డొమెయిన్ల వ్యాపారంలో ‘హై’దరాబాద్‌

hyderabad top in domains business - Sakshi

భాగ్యనగరి నుంచి 20 శాతం ట్రేడర్లు

 వీరి చేతిలో 40,000 డొమెయిన్లు

 జెనెరిక్‌ వెబ్‌ అడ్రస్‌లదే హవా  

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: పేరులో ఏముందనుకోవద్దు!! ఇంటర్నెట్‌ ప్రపంచంలో చక్కని పేరు దొరికితే సగం పని అయినట్లేనని భావిస్తుంటారంతా!! వెబ్‌సైట్‌ పేరు గుర్తుండిపోయేలా ఉంటే వ్యాపారానికి తిరుగుండదని, కస్టమర్లను సులువుగా చేరుకోవచ్చని కంపెనీల భావన. ఇందుకు ఎంత ఖర్చయినా పెడతారు కూడా. అదే ఇప్పుడు డొమెయిన్‌ ట్రేడర్లకు కలసివస్తోంది. సేవలు, ఉత్పత్తుల ఆధారంగా వాడుకలో ఉన్న పేర్లతో జెనెరిక్‌ డొమెయిన్లను వీరు నమోదు చేసి విక్రయిస్తున్నారు. వీటిలో కోట్ల రూపాయలకు అమ్ముడవుతున్న డొమెయిన్లూ ఉన్నాయంటే ఆశ్చర్యం వేయకమానదు. నమోదవుతున్న ఇంటర్నెట్‌ వెబ్‌ అడ్రస్‌లలో 80 శాతం జెనెరిక్‌ పేరుతోనే ఉంటున్నాయి. అయితే ఈ రంగంలో హైదరాబాద్‌ అగ్ర స్థానంలో ఉండడం విశేషం.

టాప్‌లో హైదరాబాద్‌..
దేశవ్యాప్తంగా డొమెయిన్ల క్రయ, విక్రయాల్లో 100కుపైగా ప్రముఖ ట్రేడర్లున్నారు. అలాగే చిన్నాచితకా మరో 1,000 మంది దాకా కార్యకలాపాలు సాగిస్తున్నారు. మొత్తం ట్రేడర్లలో 20 శాతం హైదరాబాద్‌ నుంచి ఉంటారని డొమెయిన్‌ నేమ్స్‌ కన్సల్టింగ్, బ్రోకరేజ్‌లో ఉన్న అతిపెద్ద కంపెనీ నేమ్‌కార్ట్‌.కామ్‌ చెబుతోంది.

ఐటీ రంగం ఇక్కడ వృద్ధి చెందడం ఈ స్థాయిలో విక్రేతలుండడానికి ప్రధాన కారణమని ప్రముఖ ఇన్వెస్టర్‌ అరవింద్‌ రెడ్డి ‘సాక్షి బిజినెస్‌ బ్యూరో’ ప్రతినిధితో చెప్పారు. ఐటీపై పట్టు ఉండడంతో ఈ వ్యాపారాన్ని అర్థం చేసుకున్నారని, హైదరాబాద్‌ ట్రేడర్ల వద్ద అమ్మకానికి ఎంతకాదన్నా 40,000 పైచిలుకు డొమెయిన్లు ఉంటాయని చెప్పారు. హైదరాబాద్‌ తర్వాత బెంగళూరు, ఢిల్లీ, ముంబై, కోల్‌కతా నగరాలు ట్రేడింగ్‌లో టాప్‌లో నిలిచాయి.

జెనెరిక్స్‌ ఎవర్‌ గ్రీన్‌..
కంపెనీల పేర్లతో కాకుండా రెండు రకాలుగా ఇంటర్నెట్‌ వెబ్‌ అడ్రస్‌లుంటాయి. బ్రాండబుల్స్‌ / మేడ్‌ అప్స్‌ కోవలోకి యాహూ, స్నాప్‌డీల్, మింత్రా, ఈబే, ఓలా, ఓయో వంటి పేర్లు వస్తాయి. క్రెడిట్‌కార్డ్స్‌.కామ్, వెకేషన్‌.కామ్, షాదీ.కామ్, నౌక్రీ.కామ్, బ్యాంక్‌బజార్‌.కామ్‌ వంటి డొమెయిన్లు జెనెరిక్‌ విభాగంలో ఉంటాయి.

అంటే సేవలు, ఉత్పత్తుల ఆధారంగా రూపుదిద్దుకున్న పేర్లన్న మాట. మరోవైపు డాట్‌(.)కామ్‌ డొమెయిన్లకు అంతర్జాతీయంగా ఆదరణ ఎప్పటికీ అలానే ఉందని నేమ్‌కార్ట్‌ సీఈవో ప్రఖార్‌ బిందాల్‌ తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా డాట్‌ కామ్‌ డొమెయిన్లు 30 కోట్ల పైచిలుకు ఉన్నాయి. కొత్తగా ఏటా కోటి నమోదవుతున్నాయి. స్టార్టప్‌లూ డాట్‌ కామ్‌ వెబ్‌ అడ్రస్‌లే తీసుకుంటున్నాయి. ఇక డాట్‌(.)ఇన్‌ డొమెయిన్లు ప్రాచుర్యం కోల్పోతున్నాయి.

అన్నీ విలువైనవే..
యువ వ్యాపారవేత్తలు ఈ రంగాన్ని ఆన్‌లైన్‌ అసెట్స్‌గా పరిగణిస్తున్నారు. ఇన్సూరెన్స్‌.కామ్‌ రూ.160 కోట్లు, వెకేషన్‌రెంటల్స్‌.కామ్‌ రూ.140 కోట్లు, ఇంటర్నెట్‌.కామ్‌ రూ.126 కోట్లు, ఎఫ్‌బి.కామ్‌ రూ.38 కోట్లు, వాట్‌.కామ్‌ రూ.1.62 కోట్లు, కేక.కామ్‌ రూ.20 లక్షలకు అమ్ముడుపోయాయని సమాచారం. నాన్‌ డిస్‌క్లోజర్‌ ఒప్పందాలు ఉంటాయి కాబట్టి చాలా డీల్స్‌ బయటి ప్రపంచానికి తెలియవని పరిశ్రమ నిపుణుడు సాయి ప్రకాశ్‌ పోలా చెప్పారు. దేశవ్యాప్తంగా డాట్‌ కామ్‌/నెట్‌/ఓఆర్‌జీ/ఇన్‌ ఎక్స్‌టెన్షన్లు సుమారు 40 లక్షలు నమోదైనట్టు సమాచారం.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top