సహకార బ్యాంకులకు వర్తించనున్న రెగ్యులేషన్‌ యాక్ట్‌

President Promulgates Banking Regulation Amendment Ordinance 2020 - Sakshi

ఢిల్లీ : బ్యాంకింగ్‌ రెగ్యులేషన్‌ యాక్ట్‌ సవరణ ఆర్డినెన్స్‌కు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్ శనివారం‌ ఆమోదం తెలిపారు. సహకార బ్యాంకుల నిర్వహణ, నియంత్రణ కోసం కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఆర్డినెన్స్‌ జారీ చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న పట్టణ, సహకార, రాష్ట్ర సహకార బ్యాంకులను భారతీయ రిజర్వ్‌ బ్యాంకు (ఆర్బీఐ) పర్యవేక్షణలోకి తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు జూన్‌ 24న జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఆమోదం లభించింది.  దీంతో దేశవ్యాప్తంగా ఉన్న 1540 సహకార బ్యాంకులు ఆర్బీఐ పరిధిలోకి రానున్నాయి. ఇందులో ప్రభుత్వ బ్యాంకులతోపాటు 1482 అర్బన్‌ కోఆపరేటివ్‌ బ్యాంకులు, 58 మల్టీస్టేట్‌ కోఆపరేటివ్‌ బ్యాకులు ఉన్నాయి. దీంతో కోఆపరేటివ్‌ బ్యాంకులను ఆర్బీఐ నియంత్రణలోకి తీసుకువచ్చే బ్యాంకింగ్‌ రెగ్యులేషన్‌ యాక్ట్‌ సవరణకు కేంద్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఈ ఏడాది ఫ్రిబవరిలో జరిగిన బడ్జెట్‌ సమావేశాల్లో ఈ బిల్లును ప్రవేశపెట్టాలనుకున్నప్పటికీ, కరోనా కేపథ్యంలో అది సాధ్యం కాలేదు. దీంతో తాజాగా ఆర్డినెన్స్‌ తీసుకువచ్చింది.

 ఈ ఆర్డినెన్స్‌ ప్రకారం సహకార బ్యాంకులకు కూడా బ్యాంకింగ్‌ రెగ్యలేషన్‌ యాక్ట్‌, 1949 వర్తించే విధంగా సవరణలు చేశారు. ఈ ఆర్డినెన్స్‌ ద్వారా డిపాజిటర్ల ప్రయోజనాలను పరిరక్షించడానికి సహకార బ్యాంకులను మరింత బలోపేతం చేయనుంది. ఇతర బ్యాంకులతో పాటు సహకార బ్యాంకుల్లో పాలన, పర్యవేక్షణను మెరుగుపరిచేందుకు బ్యాంకింగ్‌ నియంత్రణ కోసం ఆర్‌బీఐతో ఇప్పటికే అందుబాటులో ఉన్న అధికారాలను ఈ ఆర్డినెన్స్‌ మరింత విస్తరించనుంది. అయితే ఈ సవరణలు రాష్ట్ర సహకార చట్టాల కింద ఉన్న సహకార సంఘాల రాష్ట్ర రిజిస్ట్రార్లతో పాటు ప్రాథమిక వ్యయసాయ క్రెడిట్‌ సొసైటీలకు(పీఏసీఎస్‌) వర్తించదు. బ్యాంకింగ్‌ రెగ్యలేషన్‌ చట్టంలో ఉన్న సెక్షన్‌ 45 ప్రకారం బ్యాంకింగ్‌ ఆర్థిక వ్యవస్థకు అంతరాయం కలగకుండా చూడాలి.  ప్రజల ఆసక్తి , డిపాజిటర్లతో పాటు బ్యాంకింగ్ వ్యవస్థను కాపాడటానికి చర్చలు  పాటు ఎలాంటి మారిటోరియం లేకుండా బ్యాంకింగ్‌ పునర్నిర్మాణం లేదా సమ్మేళనం కోసం ఈ ఆర్డినెన్స్‌ను తెచ్చినట్లు రాష్ట్రపతి పేర్కొన్నారు. (ఆర్డినెన్స్‌ గెజిట్ నోటిఫికేషన్‌ కొరకు‌)

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top