లిక్విడిటీ ఫండ్స్‌కు లాకిన్‌?

Lockin for liquidity funds? - Sakshi

కఠిన నిబంధనల తీసుకొచ్చే యోచనలో సెబీ

న్యూఢిల్లీ: ఐఎల్‌ఎఫ్‌ఎస్‌ సంక్షోభం అనంతరం మార్కెట్లో లిక్విడిటీ (నిధుల లభ్యత) సమస్య నెలకొనడంతో లిక్విడిటీ ఫండ్స్‌ విషయంలో కఠిన నిబంధనలను తీసుకురావాలని సెబీ యోచిస్తోంది. లిక్విడ్‌ ఫండ్స్‌లో పెట్టుబడులను ఇన్వెస్ట్‌ చేసిన తర్వాత ఎప్పుడైనా తీసుకునే వెసులుబాటు ప్రస్తుతం ఉంది. అయితే, స్వల్ప కాలం పాటు లాకిన్‌ తీసుకురావాలన్నది సెబీ ప్రతిపాదనగా తెలిసింది.

30 రోజులు అంతకంటే ఎక్కువ కాల వ్యవధి కలిగిన బాండ్ల విలువను మార్క్‌ టు మార్కెట్‌ చేయడాన్ని కూడా సెబీ తప్పనిసరి చేయాలనుకుంటోంది. ప్రస్తుతం 60 రోజులు, అంతకు మించి కాల వ్యవధి ఉన్న బాండ్లపైనే ఫండ్స్‌ సంస్థలు మార్క్‌ టు మార్కెట్‌ విలువను పరిగణనలోకి తీసుకుంటున్నాయి. దీనిపై సెబీ నియమించిన మ్యూచువల్‌ ఫండ్‌ అడ్వైజరీ కమిటీ చర్చిస్తుందని, అనంతరం సెబీ సంప్రతింపులు చేపట్టే అవకాశం ఉందని అధికార వర్గాలు తెలియజేశాయి.  

సంస్థాగత ఇన్వెస్టర్లపై ప్రభావం
లిక్విడ్‌ ఫండ్స్‌లో స్వల్పకాల లాకిన్‌ అనేది ఇనిస్టిట్యూషనల్‌ ఇన్వెస్టర్లపై ప్రభావం చూపిస్తుందని క్వాంటమ్‌ మ్యూచువల్‌ ఫండ్‌ ఎండీ, సీఈవో జిమ్మీ పటేల్‌ తెలిపారు. అధిక లిక్విడిటీ (అవసరమైన సందర్భాల్లో నిధులను వెనక్కి తీసుకునే వెసులుబాటు) వల్లే ఇనిస్టిట్యూషనల్‌ ఇన్వెస్టర్లు లిక్విడ్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేయడానికి మొగ్గు చూపుతుంటారని పేర్కొన్నారు.

‘‘లిక్విడ్‌ ఫండ్స్‌లో ఎక్కువగా పాల్గొనేది కార్పొరేట్లు, బ్యాంకులు తదితర ఇనిస్టిట్యూషనల్‌ ఇన్వెస్టర్లే. లాకిన్‌ పీరియడ్‌ అన్నది వీరిపై ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. అదే సమయంలో స్థిరమైన ఎన్‌ఏవీ వల్ల రిటైల్‌ ఇన్వెస్టర్లకు లాభం కలుగుతుంది’’ అని బ్యాంక్‌ బజార్‌ హెడ్‌ ఆదిత్య బజాజ్‌ పేర్కొన్నారు.

ఆస్తుల అమ్మక ప్రక్రియను ఆరంభించిన ఐఎల్‌ఎఫ్‌ఎస్‌
భారీ రుణ సంక్షోభంలో చిక్కుకున్న ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ గ్రూపు,  ఆస్తుల అమ్మక ప్రక్రియను ఆరంభించింది. ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ సెక్యూరిటీ సర్వీసెస్, ఐఎస్‌ఎస్‌ఎల్‌ సెటిల్‌మెంట్‌ అండ్‌ ట్రాన్సాక్షన్‌ సర్వీసెస్‌లో తనకున్న వాటాలను విక్రయించే ప్రక్రియను మొదలు పెట్టింది.

ఆర్ప్‌వుడ్‌ క్యాపిటల్, జేఎం ఫైనాన్షియల్‌ సంస్థలను సలహాదారులగా నియమించుకుంది. ఈ మేరకు తాజా ప్రగతిపై కార్పొరేట్‌ వ్యవహారాల శాఖకు ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ నివేదికను సమర్పించింది. గ్రూపు సమస్యల పరిష్కారానికి ప్రతిపాదించిన వాటిల్లో ఆస్తుల విక్రయం ద్వారా నిధుల సమీకరణ కూడా ఒకటి. ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ గ్రూపు సంస్థలన్నీ కలిపి రూ.94,215 కోట్ల రుణ భారాన్ని కలిగి ఉన్న విషయం గమనార్హం.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top