
నోట్ల రద్దు హడావుడి చర్య కాదు: పటేల్
పెద్ద నోట్ల రద్దు(డీమోనిటైజేషన్) హడావుడిగా తీసుకున్న నిర్ణయం కాదని.. పూర్తిస్థాయి సంప్రదింపుల తర్వాతే ఈ చర్యను తీసుకున్నట్లు ఆర్‌బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ పేర్కొన్నారు.
ముంబై: పెద్ద నోట్ల రద్దు(డీమోనిటైజేషన్) హడావుడిగా తీసుకున్న నిర్ణయం కాదని.. పూర్తిస్థాయి సంప్రదింపుల తర్వాతే ఈ చర్యను తీసుకున్నట్లు ఆర్‌బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ పేర్కొన్నారు. ‘నోట్ల రద్దు వల్ల తలెత్తే పరిణామాలన్నింటినీ పరిగణనలోకి తీసుకున్నాకే నిర్ణయం వెలువడింది. తదనుగుణంగానే అత్యంత గోప్యతతో కూడిన ఈ ప్రక్రియ, ప్రణాళికను ఆచరణలోకి తీసుకొచ్చాం. సామా న్య ప్రజలకు తక్షణం కొన్ని ఇబ్బందులు ఉంటాయని ప్రభుత్వం, ఆర్‌బీఐకి తెలుసు. వీటని అధిగమించేందుకు అన్నివిధాలుగా చర్యలు తీసుకుంటున్నాం. స్వల్పకాలికంగా ప్రతికూలతలు ఉన్నా.. చాలా పరిమితమే.
రద్దు చేయని నోట్ల సరఫరాను పెంచేందుకు ముమ్మరంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి’ అని పటేల్ వ్యాఖ్యానించారు. మరిన్ని కొత్త రూ.500, రూ.100 నోట్లను ముద్రించేందుకు గడిచిన రెండు వారాల్లో ప్రింటింగ్ ప్రెస్‌లను సమాయత్తం చేశామని పటేల్ వెల్లడించారు. రూ. 2,000 నోట్ల ముద్రణ కూడా భారీగా పెరగనుందని, బ్యాంకులకు ఇవి సరఫరా అయితే ఇబ్బందులకు కొంత అడ్డుకట్ట పడుతుందన్నారు. ఇక బ్యాంకుల్లో నగదు విత్‌డ్రా పరిమితిని ఆర్‌బీఐ ఎప్పటికప్పుడు సమీక్షిస్తోందని.. అవసరాన్నిబట్టి దీనిలో మార్పులు చేస్తామని ఉర్జిత్ తెలిపారు. ఇక మళ్లీ కొత్త రూ.1,000 నోట్లను ప్రవేశపెట్టాలా వద్దా అనేదానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని... ప్రజల అవసరాలకు అనుగుణంగా రానున్న కాలంలో దీనిపై చర్యలు ఉంటాయన్నారు.
రూ.11.85 లక్షల కోట్లు వెనక్కి వచ్చాయ్...
డీమోనిటైజేషన్ తర్వాత ఇప్పటివరకూ రూ.11.85 లక్షల కోట్ల విలువైన పాత రూ.500, 1,000 నోట్లు బ్యాంకింగ్ వ్యవస్థలోకి డిపాజిట్లు, మార్పిడి రూపంలో వెనక్కి వచ్చాయని ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్ ఆర్.గాంధీ పేర్కొన్నారు. కొత్త నోట్ల ప్రింటింగ్‌ను పూర్తి సామర్థ్యంతో జరిపేందుకు ఆర్‌బీఐ, ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నాయన్నారు. తాజా గణాంకాల ప్రకారం చలామణీలో ఉన్న పెద్ద నోట్ల విలువ రూ.15.5 లక్షల కోట్లుగా అంచనా. ‘నోట్ల రద్దు తర్వాత నవంబర్ 10-డిసెంబర్ 5 మధ్య ఆర్‌బీఐ వివిధ డినామినేషన్లలో దాదాపు రూ. 4 లక్షల కోట్ల విలువైన నోట్లను సరఫరా చేసింది. ఈ వ్యవధిలోనే దాదాపు 1910 కోట్ల తక్కువ డినామినేషన్ నోట్లను ఆర్‌బీఐ కౌంటర్లు, బ్యాంకుల ద్వారా అందుబాటులోకి తీసుకొచ్చాం. గడిచిన మూడేళ్లలో ఆర్‌బీఐ సరఫరా చేసిన మొత్తం నోట్ల కంటే ఇవి ఎక్కువ. నోట్ల లభ్యత విషయంలో ప్రజలు ఆందోళన చెందక్కర్లేదు’ అని గాంధీ పేర్కొన్నారు.