రాజీ నుంచి... రాజీనామాకు!! 

RBI Governor Urjit Patel quits - Sakshi

పటేల్‌ రాజీనామాకు బీజం ఎప్పుడు పడిందో తెలుసా? ఈ ఏడాది ఆగస్టు 8న. ఆ తరవాత ఆయన రాజీనామా చేస్తారనే వదంతులూ వచ్చాయి. అప్పట్లో పరిస్థితి సర్దు మణిగినా... ఇప్పుడు తప్పలేదు. ఆ పరిణామాలు చూస్తే...  

2018 ఆగస్టు 8: ఆర్‌ఎస్‌ఎస్‌ సిద్ధాంతకర్త ఎస్‌ గురుమూర్తి, సహకార బ్యాంకింగ్‌ రంగ నిపుణుడు సతీష్‌ మరాఠీలను ఆర్‌బీఐ సెంట్రల్‌ బోర్డులో కేంద్ర ప్రభుత్వం స్వతంత్ర డైరెక్టర్లుగా నియమించింది.  
సెప్టెంబర్‌ మధ్యలో: ఆర్‌బీఐ సెంట్రల్‌ బోర్డు సభ్యుడు, ప్రముఖ బ్యాంకరు నచికేత్‌ మోర్‌కు అర్ధాంతరంగా ఉద్వాసన పలికింది.   

అక్టోబర్‌ 10: డజను పైగా డిమాండ్లకు అంగీకరించేలా రిజర్వ్‌ బ్యాంక్‌ మెడలు వంచేందుకు గతంలో ఎన్నడూ ఉపయోగించని ఆర్‌బీఐ చట్టంలోని సెక్షన్‌ 7 నిబంధనను ప్రయోగిస్తూ ఆర్‌బీఐకి కేంద్రం మూడు లేఖలు రాసింది. వీటికి ఆర్‌బీఐ వారం రోజుల తర్వాత సమాధానాలిచ్చింది.  

అక్టోబర్‌ 23:  ఆర్‌బీఐ దాదాపు ఎనిమిది గంటలపాటు మారథాన్‌ సమావేశం నిర్వహించింది. కా నీ ప్రభుత్వం లేవనెత్తిన పలు అంశాలపై పరిష్కారం లభించకుండానే భేటీ ముగిసింది. 

అక్టోబర్‌ 26: ఆర్‌బీఐ అటానమీని కాపాడాల్సిన అవసరంపై డిప్యుటీ గవర్నర్‌ విరల్‌ ఆచార్య బహిరంగంగానే వ్యాఖ్యలు చేశారు. కాపాడకుంటే మార్కెట్ల ఆగ్రహం చవిచూడాల్సి వస్తుందంటూ వ్యాఖ్యానించారు. 

అక్టోబర్‌ 29: మరో డిప్యుటీ గవర్నర్‌ ఎన్‌ఎస్‌ విశ్వనాథన్‌ కూడా గళమెత్తారు. బ్యాంకుల మూలధన నిష్పత్తులను తగ్గించే విషయంలో ఆర్‌బీఐ విముఖతను స్పష్టం చేశారు.  

అక్టోబర్‌ 31: ఆర్‌బీఐకి స్వయం ప్రతిపత్తి చాలా ముఖ్యమేనని ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే మరింత మెరుగైన గవర్నెన్స్‌ అవసరమని పేర్కొంది. 

నవంబర్‌ 3: మార్కెట్‌ సూచీలు, రూపాయి, క్రూడ్‌ ధరలు అన్నీ బాగానే పుంజుకుంటున్నాయంటూ... కేంద్ర ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి ఎస్‌సీ గర్గ్‌ వ్యాఖ్యానించారు. తద్వారా ఆర్‌బీఐ స్వయం ప్రతిపత్తిపై విరల్‌ ఆచార్య వ్యాఖ్యలకు వ్యంగ్యంగా సమాధానమిచ్చారు. అదే నెల 9వ తారీఖున.. ఆర్‌బీఐ దగ్గర అసలు ఎన్ని నిధులు ఉండాలన్నది నిర్ణయించేందుకు చర్చలు జరుగుతున్నాయని వెల్లడించారు.
ఆర్‌బీఐ, ప్రభుత్వం మధ్య ప్రతిష్టంభన నెలకొనడం మంచిది కాదని గురుమూర్తి వ్యాఖ్యానించారు. కీలక రంగాలకు నిధులందకుండా చేయడం ద్వారా వృద్ధికి విఘాతం కలిగించకూడదంటూ నవంబర్‌ 17న ఆర్‌బీఐ బోర్డు సమావేశానికి రెండు రోజులు ముందు.. ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ వ్యాఖ్యానించారు. 

నవంబర్‌ 19: పది గంటల పాటు ఆర్‌బీఐ సెంట్రల్‌ బోర్డు భేటీ. రిజర్వ్‌ బ్యాంక్‌ వద్ద ఎంత మేర నిధులు ఉండాలన్నది తేల్చేందుకు ప్యానెల్‌ ఏర్పాటుకు నిర్ణయం. చిన్న సంస్థలకు ఊరటనిచ్చే చర్యలు. 

డిసెంబర్‌ 5: ఆర్‌బీఐ, కేంద్రం మధ్య సంధి వార్తల నేపథ్యంలో విభేదాలపై స్పందించేందుకు పటేల్‌ నిరాకరణ. 

డిసెంబర్‌ 10: వ్యక్తిగత కారణాలతో గవర్నర్‌ పదవికి పటేల్‌ రాజీనామా.    

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top