భారత్‌ బ్యాంకింగ్‌ అవుట్‌లుక్‌... స్థిరం

Outlook on Indian banks stable: Moodys - Sakshi

మూడీస్‌ నివేదిక

వచ్చే 18 నెలలూ ఓకే

ఆరు అంశాల ప్రాతిపదికన రేటింగ్‌

జీడీపీ వృద్ధి 7.2 శాతంగా అంచనా  

న్యూఢిల్లీ: భారత్‌ బ్యాంకింగ్‌ అవుట్‌లుక్‌ను మరో 12 నుంచి 18 నెలలు ‘స్థిరం’గా ఉంచుతున్నట్లు అంతర్జాతీయ రేటింగ్‌ దిగ్గజ సంస్థ– మూడీస్‌ ఇన్వెస్టర్స్‌ సర్వీస్‌ పేర్కొంది. బ్యాంకింగ్‌ రుణ నాణ్యత బలహీనంగా ఉన్నా...  స్థిరంగా ఉందని వివరించింది. ఇందుకు సంబంధించి మూడీస్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ అండ్‌ సీనియర్‌ క్రెడిట్‌ ఆఫీసర్‌ శ్రీకాంత్‌ వడ్లమాని వివరించిన అంశాల్లో క్లుప్తంగా కొన్ని... 

►బ్యాంకింగ్‌కు స్థిర అవుట్‌లుక్‌ ఇవ్వడంలో ఆరు ప్రమాణాలను అనుసరించడం జరిగింది. నిర్వహణా పరమైన వాతావరణం, రుణ నాణ్యత, మూలధనం, నిధుల సమీకరణ, రుణ లభ్యత, లాభదాయకత, సామర్థ్యం, ప్రభుత్వ మద్దతు. ఆ ఆరు ప్రమాణాల విషయంలో బ్యాంకుల పరిస్థితి ‘స్థిరం’గా ఉంది.  

►ఇక పటిష్ట ఆర్థిక వృద్ధి పరిస్థితులూ బ్యాంకింగ్‌ రంగ స్థిరత్వానికి దోహదపడుతున్నాయి.  
​​​​​​​► 2019 మార్చితో ముగిసే ఆర్థిక సంవత్సరానికి జీడీపీ వృద్ధి రేటు 7.2 శాతంగా ఉంటుందని భావిస్తున్నాం. 2019–2020లో ఈ రేటు 7.4 శాతంగా ఉంటుందని అంచనా. పెట్టుబడులు పెరగడం, పటిష్ట వినియోగం దీనికి కారణం.  
​​​​​​​►కాగా, ఆర్థిక వ్యవస్థలో రుణాలకు సంబంధించి నాన్‌–బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌(ఎన్‌బీఎఫ్‌సీ) చాలా కీలకమైనవి. ఎన్‌బీఎఫ్‌ఐలు ప్రస్తుతం ఎదుర్కొంటున్న లిక్విడిటీ (ద్రవ్య లభ్యత) పరమైన ఇబ్బందులు వృద్ధిని మందగింపజేస్తున్నాయి. వడ్డీరేట్ల పెరుగుదలా ఇక్కడ ప్రతికూలంగా మారుతోంది.  
​​​​​​​► ఇక ప్రత్యేకించి బ్యాంకింగ్‌ రుణ నాణ్యత విషయానికి వస్తే, బలహీనంగా ఉన్నా స్థిరంగా ఉంది. రుణ వృద్ధి తిరిగి పుంజుకుంటోంది. కంపెనీల ఆర్థిక పరిస్థితులు కూడా మెరుగుపడుతున్నాయి. మొండిబకాయిల సమస్యలూ క్రమంగా పరిష్కారమవుతున్నాయి. ఇవన్నీ రుణ లభ్యత మెరుగుకు దోహదపడే అంశాలే. అయితే బడా ఎన్‌పీఏల సమస్య పరిష్కారంపైనే రుణ నాణ్యత పూర్తి మెరుగుదల ఆధారపడి ఉంటుంది.  దివాలా పరిష్కార చట్టం (ఐబీసీ) వచ్చిన రెండేళ్లలో సుమారు రూ.3 లక్షల కోట్ల ఎన్‌పీఏల పరిష్కారానికి అవకాశం ఏర్పడినట్టు కార్పొరేట్‌ వ్యవహారాల శాఖ కార్యదర్శి ఇంజేటి శ్రీనివాస్‌ ఇటీవలే తెలిపారు. బ్యాంకింగ్‌ ఎన్‌పీఏలు రుణాల్లో దాదాపు 12 శాతంగా ఉన్న సంగతి తెలిసిందే.   
​​​​​​​►బ్యాంకింగ్‌ మూలధనం విషయానికి వస్తే, ప్రభుత్వ రంగ బ్యాంకులు ఈ విషయంలో బలహీనంగానే ఉన్నాయి. కనీస మూలధన అవసరాలకు ప్రభుత్వ మూలధన మద్దతుపై ఆధారపడుతున్నాయి.  అయితే కొన్ని సవాళ్లు ఉన్నప్పటికీ, మూలధన అవసరాలను తట్టుకోగల పరిస్థితుల్లో బ్యాంకులు కొనసాగుతున్నాయి.  
​​​​​​​► బ్యాంకుల లాభదాయకత మెరుగుపడుతోంది. అయితే అధిక రుణ వ్యయాలు లాభదాయకతకు ప్రతికూలంగా తయారవుతున్నాయి.  
​​​​​​​►మూడీస్‌ దేశంలో 15 వాణిజ్య బ్యాంకులకు రేటింగ్‌ ఇస్తోంది. మొత్తం బ్యాంకింగ్‌ రుణాల్లో ఈ బ్యాంకుల వాటా 70 శాతం. ఈ 15 బ్యాంకుల్లో 11 ప్రభుత్వ రంగ బ్యాంకుల ఆర్థిక స్థితిగతులు ప్రైవేటు రంగ బ్యాంకులతో పోల్చితే, బలహీనంగా ఉన్నాయి. 

రిటైల్‌ రుణాల్లో ఆ 11 బ్యాంకులు బాగున్నాయి: జఫ్రీన్‌ 
మొండిబకాయిల (ఎన్‌పీఏ) భారంతో రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) దిద్దుబాటు చర్యల ప్రక్రియ (పీసీఏ) కిందకు వెళ్లిన 11 ప్రభుత్వ రంగ బ్యాంకుల రిటైల్‌ రుణాలు బాగున్నాయని అమెరికన్‌ బ్రోకరేజ్‌ సంస్థ– జఫ్రీస్‌ పేర్కొంది.  2015 మార్చిలో మొత్తం రిటై ల్‌ రుణాల్లో ఈ 11 బ్యాంకుల వాటా 15 శాతం అయితే, 2018 సెప్టెంబర్‌లో ఈ వాటా 4 శాతం పెరిగి 19 శాతానికి చేరిందని ఈ సంస్థ నివేదిక పేర్కొంది. పీసీఏ పరిధిలోకి వెళ్లిన బ్యాంకుల్లో అలహాబాద్‌ బ్యాంక్, యూబీఐ, కార్పొరేషన్‌ బ్యాంక్, ఐడీబీఐ బ్యాంక్, యుకో బ్యాంక్, బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, ఇండియన్‌ ఓవర్‌సీస్‌ బ్యాంక్, ఓరియెంటల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ కామర్స్, దేనా బ్యాంక్, బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్రలు ఉన్నాయి. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top