ఫలితాలు, క్రూడ్‌ ధర కీలకం..

Results and crude prices are crucial - Sakshi

దిగ్గజ కంపెనీల ఫలితాలు

ఈ వారమే ఎఫ్‌ అండ్‌ ఓ ముగింపు

మార్కెట్లో ఒడిదుడుకులు

చమురు ధరలు కదలికలూ కీలకమే  

ఈ వారం మార్కెట్‌పై నిపుణులు

న్యూఢిల్లీ: ఈ వారంలో వెలువడే రిలయన్స్‌ ఇండస్ట్రీస్, భారతీ ఎయిర్‌టెల్, విప్రో వంటి దిగ్గజ కంపెనీల క్యూ4 ఫలితాలు మార్కెట్‌కు కీలకమని నిపుణులంటున్నారు. వీటితో పాటు అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల గమనం, ప్రపంచ మార్కెట్ల పోకడ, దేశీ, విదేశీ ఇన్వెస్టర్ల కొనుగోళ్ల సరళి, డాలర్‌తో రూపాయి మారకం తదితర అంశాలు కూడా మార్కెట్‌పై ప్రభావం చూపుతాయని వారంటున్నారు. ఈ నెల డెరివేటివ్స్‌ కాంట్రాక్టులు ఈ గురువారం ముగుస్తున్నందున మార్కెట్లో ఒడిదుడుకులు చోటు చేసుకోవచ్చని విశ్లేషకులంటున్నారు.  

క్యూ4 ఫలితాలు..
ఈ వారంలో మొత్తం 120కంపెనీలు ఆర్థిక ఫలితాలను వెల్లడిస్తున్నాయి. నేడు (సోమవారం) భారతీ ఇన్‌ఫ్రాటెల్, ఎల్‌ఐసీ హౌసింగ్‌ ఫైనాన్స్, రిలయన్స్‌ ఇన్‌ఫ్రా తమ క్యూ4 ఫలితాలను వెల్లడిస్తాయి. రేపు(మంగళవారం–ఈ నెల 24న) భారతీ ఎయిర్‌టెల్, ఐడీఎఫ్‌సీ బ్యాంక్, బుధవారం (ఈ నెల 25న) విప్రో, ఆల్ట్రాటెక్‌ సిమెంట్, ఈ నెల 26న(గురువారం) యాక్సిస్‌ బ్యాంక్, బయోకాన్, యస్‌బ్యాంక్‌లు, ఈ శుక్రవారం(ఈ నెల 27న) రిలయన్స్‌ మారుతీ, ఐడీఎఫ్‌సీలు క్యూ4 ఫలితాలను వెల్లడిస్తాయి.  

పరిమిత శ్రేణిలో మార్కెట్‌...
రానున్న ఎన్నికల షెడ్యూల్‌పై మార్కెట్‌పై దృష్టి ఉంటుందని కోటక్‌ సెక్యూరిటీస్‌ రీసెర్చ్‌ వైస్‌–ప్రెసిడెంట్‌ టీనా వీర్మాణి చెప్పారు. కంపెనీల క్యూ4 ఫలితాలు, బాండ్ల రాబడులు, ముడి చమురు ధరల గమనం కూడా మార్కెట్‌కు ముఖ్యమైన అంశాలేనని పేర్కొన్నారు. పెరుగుతున్న ముడి చమురు ధరలు కేంద్ర ప్రభుత్వ ద్రవ్య, కరంట్‌ అకౌంట్‌ లోటు అంచనాలను కకావికలం చేస్తాయని వివరించారు.  ఈ వారంలో షేర్‌ వారీ కదలికలు ఉంటాయని ఎపిక్‌ రీసెర్చ్‌ సీఈఓ ముస్తఫా నదీమ్‌ చెప్పారు. చాలా కంపెనీలు క్యూ4 ఫలితాలను వెల్లడించనున్నాయని, ఈ ఫలితాలను బట్టి షేర్ల ధరలు అడ్జస్ట్‌ అవుతాయని పేర్కొన్నారు.

ఏప్రిల్‌ సిరీస్‌ ఫ్యూచర్స్, ఆప్షన్ల కాంట్రాక్టులు ఈ గురువారం ముగియనుండడం, పలు కంపెనీలు తమ వార్షిక ఫలితాలను వెల్లడిస్తుండటంతో మార్కెట్లో ఒడిదుడుకులు చోటు చేసుకుంటాయని రిలయన్స్‌ సెక్యూరిటీస్‌ సీనియర్‌ ఎనలిస్ట్‌ వికాస్‌ జైన్‌ పేర్కొన్నారు. సిరియాపై అమెరికా దాడుల వంటి అంతర్జాతీయ ఉద్రిక్తతలు, రూపాయి పతనం, కర్నాటక ఎన్ని కలు సమీపిస్తుండడం వంటి కారణాల వల్ల మార్కెట్‌ పరిమిత శ్రేణిలోనే చలిస్తుందని శామ్‌కో సెక్యూరిటీస్‌ సీఈఓ జిమిత్‌ మోదీ అంచనా వేస్తున్నారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top