ్య శాఖమంత్రి :

అధికార పార్టీ బీజేడీకి చెందిన రాష్ట్ర ఆరోగ్య శాఖమంత్రి ప్రతాప్‌ కుమార్‌ జెనా తరచూ ప్రభుత్వ ఆసుపత్రుల్లో కొత్తభవనాల ప్రారంభంతో పాటు ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన ఆరోగ్య పథకాల కార్యక్రమాల ఫొటోలు సోషల్‌ మీడియాలో పోస్టింగ్‌లు పెడుతూ తిరిగి ప్రజల అభిప్రాయాలను స్వీకరిస్తు వాటికి సమాధానాలతో రిప్లై ఇస్తున్నారు. 

శిశు సంక్షేమ మంత్రి ఉషాదేవి  

ఇదే విధంగా రాష్ట్ర శిశు సంక్షేమ ఆభివృద్ధి మంత్రి ఉషాదేవి ప్రాతినిధ్యం వహిస్తున్న చికిటి నియోజకవర్గంతో పాటు రాష్ట్రంలో  ఆమె పాల్గొన్న పలు అభివృద్ధి కార్యక్రమాలకు సబంధించిన ఫొటోలు పత్రికల కథనాలను క్లిప్పింగ్‌లు జతచేస్తూ ఎంతమేరకు నిధులతో పనులు చేపట్టామన్నదీ వివరిస్తూ సోషల్‌ మీడియాలో పోస్టింగ్‌ చేస్తూ తనదైన రీతిలో ప్రచారం చేసకుంటూ ముందుకు సాగుతున్నారు. 

విపక్షాలదీ ఇదే తీరు : 

విపక్షాల నాయకులు కూడా ఇదే తీరును అవలంబిస్తున్నారు. రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీలైన  బీజేపీ నాయకులు, బీజేపీ యువమోర్చా పేరుతో, ఇక కాంగ్రెస్‌ పార్టీ నాయకులు కాంగ్రెస్‌ యువజన సేనల పేర్లతో వాట్సాప్, ఫేస్‌బుక్‌ అకౌంట్‌లు తెరిచి ప్రతి సమస్యను సామాజిక మాధ్యమంలో ప్రచారం చేస్తున్నారు.

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు వసంత్‌ పండా అధికార పార్టీ నాయకులు చేస్తున్న ప్రతి తప్పును లేవనెత్తుతూ విలేకరుల సమావేశం నిర్వహించి వాటి ఫొటోలు, వీడియోలు, పత్రికల్లో ప్రెస్‌మీట్‌లో వెల్లడించగా ప్రచురితమైన కథనాల క్లిప్పింగ్‌లు సోషల్‌ మీడియాలో అప్‌లోడ్‌ చేస్తూ ప్రజలకు తెలిసేలా చేస్తున్నారు.

ఇదే విధంగా కాంగ్రెస్‌ యువజన నాయకులు కూడా కాంగ్రెస్‌ యువజన గ్రూప్‌తో ఇటు అధికార పార్టీ బీజేడీ అటు బీజేపీ చేస్తున్న తప్పుడు ప్రచారాల ఫొటోలు సోషల్‌ మీడియాలో ప్రచారం చేస్తూ ముందుకు సాగుతున్నారు. ఈ విధంగా ప్రధాన పార్టీల నాయకుల ప్రచారాలకు సోషల్‌ మీడియా వేదికగా మారింది.  
 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top