సేవలు కుదేలు...

India is service activity sinks at historic rate in April - Sakshi

చరిత్రాత్మక కనిష్ట స్థాయికి క్షీణత

ఏప్రిల్‌లో 5.4 పాయింట్లకు పీఎంఐ సూచీ డౌన్‌

లాక్‌డౌన్‌ ప్రభావం

తయారీ రంగం కూడా కకావికలం

ముంబై: కరోనా వైరస్‌ కట్టడికి అమలు చేస్తున్న లాక్‌డౌన్‌ దెబ్బతో దేశీయంగా సేవల రంగం కార్యకలాపాలు పూర్తిగా స్తంభించిపోయాయి. ఏప్రిల్‌లో చరిత్రాత్మక కనిష్ట స్థాయికి తగ్గిపోయాయి. సేవల రంగం తీరుతెన్నులను ప్రతిబింబించే ఐహెచ్‌ఎస్‌ మార్కిట్‌ ఇండియా సర్వీసెస్‌ బిజినెస్‌ యాక్టివిటీ సూచీ గత నెల ఏకంగా 5.4 పాయింట్లకు క్షీణించడం ఇందుకు నిదర్శనం. 2005 డిసెంబర్‌లో దీన్ని మొదలుపెట్టినప్పట్నుంచీ చూస్తే ఈ స్థాయికి పడిపోవడం ఇదే ప్రథమం.

లాక్‌డౌన్‌ కారణంగా డిమాండ్‌ పడిపోయి, వ్యాపారాలు మూతబడి, దాదాపుగా లావాదేవీలన్నీ నిల్చిపోవడం ఇందుకు కారణమని పరిశ్రమవర్గాలు తెలిపాయి. మార్చిలో ఈ సూచీ 49.3గా ఉంది. ఐహెచ్‌ఎస్‌ మార్కిట్‌ ఇండియా సర్వీసెస్‌ పర్చేజింగ్‌ మేనేజర్స్‌ (పీఎంఐ) సూచీ ప్రమాణాల ప్రకారం.. ఇండెక్స్‌ 50 పాయింట్లకు పైన ఉంటే వృద్ధిని, దిగువన ఉంటే క్షీణతను సూచిస్తుంది. ‘సూచీ ఏకంగా 40 పాయింట్లు పడిపోవడమనేది.. లాక్‌డౌన్‌ను కఠినతరంగా అమలు చేయడంతో సేవల రంగం పూర్తిగా స్తంభించిపోయిందనడానికి నిదర్శనం‘ అని ఐహెచ్‌ఎస్‌ మార్కిట్‌ ఆర్థికవేత్త జో హేస్‌ తెలిపారు.

కాంపోజిట్‌ కూడా డౌన్‌..
ఇక సేవలతోపాటు తయారీ రంగ ఉత్పాదకతను కూడా ప్రతిబింబించే కాంపోజిట్‌ పీఎంఐ అవుట్‌పుట్‌ సూచీ కూడా ఏప్రిల్‌లో 7.2 పాయింట్లకు పడిపోయింది. మార్చిలో ఇది 50.6 పాయింట్లుగా నమోదైంది. 2005లో ఈ గణాంకాలు సేకరించడం ప్రారంభించినప్పట్నుంచీ ఇంత భారీగా క్షీణత నమోదు కావడం ఇదే తొలిసారని హేస్‌ వివరించారు. విదేశీ విక్రయాలు పూర్తిగా నిల్చిపోయాయి. ఇందుకు సంబంధించిన సూచీ 0.0 పాయింట్లకు క్షీణించింది. వైరస్‌ వ్యాప్తిని కట్టడి చేసేందుకు తీసుకున్న కఠిన చర్యలతో కీలక విదేశీ మార్కెట్లలో డిమాండ్‌ పడిపోయిందని వ్యాపార సంస్థలు వెల్లడించాయి.

కరోనా మహమ్మారి కారణంగా ఆర్థిక నష్టం భారత్‌లో చాలా భారీగానే ఉన్నట్లు ఈ గణాంకాల ద్వారా తెలుస్తోందని హేస్‌ చెప్పారు. అయితే, గడ్డుకాలాన్ని గట్టెక్కామనే ఆశావహ అభిప్రాయం నెలకొందని, లాక్‌డౌన్‌పరమైన ఆంక్షలను క్రమంగా ఎత్తివేసే కొద్దీ పరిస్థితులు మెరుగవుతాయనే అంచనాలు ఉన్నాయని ఆయన వివరించారు. ఉద్యోగాల కోత కూడా  ఉన్నప్పటికీ సర్వేలో పాల్గొన్న 90 శాతం సంస్థలు .. ఉద్యోగుల సంఖ్యను దాదాపు అదే స్థాయిలో కొనసాగిస్తున్నట్లు వెల్లడించాయని పేర్కొన్నారు. ఇక మార్చితో పోలిస్తే ముడివస్తువులు, ఉత్పత్తుల ధరలు తగ్గాయని తెలిపారు. మరోవైపు, తాజా సర్వే డేటా ప్రకారం ఏప్రిల్‌లో వ్యాపార విశ్వాసం మరింతగా క్షీణించింది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top